సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో : పెట్రో కెమికల్ కారిడార్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు వస్తాయని, ఇందుకు పలు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడ చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తూ ‘ఫెసిలిటేటర్’గా పని చేస్తుందన్నారు. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ‘సీపెట్’ ప్రారంభోత్సవానికి విజయవాడ వచ్చిన ఆయన గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లో..
డిమాండ్‌కు అనుగుణంగా యూరియా
ప్రత్యేక హోదా చాలా సంక్లిష్టమైన అంశం. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇస్తే.. దేశంలోని చాలా రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయి. హోదా అనే పదం తప్ప.. అన్ని రకాలుగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడానికి కేంద్రం సిద్ధం. పెట్రో కెమికల్ కారిడార్ ద్వారా, ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. దేశంలోని నాలుగు ప్రధాన యూరియా ప్లాంట్లు 2002లో మూతబడ్డాయి. వాటిని పునురుద్ధరించడానికి రూ.1,500 కోట్లు వ్యయం చేశాం. త్వరలో రామగుండం యూనిట్ ప్రారంభం కానుంది. మిగతావీ కూడా దశల వారీగా పునరుద్ధరించనున్నాం. 2023 నాటికి యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించనున్నాం.
వినియోగం ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లో రిజర్వాయర్లు నీటితో నిండుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో యూరియా అదనంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. డిమాండ్‌కు అనుగుణంగా అదనపు యూరియా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పాస్పరస్, పొటాష్ తయారీకి ముడి సరుకుల కోసం పూర్తిగా దిగుమతుల మీదే ఆధారపడాలి. అంతర్జాతీయంగా టెండర్లు ముందుగానే పిలుస్తున్నాం. ధర హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తప్పించుకోవడానికి అంతర్జాతీయ కంపెనీలతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
పరిశోధనలకు ప్రోత్సాహం
‘రసాయన’ పదం వినగానే పర్యావరణానికి హాని అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. దాని వల్ల ఉపయోగాలను మరిచిపోకూడదు. పర్యావరణానికి హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క ఎరువుల ఉత్పత్తి రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ సవాళ్లు పెరిగాయి. వాటిని అధిగమించే వినూత్న మార్గాలను కనిపెట్టే విధంగా పరిశోధనలు జరగడం లేదు. ఇటీవల నేను జర్మనీ వెళ్లాను. సాంకేతిక, వినూత్న ఆవిష్కరణలు చూస్తే ఆశ్చర్యం కలిగింది. దేశంలోని ప్రతి ఉత్పత్తి ప్లాంటులోనూ పరిశోధన కేంద్రం ఉండాలి. అన్ని రంగాల్లో పరిశోధనలు విస్తృతంగా చేపట్టడానికి తగిన ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తుంది.
ఆర్గానిక్ ఎరువుల వినియోగానికి ప్రాధాన్యత
వచ్చే ఐదు సంవత్సరాల్లో రసాయన ఎరువుల వినియోగాన్ని కనీసం 25 శాతం తగ్గించి, ఆమేరకు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ‘సిటీ కంపోస్ట్’ విధానాన్ని తీసుకొచ్చాం. దేశంలో రోజూ 1.5 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు పోగవుతున్నాయి. అందులో 30–70 శాతం వ్యర్థాలు.. సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగపడే పదార్థాలే.
దీని కోసం దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ కంపోస్ట్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించాం. తొలుత నాలుగు నగరాల్లో ఏర్పాటు చేయనున్నాం. దీని ద్వారా రైతులకు అవసరమైన సేంద్రియ ఎరువులను అందించడంతో పాటు ఘన వ్యర్థాల సమస్యనూ పరిష్కరించడానికి అవకాశం ఉంది. ‘స్వచ్ఛ భారత్’ లక్ష్యాలు కూడా నెరవేరతాయి.
Comments
Please login to add a commentAdd a comment