'త్వరలో ఆంధ్ర, తెలంగాణ ప్రాజెక్టులపై చర్యలు'
న్యూఢిల్లీ: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతున్న 29 ప్రాజెక్టులపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. వీటిపై రెండు రాష్ట్రాలతో సమావేశమై ఆ ప్రాజెక్టులను చేపడతామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం రైల్వే బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల్లోని రైల్వే ప్రాజెక్టులపై మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైల్వే అధికారులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక రాగానే దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో చేపడుతున్న ప్రాజెక్టులకు గత సంవత్సరం కంటే ఎక్కువగా కేటాయిస్తామని ఆయన అన్నారు. ఇది గత సంవత్సరం కంటే 57 శాతం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, అమూల్ సాయంతో ప్రత్యేకంగా పాల రవాణా బోగీలను రూపొందిస్తామని, అంతేకాకుండా సౌర విద్యుత్తును అత్యధికంగా ఉపయోగించుకునేలా చూస్తామన్నారు. రైల్వే ఆస్తులపై పీపీపీ పద్ధతిలో సోలార్ ప్యానళ్లు ఏర్పాటుచేయడానికి సుముఖంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల రైల్వేశాఖకు చాలా నష్టాలు వస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. వీటిని అధిగమించడానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.