మగతనిద్రలో..మన నేతలు | 'TDP leaders Neglect on Petroleum University | Sakshi
Sakshi News home page

మగతనిద్రలో..మన నేతలు

Published Tue, Feb 3 2015 1:24 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

మగతనిద్రలో..మన నేతలు - Sakshi

మగతనిద్రలో..మన నేతలు

సొంతానికి కలిసి వస్తుందంటే చాలు కలసికట్టుగా పట్టుబిగిస్తారు. పైసా ప్రయోజనం లేదంటే దరిదాపుల్లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేయరు. ఇదీ ప్రస్తుతం జిల్లాలో  అధికార పార్టీ ముఖ్యనేతల తీరు. రాక, రాక జిల్లాకు వచ్చిన పెట్రో వర్సిటీ పక్క జిల్లాకు తరలిపోయే పరిస్థితి తరుముకు వస్తున్నా వారికి పట్టింపు లేదు. జిల్లా ప్రగతికి దోహదపడే ఈ జ్ఞాననిలయం పట్ల నేతల నిర్లక్ష్యాన్ని పలువురు ఖండిస్తున్నారు. ఇకనైనా..వచ్చిన అవకాశం చేజారిపోకుండా నడుం బిగించాలని కోరుతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :అపార చమురు, సహజవాయువు నిక్షేపాలున్న ప్రాంతంగా జిల్లాకు ప్రపంచ చమురు పటంలో ప్రత్యేక స్థానం ఉంది. ఓఎన్‌జీసీ, రిలయన్స్, జీఎస్‌పీసీ తదితర చమురు సంస్థల కార్యకలాపాలకు కృష్ణా, గోదావరి బేసిన్‌లోనే కీలక కేంద్రంగా ఉంది. అటువంటి జిల్లాలో పెట్రోలియం యూని వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర విభజన అనంతరం కేంద్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చమురు, సహజయవాయువు నిల్వలున్న జిల్లాలో పెట్రో ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు కానున్నాయని చంద్రబాబు సర్కార్ పదేపదే చెబుతూ వస్తోంది. పెట్రో కారిడార్, కాకినాడ ఎస్‌ఈజడ్‌లో రూ.50 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న  ప్రతిపాదిత పరిశ్రమలు కూడా పెట్రో ఆధారితమైనవే. ఆ క్రమంలోనే కాకినాడ తీరంలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటుకు కూడా ఇటీవలనే ఆమోదం కూడా లభించింది. ఇన్ని సానుకూలతలున్న జిల్లాలో ఏర్పాటు కావాల్సిన పెట్రో యూనివర్సిటీ పొరుగు జిల్లా విశాఖకు తరలిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
 
 రాయ్‌బరేలీలోని రాజీవ్‌గాంధీ పెట్రో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఓపీ గుప్తా ఆధ్వర్యంలో కేంద్రం నియమించిన కమిటీ వర్సిటీ ఏర్పాటుకు రాజానగరం, మండపేట, కాకినాడ తదితర ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించింది. దివాన్‌చెరువు సమీపాన వేపాలదిబ్బలు, రిజర్వుఫారెస్టు తదితర ప్రాంతాలను బృందం పరిశీలించింది.  వీటిపై కమిటీ సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూశారు. కేంద్ర కమిటీ తుది పరిశీలన జరిపిన మండపేట రూరల్ ద్వారపూడికి సమీప ప్రాంతం సానుకూలంగా లేదంటూ ఇటీవల తిరస్కరించిన సంగతి తెలిసిందే. కేవలం భూములు సానుకూలంగా లేవనే కారణంతో పెట్రో వర్సిటీ మళ్లిపోతే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదని మేధావి వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాకినాడ సెజ్,  ఎల్‌ఎన్‌జీ టెర్మినల్, మధురపూడి విమానాశ్రయం...ఇలా పలు కలిసివచ్చే ప్రాజెక్టుల భూ సేకరణకైతే ముందుకు వచ్చే అధికారపార్టీ నేతలు ప్రతిష్టాత్మక పెట్రో వర్సిటీ భూ సేకరణ వైపు కన్నెత్తిచూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీకి 50 నుంచి 80 ఎకరాలు సరిపోతుం దని అంచనా. ప్రాజెక్టుల భూ సేకరణలో చొరవ తీసుకుంటే కలిగే ప్రయోజనం వర్సిటీ వల్ల ఉండదనే ఉద్దేశంతోనే నిమ్మకు నీరెత్తినట్టు, మగత నిద్రలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 ఇక్కడుంటేనే అన్నిందాలా మేలు..
 సహజవాయువు, చమురు నిక్షేపాలు ఇక్కడ ఉండి, పెట్రో వర్సిటీ మరొక జిల్లాలో ఉండటం ప్రయోజనకరం కాదని ఆ రంగంపై కొద్దోగొప్పో అవగాహన ఉన్న వారు అభిప్రాయపడుతున్నారు. సహజ నిక్షేపాలు అపారంగా ఉన్న ఈ ప్రాంతంలో పెట్రో వర్సిటీ ఏర్పాటైతే పరిశోధన లకు, సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం కలుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు, వర్సిటీలో జిల్లావాసులు చదువుకునే అవకాశంతో పాటు భవిష్యత్ తరాలకు ఎంతో మేలు కలుగుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న వర్సిటీ ఏర్పాటులో ఎదురయ్యే ప్రతిబంధకాలను విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు సానుకూలంగా మలుచుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నెల 4న కేంద్ర కమిటీని ఆ జిల్లాకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో అక్కడి నేతలున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి జిల్లా నేతలు తమ వంతు ప్రయత్నం చేయాలని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 
 ఉద్దండులంతా కలిసి అడ్డుకోలేరా..?
 ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన ముఖ్యనేతలు జిల్లాలో చాలా మందే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సర్కార్‌లో నంబర్-2గా ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వీరిద్దరు కాక అధికారపార్టీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. సీఎం చంద్రబాబుతో సాన్నిహిత్యం కలిగిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, కేంద్రస్థాయిలో పదవులపై పదవులు వరిస్తున్న కాకినాడ ఎంపీ తోట నరసింహం, సహజవాయువు నిక్షేపాలున్న ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వంటి వారు పెట్రో వర్సిటీ తరలిపోకుండా అడ్డుకోలేరా అని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. కాకినాడ వద్ద వాకలపూడి, వలసపాక ల, రాజానగరం-కాకినాడపోర్టు రోడ్డు, కాకినాడ-యానాం జాతీయరహదారికి ఇరువైపులా వందలా ది ఎకరాలున్నాయి. వాటిలో వర్సిటీ ప్రతిపాదిం చేలా చిత్తశుద్ధి తో కూడిన ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుతున్నా రు. కేంద్ర కమిటీ పెదవి విరిచినా.. కలెక్టర్ అరుణ్‌కుమార్ పట్టువిడవకుండా జిల్లాలో అన్ని మండలాల త హశీల్దార్లను పెట్రోవర్సిటీకి అనువైన భూముల వివరా లు 20 రోజుల్లో పంపాలని కోరారు. జాయింట్ క లెక్టర్ సత్యనారాయణ అదే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకునివర్సిటీ తరలిపోకుండా చూడాలని జిల్లావాసులు కోరుతున్నారు.
 
 ప్రజాప్రతినిధుల వైఫల్యమే..
 జిల్లాలో పెట్రో యూనివర్సిటీ విషయంలో జరుగుతున్న అన్యాయానికి ప్రజాప్రతినిధుల వైఫల్యమే కారణం.  పెట్రో వర్సిటీని చమురు కార్యకలాపాల వల్ల బ్లో అవుట్‌లు, ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతు కోనసీమలో ఏర్పాటు చేయాలి.  
 - కుడుపూడి సూర్యనారాయణరావు,
 ఓఎన్జీసీ పోరాట సమితి కన్వీనర్, అమలాపురం
 
 చంద్రబాబు కృషి చేయాలి..
 నవ్యాంధ్రలో ఏర్పాటు చేసే యూనివర్సిటీలను వికేంద్రీకరిస్తామంటున్న చంద్రబాబు కోనసీమలో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలి. రాజమండ్రిలో నన్నయ్య, కాకినాడలో జేఎన్‌టీయూకే ఉన్నందున కోనసీమలో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి.
 - డాక్టర్ ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం,
 ఎస్‌కేబీఆర్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్, అమలాపురం
 
 తరలింపు యోచన విరమించాలి..
 జిల్లాకు కేటాయించిన పెట్రో వర్సిటీ తరలింపును ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు. జిల్లాకు కేటాయించిన యూనివర్సిటీని మరో జిల్లాకు తరలించే ఆలోచన మానుకోవాలి.  వర్సిటీకి అనువైన స్థలాలు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి.
 -పెద్దిరెడ్డి రవికిరణ్, బీజేపీ ఐటీ సెల్ జిల్లా కన్వీనర్
 
 ఇక్కడ ఏర్పాటైతే ఎంతో మేలు..
 పెట్రో యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటైతే ఎంతో మేలు కలుగుతుంది.    సహజవనరులు అధికంగా ఉన్న ప్రాంతంలో యూనివర్సిటీ ఉంటేనే మేలు జరుగుతుంది.    
 - ఇ.ధనుంజయరావు, ఆదికవి నన్నయ వర్సిటీ రిజిస్ట్రార్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement