పవన్‌పై భ్రమలు తొలగిపోయాయి
అసలు ఆ పార్టీకి సిద్ధాంతమంటూ ఉందా?
జనసేన శ్రేణుల్లో తొలిచేస్తున్న ప్రశ్నలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నవతరం రాజకీయాలకు ఆలంబన అని...ఇప్పుడున్న రాజకీయాలకు భిన్నమైన ఆలోచనలతో పురుడుపోసుకున్న పార్టీ అని..పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అగ్రాసనం వేస్తామనే అజెండాతో వచ్చిందీ జనసేన అని చెప్పడంతో నిజమనుకుని నమ్మి జనసేనలో పలువురు చేరారు. ఇన్నేళ్లూ ఆ పార్టీని భుజాన వేసుకుని కార్యక్రమాల కోసం లక్షలు తగలేసుకున్నారు. అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి అవన్నీ గాలి కబుర్లేనని తెలిసొచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే ఆవేదన ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది.
రాజకీయ పార్టీ అంటే గెలుపు ఓటముల ప్రమేయం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలి. అటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ముఖం చాటేసినప్పుడే ఆ పార్టీకి ఓ సిద్ధాంతం లేదని తేలిపోయిందని అప్పట్లోనే ఆ శ్రేణులు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరును విభేదించాయి. అయినా, ఆయన పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి పొత్తులంటూ తలాతోకా లేని నిర్ణయాలతో పార్టీని, ఆ పార్టీని నమ్ముకున్న నాయకులను తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా చేసేశారని మండి పడుతున్నారు.
పొత్తుతో మరింత దిగజారి..
టీడీపీతో పొత్తులో కనీసం 50 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తారని పార్టీ నేతలు, పవన్ అభిమానులు ఆశగా ఎదురు చూశారు. చివరకు మూడింట ఒక వంతు సీట్ల కంటే తక్కువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనిని సమర్థించుకుంటూ పవన్ కల్యాణ్..‘మన బలం మనం తెలుసుకోకుండా ఎన్ని అంటే అన్ని సీట్లు ఎలా అడిగేస్తాం? గత ఎన్నికల్లో కనీసం నన్ను కూడా గెలిపించుకోలేకపోయామని ప్రశ్నిస్తూ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన గందరగోళం సృష్టించారు.
గోదావరి జిల్లాలపైనే ఆశలు!
రాష్ట్రంలో కొద్దోగొప్పో పార్టీకి మనుగడ ఉందంటే అది గోదావరి జిల్లాల్లోనేనని ఆ పార్టీ నాయకుల మాట. దీనికి బలం చేకూర్చేలా ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో సగం ఈ జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన 11 అసెంబ్లీ స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తోంది. ఆ పార్టీకి బలం, బలగం ఉందనే నమ్మకంతో ఈ జిల్లాల పైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.
కానీ పార్టీని వీడుతున్న నేతలు ఈ జిల్లాల నుంచే ఎందుకు ఎక్కువగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది గత సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఈ జిల్లాల పైనే ఆ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి ఏకైక స్థానం రాజోలులో మాత్రమే ఆ పార్టీ చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టుగా గెలుపొందింది. చివరకు రాష్ట్రంలో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిపోయారు.
ఆ పార్టీకి దూరంగా..
పార్టీపై నమ్మకంతో ఇంత కాలం పార్టీని భుజాన మోసిన నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ముఖ్యమైన నాయకులు కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ, ముమ్మిడివరం, అమలాపురం, జగ్గంపేట, ఆచంట ఇన్‌చార్జీలు పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, పాఠంశెట్టి సూర్యచంద్ర, చేగొండి, అమలాపురం పార్లమెంటరీ ఇన్‌చార్జి డీఎంఆర్ శేఖర్ వంటి సుమారు డజను మందికి పైగా నాయకులు జనసేనకు గుడ్‌బై చెప్పారు. సిద్ధాంతం మాట దేవుడెరుగు కనీసం పార్టీలో విలువనేదే లేకుండా చేసేశారని, ఆత్మాభిమానం చంపుకుని ఇంకా ఆ పార్టీలో కొనసాగలేమని అంటున్నారు.
ఇవి చదవండి: ఓహెూ.. అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
Comments
Please login to add a commentAdd a comment