హైదరాబాద్.. హమారా! ఎలుగెత్తి చాటిన ముస్లింలు | hyderabad is ours :muslims | Sakshi
Sakshi News home page

హైదరాబాద్.. హమారా! ఎలుగెత్తి చాటిన ముస్లింలు

Published Sat, Aug 24 2013 2:40 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

hyderabad is ours :muslims

 కల్లూరు రూరల్ / కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అందరిదని, దానిని ఒక ప్రాంతానికే పరిమితం చేయడం తగదని ముస్లింలు నినదించారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం శుక్రవారం కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నమాజు తర్వాత  కమిటీ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మౌలానా అబ్దుల్‌మాజిద్, సయ్యద్ అల్తాఫ్ హుసేన్, కన్వీనర్ అయూబ్‌ఖాన్‌ల ఆధ్వర్యంలో ఉస్మానియా కళాశాల మైదానం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. వన్‌టౌన్, పూలబజార్, పెద్దమార్కెట్, పాతబస్టాండు, కోట్లసర్కిల్ మీదుగా రాజ్‌విహార్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ ప్రదర్శన నిర్వహించిన అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుంది. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై పార్టీలకు అతీతంగా పలువురు ముస్లిం నాయకులు ప్రసంగించారు.
 
  రాయలసీమ ప్రాంతం వెనకబాటులో ఉందంటూ 2009లో శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా నివేదించిందని, సీమకు న్యాయం చేయడం వదిలేసి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తారా అంటూ  జేఏసీ అధ్యక్షుడు మౌలానా అబ్దుల్‌మాజిద్ ప్రశ్నించారు. హైదరాబాదు ముస్లింలు నిర్మించిన నగరమని, అక్కడి చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలను వదులుకోడానికి ఎవరూ సిద్ధంగా లేరని ప్రధాన కార్యదర్శి సయ్యద్ అల్తాఫ్ హుసేన్ పేర్కొన్నారు. హైదరాబాదు మీది, మాది, మనందరిదని వ్యాఖ్యానించారు. లావుబాలీ దర్గా సజ్జాదే నషీన్ సయ్యద్ ఆరిఫ్‌పాషా ఖాద్రి మాట్లాడుతూ ముస్లిం జనాభా విషయంలో రాష్ట్రంలో హైదరాబాదు తర్వాత కర్నూలుకు ప్రాధాన్యముందని, విభజన సమంజసం కాదని సూచించారు.
 
 విభజన నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం: హఫీజ్‌ఖాన్
 విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని వైఎస్‌ఆర్‌సీపీ మైనారిటీ సెల్ జిల్లా కన్వీనరు హఫీజ్ ఖాన్ అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వేలాదిగా ముస్లిం ప్రజలు తరలివచ్చి చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఇందులో ఏ వ్యక్తి  ఒక పార్టీ ప్రయోజనాల కోసం రాలేదని, అన్నిపార్టీల ముస్లింలు సమైక్యాంధ్ర కోసం ఒకే వేదికపైకి వచ్చారన్నారు. కర్నూలు రాజధానిగా కొనసాగి ఉంటే హైదరాబాదుపై కేసీఆర్ కన్ను పడేదా అని ప్రశ్నించారు. ఉన్నత విద్య, మెరుగైన వైద్యం, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాదుపై ఆధారపడ్డామని, దానిని కోల్పోయేందుకు ముస్లింలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. టీడీపీ నాయకుడు బి.ఎ.కే.పర్వేజ్ మాట్లాడుతూ.. కర్నూలు ప్రజలు ఒకసారి రాజధానిని త్యాగం చేశారని, మరోసారి త్యాగం చేసేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. తెలంగాణా ఎవరి సొత్తు కాదని, 700 ఏళ్ల క్రితం ‘మగ్బూలి తెలంగాణా’ అనే నవాబు పాలించడంతో దానికి ఆ పేరు వచ్చిందని మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌస్ మొహియుద్దీన్ పేర్కొన్నారు.
 
  ఎస్‌డీపీఐ నేత అబ్దుల్‌వారిస్ మాట్లాడుతూ.. ఏకపక్షంగా విభజించేందుకు రాష్ట్రం సోనియా సొత్తు కాదని, రాష్ట్రంలో 60 శాతం ఆదాయాన్ని సమకూర్చే హైదరాబాదును తెలంగాణకు ఇస్తే ఒప్పుకొనే ప్రసక్తే లేదన్నారు. ఒకే భాష మాట్లాడే ప్రజలను విభజించడం దారుణమని, తమ శక్తియుక్తులను సమైక్యాంద్ర కోసమే ధారపోస్తామని నోబుల్ సర్వీసెస్ సొసైటీ నాయకుడు అబ్దుల్జ్రాక్ పేర్కొన్నారు. మానవుని మనుగడకు నీరు, జీవనోపాధి చాలా అవసరమని, రాష్ట్ర విభజన జరిగితే ఇక్కడి ప్రజలు ఈ రెంటికీ ఇబ్బంది పడాల్సి వస్తుందని రిటైర్డు విజిలెన్స్ అధికారి మహ్మద్ ఇలియాస్‌సేఠ్ ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద జరిగిన సభకు మౌలానా జాకిర్‌అహ్మద్ రషాదీ అధ్యక్షత వహించారు. అబ్దుల్‌గనీ ఉమ్రి, మౌలానా జుబేర్ అహ్మద్‌ఖాన్, మౌలానా అబ్దుల్ జబ్బార్, డాక్టర్ కె.ఎం.ఇస్మాయిల్ హుసేన్, మౌలానా సులేమాన్ నద్వి, హాఫిజ్ అబ్దుల్లా, న్యాయవాది చాంద్‌బాష, డాక్టర్ మన్సూర్ అహ్మద్, తదితరులు పాల్గొని ప్రసంగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement