kurnool town
-
రూ.4 లక్షల నగదు, కిలో బంగారం చోరీ
సాక్షి, కర్నూలు: నగరంలోని కృష్ణానగర్‌లో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడి కిలో బంగారం, రూ.4 లక్షల నగదును దోచుకెళ్లారు. స్థానిక రవీంద్ర స్కూల్ వెనుక వైపు రైల్వే ట్రాక్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలోకీ చోరీ జరిగింది. పిల్లల ఫీజుల కోసం దాచి ఉంచిన నగదును దోచుకెళ్లారని బాధితురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి నెల్లూరుకు వెళ్లగా దొంగతనం జరిగిందని, ఈ ఉదయం పక్కింటి వారు గుర్తించడంతో చోరీ విషయం తెలిసిందని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
హైదరాబాద్.. హమారా! ఎలుగెత్తి చాటిన ముస్లింలు
కల్లూరు రూరల్ / కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అందరిదని, దానిని ఒక ప్రాంతానికే పరిమితం చేయడం తగదని ముస్లింలు నినదించారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం శుక్రవారం కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నమాజు తర్వాత కమిటీ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మౌలానా అబ్దుల్‌మాజిద్, సయ్యద్ అల్తాఫ్ హుసేన్, కన్వీనర్ అయూబ్ఖాన్ల ఆధ్వర్యంలో ఉస్మానియా కళాశాల మైదానం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. వన్‌టౌన్, పూలబజార్, పెద్దమార్కెట్, పాతబస్టాండు, కోట్లసర్కిల్ మీదుగా రాజ్‌విహార్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ ప్రదర్శన నిర్వహించిన అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుంది. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై పార్టీలకు అతీతంగా పలువురు ముస్లిం నాయకులు ప్రసంగించారు. రాయలసీమ ప్రాంతం వెనకబాటులో ఉందంటూ 2009లో శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా నివేదించిందని, సీమకు న్యాయం చేయడం వదిలేసి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తారా అంటూ జేఏసీ అధ్యక్షుడు మౌలానా అబ్దుల్‌మాజిద్ ప్రశ్నించారు. హైదరాబాదు ముస్లింలు నిర్మించిన నగరమని, అక్కడి చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలను వదులుకోడానికి ఎవరూ సిద్ధంగా లేరని ప్రధాన కార్యదర్శి సయ్యద్ అల్తాఫ్ హుసేన్ పేర్కొన్నారు. హైదరాబాదు మీది, మాది, మనందరిదని వ్యాఖ్యానించారు. లావుబాలీ దర్గా సజ్జాదే నషీన్ సయ్యద్ ఆరిఫ్‌పాషా ఖాద్రి మాట్లాడుతూ ముస్లిం జనాభా విషయంలో రాష్ట్రంలో హైదరాబాదు తర్వాత కర్నూలుకు ప్రాధాన్యముందని, విభజన సమంజసం కాదని సూచించారు. విభజన నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం: హఫీజ్‌ఖాన్ విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ జిల్లా కన్వీనరు హఫీజ్ ఖాన్ అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వేలాదిగా ముస్లిం ప్రజలు తరలివచ్చి చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఇందులో ఏ వ్యక్తి ఒక పార్టీ ప్రయోజనాల కోసం రాలేదని, అన్నిపార్టీల ముస్లింలు సమైక్యాంధ్ర కోసం ఒకే వేదికపైకి వచ్చారన్నారు. కర్నూలు రాజధానిగా కొనసాగి ఉంటే హైదరాబాదుపై కేసీఆర్ కన్ను పడేదా అని ప్రశ్నించారు. ఉన్నత విద్య, మెరుగైన వైద్యం, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాదుపై ఆధారపడ్డామని, దానిని కోల్పోయేందుకు ముస్లింలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. టీడీపీ నాయకుడు బి.ఎ.కే.పర్వేజ్ మాట్లాడుతూ.. కర్నూలు ప్రజలు ఒకసారి రాజధానిని త్యాగం చేశారని, మరోసారి త్యాగం చేసేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. తెలంగాణా ఎవరి సొత్తు కాదని, 700 ఏళ్ల క్రితం ‘మగ్బూలి తెలంగాణా’ అనే నవాబు పాలించడంతో దానికి ఆ పేరు వచ్చిందని మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌస్ మొహియుద్దీన్ పేర్కొన్నారు. ఎస్డీపీఐ నేత అబ్దుల్‌వారిస్ మాట్లాడుతూ.. ఏకపక్షంగా విభజించేందుకు రాష్ట్రం సోనియా సొత్తు కాదని, రాష్ట్రంలో 60 శాతం ఆదాయాన్ని సమకూర్చే హైదరాబాదును తెలంగాణకు ఇస్తే ఒప్పుకొనే ప్రసక్తే లేదన్నారు. ఒకే భాష మాట్లాడే ప్రజలను విభజించడం దారుణమని, తమ శక్తియుక్తులను సమైక్యాంద్ర కోసమే ధారపోస్తామని నోబుల్ సర్వీసెస్ సొసైటీ నాయకుడు అబ్దుల్జ్రాక్ పేర్కొన్నారు. మానవుని మనుగడకు నీరు, జీవనోపాధి చాలా అవసరమని, రాష్ట్ర విభజన జరిగితే ఇక్కడి ప్రజలు ఈ రెంటికీ ఇబ్బంది పడాల్సి వస్తుందని రిటైర్డు విజిలెన్స్ అధికారి మహ్మద్ ఇలియాస్‌సేఠ్ ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద జరిగిన సభకు మౌలానా జాకిర్‌అహ్మద్ రషాదీ అధ్యక్షత వహించారు. అబ్దుల్‌గనీ ఉమ్రి, మౌలానా జుబేర్ అహ్మద్‌ఖాన్, మౌలానా అబ్దుల్ జబ్బార్, డాక్టర్ కె.ఎం.ఇస్మాయిల్ హుసేన్, మౌలానా సులేమాన్ నద్వి, హాఫిజ్ అబ్దుల్లా, న్యాయవాది చాంద్‌బాష, డాక్టర్ మన్సూర్ అహ్మద్, తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
విభజనతో సీమ ఎడారే
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజిస్తే సీమ ఏడారిగా మారుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆయన కర్నూలు నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే జిల్లా మంత్రులు విహార యాత్ర పేరుతో విదేశాలకు వెళ్లడం శోచనీయమన్నారు. 50 ఏళ్లకు పైగా అన్నదమ్ముల్లా కలిసున్న తెలుగు ప్రజలను కాంగ్రెస్ పార్టీ విభజించి ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టిందన్నారు. సీడబ్ల్యూసీ విభజన ప్రకటన చేసినప్పుడు మంత్రి టీజీ వెంకటేష్ సమైక్యాంధ్రకే మద్దతని.. పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రజాభీష్టం మేరకు మంత్రి పదవికి రాజీనామా చేశానంటూ ఆర్భాటంగా ప్రకటించారన్నారు. అయితే ఆ తర్వాత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి హోదాలోనే పాల్గొని తన వక్రబుద్ధి నిరూపించుకున్నారని విమర్శించారు. సోనియాగాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించే దమ్ము సీమాంధ్ర మంత్రులకు లేదన్నారు. ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం.. అక్రమ ఆస్తుల కేసులకు భయపడి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో సోనియా కాళ్ల వద్ద తాకట్టు పెట్టారన్నారు. విభజనపై బాబు ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు వివరించాలన్నారు. ఇప్పటికే పాలమూరు జిల్లా రైతులతో ఉన్న జల వివాదాలు విభజనతో మరింత ముదురుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సీమ ప్రాంతానికే చెందిన కిరణ్‌కుమార్ సీఎంగా ఉన్నప్పటికీ పాలమూరు ఎత్తిపోతల పథకానికి 70 టీఎంసీల నీటిని కేటాయిస్తూ సర్వేకి నిధులు మంజూరు చేసినా జిల్లాకు చెందిన మంత్రులు, నాయకులు నోరెత్తకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంలో మంత్రి టీజీ విలేకరుల సమావేశంతో సరిపెట్టడం దారుణమన్నారు. జిల్లాకు వస్తే ప్రజలు తిరగబడతారనే మంత్రి టీజీ విదేశీ యాత్ర, కేంద్ర మంత్రి కోట్లతో పాటు జిల్లాకు చెందిన మరో రాష్ట్ర మంత్రి ఢిల్లీలో మకాం వేసి ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలకే పరిమితం అయ్యారన్నారు. ప్రజలు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడబోదని ఆయన స్పష్టం చేశారు. దీక్షలకు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరిత, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రాంభూపాల్‌రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, మాజీ కార్పొరేటర్లు పెరుగు పురుషోత్తంరెడ్డి, తోట వెంకటక్రిష్ణారెడ్డి, రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, బాలరాజు, బురాన్‌దొడ్డి మురళీధర్ ఆచారిలు మద్దతు తెలిపారు. రెండో రోజు ఎస్వీతో పాటు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తెర్నేకల్లు సురేందర్‌రెడ్డి, వైఎస్సార్టీయూసీ మజ్దూర్ యూనియన్ నాయకులు రత్నాకర్‌రావు, ప్రభుదాస్, శాంతిరాజ్, నాగేంద్రయ్య, నాగన్న, మధుకుమార్, మౌలాలి, జెర్మియా, చిన్న, మద్దమ్మ, రంగన్న, ఎంవి.కుమార్, రాజేశ్వరయ్య, వైఎస్సార్సీపీ నగర నాయకులు బుజ్జిబాబు, భాస్కర్, బ్రదర్ సమ్సోనన్న, సురేష్, సోమిశెట్టి శ్రీనివాసులు, ఖలీల్ అహ్మద్, శ్రీనివాసులు, రామయ్య, సువర్ణరాజ్, లాజరస్‌లు దీక్ష చేపట్టారు.