‘ఔటర్’పె కారు దగ్ధం
వాహనంలోని నలుగురు సురక్షితం
హైదరాబాద్ : ఔటర్‌పై వేగంగా వెళ్తున్న కారు ఇంజన్‌లో చిన్నపాటి నిప్పురవ్వలు చెలరేగి మంటలు లేచి వాహనం పూర్తిగా దగ్ధమైపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన శంషాబాద్ మండలంలోని తొండుపల్లి ఔటర్ రింగ్‌రోడ్డు జంక్షన్ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతానికి చెందిన సుధాకర్ తన మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో కుటుంబీకులు, బంధువులతో కలసి ఔటర్ రింగు రోడ్డు మీదుగా నాగోల్ వైపు నుంచి గచ్చిబౌలి వెళ్తున్నారు. ఈ క్రమంలో తొండుపల్లి ఔటర్ జంక్షన్ సమీపంలోకి రాగానే కారు ఇంజన్‌లో చిన్నపాటి నిప్పురవ్వలు మొదలయ్యాయి. వాహనదారుల సమాచారంతో అప్రమత్తమైన సుధాకర్ కారును ఆపి అందులో ఉన్న వారందరినీ దించేశారు. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. దాదాపు గంటకు పైగా కారు మంటల్లో కాలి బూడిదయింది.