![KCR Request PM Modi Conduct Competitive Exams In Regional Language Also - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/21/KCR.jpg.webp?itok=0xtH44M-)
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాల భర్తీలో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడానికి పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు ప్రధానికి ఈ నెల 18న లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, భారతీయ రైల్వే, రక్షణ శాఖ, జాతీయ బ్యాంకులు తదితర అన్ని ఉద్యోగ నియామకాల కోసం ప్రస్తుతం ఆంగ్లం, హిందీ భాషల్లోనే పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారని లేఖలో తెలిపారు.
దీంతో ఆంగ్ల మాధ్యమంలో చదవని విద్యార్థులతో పాటు హిందీ మాట్లాడని రాష్ట్రాల వారు నష్టపోతున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు సమాన అవకాశాలను కల్పించడానికి వీలుగా ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలు రాయడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. యూపీఎస్సీ ద్వారా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలతోపాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, జాతీయ బ్యాంకులు, ఆర్‌బీఐ నిర్వహించే నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. ఈ లేఖ ప్రతిని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు సైతం కేసీఆర్ పంపినట్లు సీఎం కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
పీవీ స్టాంపును హైదరాబాద్‌లో ఆవిష్కరించండి
హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక స్టాంపును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందని, ఈ స్టాంపును వీలు చూసుకొని హైదరాబాద్‌లో ఆవిష్కరించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్ ఈ నెల 18న రాష్ట్రపతికి రాసిన లేఖను సీఎం కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ.. మానవవనరుల అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక శాఖలు, కళలు, సంస్కృతి, సాహిత్యం తదితర రంగాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని లేఖలో కేసీఆర్ గుర్తుచేశారు. దేశానికి పీవీ చేసిన సేవలను స్మరిస్తూ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు పీవీ స్మారక స్టాంపును విడుదల చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment