అసమర్థ ప్రధానితో దేశం అథోగతి.. మోదీపై కేసీఆర్‌ విమర్శల వర్షం | CM KCR Fires On PM Narerndra Modi And BJP Strategy | Sakshi
Sakshi News home page

KCR Slams Modi: అసమర్థ ప్రధానితో దేశం అథోగతి.. ఆయన విశ్వ గురువా.. విష గురువా?

Published Mon, Jul 11 2022 1:21 AM | Last Updated on Mon, Jul 11 2022 7:19 AM

CM KCR Fires On PM Narerndra Modi And BJP Strategy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అన్ని రకాలుగా అ«థోగతి పాలవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసమర్థ పాలన, బీజేపీ విధానాలే కారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. దేశం ఇంత అసమర్థ ప్రధానిని ఇంతకుముందెన్నడూ చూడలేదని ధ్వజమెత్తారు. నిష్క్రియ, అవివేక, అసమర్థ పాలనను మోదీ సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని జలగలా పీడిస్తోందని, ఇందిరాగాంధీ గతంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తే.. ఇప్పుడు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేకిన్‌ ఇండియా ఓ ఫార్స్‌గా అభివర్ణించారు. మోదీ గారూ.. బ్యాంకుల స్కాముల్లో మీ వాటా ఎంత అంటూ సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వాళ్ల విజయాలు, దేశానికి చేసిన మేలు, భవిష్యత్తు ప్రణాళికలు చెప్పకుండా నోటి దూల తీర్చుకుని పోయారని ఎద్దేవా చేశారు. ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దాదాపు రెండున్నర గంటల పాటు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

సరుకు, సంగతి ఏమీ లేదు
జాతీయ సమావేశాలకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడమే బీజేపీ చేసిన పెద్ద తప్పు. వారి దగ్గర సరుకు, సంగతి, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్‌ ఏమీ లేదు. అరుపులు, పెడబొబ్బలు, అడ్డమైన కారు కూతలు తప్ప మరేమీ లేదు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ప్రచార సమావేశంలో బీజేపీ అవినీతి విధానాలు, కుంభకోణాలు, అసమర్ధ విధానాలపై నేను వేసిన ఏ ఒక్క ప్రశ్నకూ మోదీ సహా బీజేపీ జాతీయ నేతలెవరూ సమాధానం చెప్పలేదు.   

విశ్వ గురువా.. విష గురువా? 
మోదీ అధికారంలోకి రాకముందు రూ.4 లక్షల కోట్లుగా ఉన్న నిరర్ధక ఆస్తులు ఇప్పుడు రూ.12 లక్షల కోట్లకు పెరిగాయి. మోదీకి తెలియకుండా బ్యాంకుల లూఠీ జరగడం లేదు. ఈ వివరాలను త్వరలో దేశం ముందు పెడతాం. ప్రతిపక్షాల మీద పెడుతున్న గూఢచర్యం బ్యాంకు మోసగాళ్ల మీద ఎందుకు పెట్టరు. బ్యాంకులను మోసగించిన దొంగలు విదేశాల్లో పిక్నిక్‌ చేసుకుంటుండగా ఎందుకు పట్టుకురావడం లేదు. మోదీ విశ్వ గురువా.. విష గురువా? దేశంలో వంద ఏళ్లకు సరిపడే బొగ్గు నిల్వలు ఉన్నా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వెనుక లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. మోదీని గద్దె దించి ఈ కుంభకోణాలపై విచారణ జరిపిస్తాం.  

పెట్టుబడిదారులకు సేల్స్‌మన్‌ 
కాంగ్రెస్‌లో బ్రెయిన్‌ డ్రెయిన్‌ అయితే.. ఇప్పుడు క్యాపిటల్‌ డ్రెయిన్‌ మూలంగా పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి. గుప్పెడు మంది పెట్టుబడిదారులకు మోదీ సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. మేకిన్‌ ఇండియా అట్టర్‌ ఫ్లాప్‌ కాగా పతంగి మాంజా, దీపావళి దీపంతలు, చివరకు జాతీయ పతాకం కూడా చైనాలో తయారవుతోంది. 

వికృత రాజకీయ క్రీడ.. 
మోదీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడకుండా కుట్రలు, కుహకాలతో దేశంలో రాజకీయ వికృత క్రీడను కొనసాగిస్తున్నారు. దమన నీతితో ఈడీ, సీబీఐ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఇతర పార్టీల నేతలపై విచారణ నిలిపివేస్తున్నారనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. సుజనాచౌదరి, సువేందు అధికారి, ముకుల్‌రాయ్, సీఎం రమేష్‌ ,జ్యోతిరాదిత్య సింథియా లాంటి వారికి నోటీసులు ఇచ్చిన తర్వాత, వారిని పార్టీలో చేర్చుకోగానే ఆ కేసులన్నీ నిర్మా పౌడర్‌ మాదిరిగా తుడిచిపెట్టుకు పోతున్నాయి. బీజేపీ ఆఫీసులో తయారయ్యే వాట్సప్‌ వంటకాలతో రైతుబంధు, ఉద్యోగుల వేతనాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్రాల ప్రగతి దెబ్బతీసి దేశం గొంతు పిసుకుతున్నారు. తమ మిత్రులకు పోర్టులు, ఎయిర్‌పోర్టులు కట్టబెడుతున్నారు. సైన్యాన్ని కూడా వదిలిపెట్టకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఆర్మీలో ప్రయోగాలు సరికాదని రిటైర్డు సైనికాధికారులు చెప్తున్నారు. వృద్ధుడైన మోదీని తొలగించి యువ ప్రధానిని తీసుకురావాలి.  

బీజేపీ నగ్నంగా, విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది 
మూడింట రెండొంతలు ఎమ్మెల్యేలున్న డీఎంకే సర్కార్‌ను కూల్చేందుకు ఏక్‌నాథ్‌ షిండేను తెస్తామంటూ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కారుకూతలు కూస్తున్నాడు. ఇక్కడ కూడా మోకాలెత్తులేని దద్దమ్మలు 107 స్థానాల్లో డిపాజిట్లు రానివాళ్లు ఏక్‌నాథ్‌ షిండే వస్తాడని దురహంకారంతో మాట్లాడుతున్నారు. నాదెండ్ల భాస్కర్‌రావులాంటి వాళ్లతో అప్పట్లో ఎన్టీఆర్‌ను దించేస్తే.. ప్రజలు ఉద్యమిస్తే..కేంద్రం దిగివచ్చి మళ్లీ సీఎంను చేసిన సంగతి గుర్తుంచుకోవాలి. మీరు ఏక్‌నాథ్‌ షిండే తయారీదారులా? చూద్దాం తమిళనాడు, తెలంగాణలో ఏక్‌నాథ్‌ షిండేలను తీసుకొని రండి.  

అన్నిట్లో వైఫల్యం 
బీజేపీ దేశం ముందు నగ్నంగా, విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది. నూపుర్‌ శర్మ వ్యాఖ్యలను సుప్రీకోర్టు జడ్జిలు ఫాల్కీవాలా, సూర్యకాంత్‌ తప్పుబడితే, సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఈ ద్రోహులు, రాక్షసుల నుంచి దేశాన్ని, న్యాయవ్యవస్థను కాపాడాలి. దేశంలో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. బెదిరింపులు, పార్టీలను చీల్చడం, కోట్ల రూపాయలతో నాయకులను కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. రైతులను ఉగ్రవాదులంటూ ఎన్నికలు రాగానే పీఎం క్షమాపణ చెప్పారు. గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరలు, జీడీపీ తదితరాలు అన్నింటిలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ఉన్న అంగీలాగు ఊడగొట్టుకునేందుకు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా? 

ఎన్నడూ లేనంతగా రూపాయి పతనం 
గుజరాత్‌ సీఎం హోదాలో రూపాయి విలువ పతనం గురించి మోదీ గొంతు చించుకున్నారు. ఇప్పుడు గతంలో ఏ ప్రధాని హయాంలో లేనంత కనీస స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. ఇది మోదీ అవివేకానికి, అసమర్ధతకు నిదర్శనం. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాకుండా నియంతృత్వాన్ని (తానాషాహీ) నమ్ముతోంది. ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం ఏ రంగంలోనూ ఏమీలేదు. కనీసం దేశ రాజధానికి మంచినీరు ఇవ్వలేకపోయింది. పైగా నిరుద్యోగం 8.3 శాతానికి పెరిగింది. ఏటా 1.30 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. భయంకరమైన అవినీతి, కుంభకోణాలు, అనాగకరికమైన అప్రజాస్వామిక విధానాలు మినహా ఏమీ లేదు.  

తెలంగాణలో రెట్టింపు తలసరి ఆదాయం 
దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణలో రెట్టింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాలతో తెలంగాణ రాష్ట్రం రూ.3 లక్షల కోట్లు నష్టపోయింది. చేతగాని ప్రభుత్వాన్ని గద్దె దించి కేంద్రంలో టీఆర్‌ఎస్‌ తరహా ప్రభుత్వాన్ని తెస్తాం. తెలంగాణ ప్రభుత్వానికి స్పీడ్‌ ఎక్కువ. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి లుంగీ కట్టుకుని వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడం సిగ్గుచేటు. తెలంగాణ తలసరి ఆదాయంలో కేవలం నాలుగో వంతు ఉన్న వారు చెప్తే విని తరించాలా? బీజేపీ పాలిత రాష్ట్రాలు యూపీ, మధ్యప్రదేశ్, బిహార్‌ తదితర రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీయేతర ఢిల్లీ, తమిళనాడు, కేరళ ఇలా ఎక్కడ చూసినా తలసరి ఆదాయం ఎక్కువే.  

బీజేపీని తన్ని తరిమేయాలి 
100 హెచ్‌పీ లాంటి తెలంగాణ ప్రభుత్వాన్ని వదిలి 25 హెచ్‌పీ సామర్ధ్యం ఉన్న బీజేపీ ప్రభుత్వాలను ప్రజలు కోరుకోరు. అసమర్ధ విధానాలతో మాకు ఇవ్వకుండా వాళ్ల పార్టీ ఉన్న రాష్ట్రాలకు పెడుతున్నారు. మోదీ ప్రభుత్వం పోవాలి.. బీజేపీయేతర ప్రభుత్వం రావాలనేది మా నినాదం. దేశంలో ఏ డబుల్‌ ఇంజన్‌ రావాలో ప్రజలు నిర్ణయిస్తారు. హిందువులకు అత్యంత పవిత్రమైన కాశీలో యూపీ ఎన్నికల కోసం నట్లు బోల్టులతో కట్టిన మందిరం ప్రధాన గోపురం ఇటీవల పడిపోయింది. బీజేపీ పాలనలో దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లింది. దేశాన్ని కాపాడుకునేందుకు యువత, విద్యార్థులు, మేధావులు బీజేపీని తన్ని తరిమేయాలి. 

నాకు బ్లాక్‌ మనీ లేదు..లాండరింగ్‌ లేదు 
దేశానికి బీజేపీ, మోదీ టేకేదార్‌ కాదు. మోదీ కూడా గతంలో గుజరాత్‌ సీఎంగా ఉండి దొంగ ఫోటోలు పెట్టి ప్రధాని అయ్యారు. దేశానికే బెస్ట్‌ మోడల్‌గా ఉన్న తెలంగాణ ఎందుకు జాతీయ రాజకీయాలు చేయకూడదు. కేసీఆర్‌ ఏది చేసినా బాహాటంగా చేస్తాడు. మా పోరాటానికి భారత్‌ ప్రతిస్పందిస్తుందనే నమ్మకం ఉంది. బీజేపీ ఉడుత ఊపులకు ఎవరూ భయపడరు. యువత మెదళ్లను తొలుస్తున్న విష ప్రచారానికి విరుగుడు లేకపోతే దేశం మరో శతాబ్దకాలాన్ని నష్టపోతుంది. నేను ఎవరికీ భయపడే రకం కాదు.. నాకు బ్లాక్‌మనీ లేదు..లాండరింగ్‌ లేదు. మాతో గోక్కుంటే మేమూ గోకుతాం. మోదీ గారు..తప్పుడు విధానాలు విడిచిపెట్టి మిగతా రెండేళ్లు దేశం కోసం పనిచేయండి. 

జాతీయ పార్టీ పనులు జరుగుతున్నాయి.. 
జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఫ్రంట్‌ కాకుండా ప్రజలకు మా ఎజెండాను వివరిస్తాం. ఈ మహా యజ్ఞంలో టీఆర్‌ఎస్‌ సమిధగా పనిచేస్తుంది. అవసరమైతే జాతీయ పార్టీగా మారుతుంది. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అనేకమంది వ్యక్తులతో మాట్లాడుతున్నాం. నన్ను ఇక్కడే బిజీగా పెట్టాలని బీజేపీ అనుకుంటోందట. మోదీకి, ఆయన గూఢచారులకు తెలుసు. డేర్‌డెవిల్‌ ఫెలో.. షార్ప్‌ టంగ్‌ ఉంటదని అనుకుంటున్నారు.  

బీజేపీయేతర డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలి 
మా అజెండా ఏంటో త్వరలో చెబుతాం. తెలంగాణ అభివృద్ధిలో ఒక్కపైసా కూడా మోదీ చేయలేదు. అయినా దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్రంలోని ప్రభుత్వం మారాలని చెబుతున్నాం. తప్పకుండా మారుస్తాం. డబుల్‌ ఇంజన్‌ సర్కారు రావాలని మోదీ చెప్పారు. ఈ విషయంలో మోదీకి థ్యాంక్స్‌ చెబుతున్నా. తెలంగాణ సర్కారు ఇంజన్‌ స్పీడ్‌గా ఉంది. కాబట్టే కేంద్రంలో కూడా తెలంగాణ సర్కారులా స్పీడ్‌గా ఉన్న బీజేపీయేతర డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం రావాలి.  

మా ముఠా గోపాల్‌ దెబ్బకు లక్ష్మణ్‌ యూపీకి పోయిండు..  
‘బీజేపీ రాష్ట్ర నాయకులు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ముషీరాబాద్‌లో మా ముఠా గోపాల్‌ దెబ్బకు గింగిరాలు తిరిగి ఓడిపోయిన లక్ష్మణ్‌ వేరే రాష్ట్రం పోయి చిల్లర మాటలు మాట్లాడుతున్నడు. కట్టప్ప తాను నమ్మిన రాజుకు అధికారం ఇచ్చేంత వరకు వెనుదిరగలేదు. కట్టప్పలు.. కాకరకాయలు అని మాట్లాడుతున్నారు’ అని సీఎం కేసీఆర్‌ ఎద్దేవాచేశారు.  

కట్టప్పలా?..కాకరకాయలా? 
షిండేను తెస్తే.. నా కాళ్లు చేతులు కూడా గులగుల పెడుతున్నాయి. దుమ్ము రేగేదాకా కొట్లాడతా. ప్రజల ముందు అన్ని విషయాలు పెట్టి వచ్చే ఎన్నికల్లో కూల్చేస్తా. నేను ఫైటర్‌ను ఎవరికీ భయపడను. కొంతకాలం ఓపిక పడితే ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు వస్తాం. నాకు పీకేలాంటి అనేక మంది స్నేహితులు సహకరిస్తున్నారు. బీజేపీ అహంకారం నెత్తికెక్కి మరిన్ని తప్పులు చేయాలనే అనుకుంటున్నాం. కుటుంబ పార్టీలు వద్దనుకుంటే ప్రజలు అధికారం నుంచి తొలగిస్తారు. మొత్తం 119 స్థానాల్లో 110 సీట్లున్న చోట ఏక్‌నాథ్‌ షిండే వస్తారా? తెలంగాణలో మూడోవంతు మెజార్టీతో తెరాస గెలిచింది. ఇదేనా మీ పాలసీ. కట్టప్పలా ... కాకరకాయలా?  

దమ్ముంటే డేట్‌ డిక్లేర్‌ చేయండి 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదు. ప్రజాస్వామ్యంలో ఓడిస్తా అనడం అహంకారం. అవివేకానికి నిదర్శనం. వాళ్లకు దమ్ముంటే డేట్‌ డిక్లేర్‌ చేస్తే నేను అసెంబ్లీ రద్దుకు సిద్ధం. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా? మేం స్కాంస్టర్లము కాదు. కుంభకోణాలు చేయలేదు. అపకీర్తి మూట కట్టుకోలేదు. ప్రజల కోసం మంచి పనులు చేశాం. వాళ్లే గెలిపిస్తారు. దేశ వ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని బీజేపీ భయపడుతోంది.   

బీజేపీ ఈస్ట్‌మన్‌ కలర్‌ కలలు 
తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ ఈస్ట్‌మన్‌ కలర్‌ కలలు కంటోంది. పార్టీ నుంచి ఎవరైనా పోతే వారిని మించిన వారు వచ్చి పోటీ చేస్తారు. నేడు పార్టీ వ్యవస్థాపకుడిని.. స్క్రాప్‌నుంచి ఇక్కడిదాకా తెచ్చా. నెత్తిమాసినోళ్లు పది మంది పోతే భయపడను. ప్రజల వద్దకు వెళ్తా. ప్రజలు గెలిపిస్తేనే నాయకులు అవుతారు. ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా నిర్వహిస్తా. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టని వారు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. రాజకీయాలు డైనమిక్‌ సబ్జెక్ట్‌. ఎవరి అభినివేశం ప్రకారం వాళ్లు రావచ్చు. తండ్రిపేరు, తాతపేరు రాజకీయాల్లో కేవలం పరిచయానికి మాత్రమే పనికి వస్తాయి. మంచిగా పనిచేయకపోతే ప్రజలు పక్కన పెడతారు. నా మంత్రివర్గంలో అవినీతి పరులు లేరు. అందుకే వికెట్లు పడిపోయాయనే వార్తలు లేవు. మేము కుంభకోణాలు, చెడ్డ పనులు చేయలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement