న్యూఢిల్లీ: తమిళ పార్టీల ఆందోళనకు కేంద్రం దిగి వచ్చింది. ఈ నెల 14న నిర్వహించిన పోస్ట్‌మెన్ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది, ప్రాంతీయ భాషల్లో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని కేంద్రప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రకటించింది. హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే పోస్టల్ శాఖ నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని రాజ్యసభలో ఏఐడీఎంకే నాయకత్వంలో చేపట్టిన నిరసనలో డీఎంకే, సీపీఐ, సీపీఎం పాల్గొన్నాయి. సభ్యుల ఆందోళనతో లంచ్ విరామానికి ముందు సభ మూడుసార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమైనా సభ్యులు ఆందోళన కొనసాగించడంతో మరోసారి అర్ధగంట వాయిదాపడింది.
పోస్టుమెన్, సహాయకుల కోసం పోస్టల్ శాఖ గత ఆదివారం నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు న్యాయ, సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. తమిళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. త్రిభాషా సూత్రానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వశాఖల పరీక్షలు, ఇంటర్వ్యూలను నిర్వహించాలని సభలో కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు ఆనంద్‌శర్మ డిమాండ్ చేశారు. కేంద్రం తాజా నిర్ణయాన్ని అన్నాడీఎంకే, డీఎంకే, సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీలు స్వాగతించాయి.
Comments
Please login to add a commentAdd a comment