
సాక్షి, అమరావతి: రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇతరులతో పాటు ముస్లిం మహిళ కూడా సమాన హక్కులు కల్పించేందుకు వీలుగా రూపొందించిన బిల్లుకు ఆమోదం లభించడం సంతోషంగా ఉందన్నారు. ముస్లిం మహిళలపై చూపుతున్న వివక్షకు నేడు సరైన న్యాయం జరిగిందన్నారు. ముస్లిం మహిళల ఆత్మగౌరవం పెరిగిందన్న మోదీ.. ఇది మహిళ విజయంగా వర్ణించారు. కాగా మంగళవారం సాయంత్రం రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అనంతరం ప్రధాని ట్విటర్‌లో స్పందిస్తూ.. సంతోషం వ్యక్తం చేశారు. బిల్లుకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీల సభ్యులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయమన్నారు.
బిల్లు ఆమోదంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. దీని ద్వారా ప్రధాని మోదీ ముస్లిం మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని గుర్తుచేశారు. ఇక దేశంలో ట్రిపుల్ తలాక్ అనే పదమే వినపడదని స్పష్టం చేశారు. కాగా ఉత్కంఠ భరితంగా సాగిన ఓటింగ్‌లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి అసలైన విజయం నేడు లభించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ముస్లిం మహిళల హక్కుల రక్షణకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని మరోసారి రుజువైందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment