సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం) బిల్లుకు రాజ్యసభలో ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేశారు. పలువురు సభ్యులు సభకు గైర్హాజరు కావడంతో మ్యాజిక్ ఫిగర్ అనూహ్యంగా తగ్గింది. బిల్లుకు అనుకూలంగా 99 మంది ఓటేయగా.. వ్యతిరేకంగా 84 మంది సభ్యులు ఓటు వేశారు. బీజేపీ సొంత సభ్యులు ఉండగా.. మిత్రపక్షాల మద్దతుతో బిల్లుకు ఆమోదం లభించింది. పలువురు సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండడంతో మ్యాజిక్ ఫిగర్ తగ్గడం వల్ల బిల్లు సునాయంగా ఆమోదం పొందింది. సభ్యులందరికి స్లిప్పులు పంచి రహస్య ఓటింగ్ పద్దతిలో బిల్లుపై సభ్యుల అభిప్రాయం తీసుకున్నారు. అనంతరం మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారని సభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడంతో చట్టంలో పొందుపరిచిన విధంగా కఠిన శిక్ష అమలు కానుంది.
కాగా తలాక్ బిల్లుకు ఈనెల 25న లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్యసభలో కూడా గట్టెక్కడంతో రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం చట్టరూపం దాల్చనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లును తొలి నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ, ఎస్పీ, బీఎస్పీ సభ్యులు సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేశారు. అయినప్పటికీ మెజార్టీ సభ్యులు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. జేడీయూ, అన్నాడీఎంకే సభ నుంచి వాకౌట్ చేయగా.. టీడీపీ, టీఆర్‌ఎస్ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బిల్లుకు బీజేడీ మద్దతిచ్చింది. ఇది వరకే రెండుసార్లు రాజ్యసభలో బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి బిల్లును నెగ్గించుకునేందుకు బీజేపీ ప్రత్యేక వ్యూహాలను రచించింది.
అంతకుముందు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల ప్రతిపాదనలకు సభ చైర్మన్ ఓటింగ్ చేపట్టారు. మూజువాణి పద్దతిలో ఓటింగ్‌ను నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 84 మంది ఓటువేయగా.. వ్యతిరేకంగా 100 మంది సభ్యులు ఓటువేశారు. దీంతో సవరణలకు విపక్షాలు చేసిన తీర్మానం వీగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment