హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటలు, పాటలు, సినిమా.. ఏదైతేనేం వినోదం మన జీవితంలో భాగం. సినిమా విషయానికి వస్తే వెండి తెర మీద చూడాల్సిందే. అయితే మహమ్మారి కారణంగా జనం థియేటర్లకు దూరం అయ్యారు. ఇంట్లోనే ఉండి బుల్లి తెర మీదనో, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌లోనో వీడియోలను వీక్షిస్తున్నారు. ఈ అంశమే ఓవర్ ద టాప్ (ఓటీటీ) వేదికలకు కలిసి వచ్చింది. ఇంటర్నెట్ వ్యయాలు దిగిరావడం, స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్ల విస్తృతి తోడవడం కూడా పరిశ్రమకు మేలు చేకూరుస్తోంది. ఇంకేముంది ప్రాంతీయ భాషల్లో కంటెంట్ అందించే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మారుమూల పల్లెల్లోనూ విజయకేతనం ఎగురవేస్తున్నాయి. వీటికి పోటీగా అటు జాతీయ, అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ కంపెనీలు స్వయంగా ప్రొడ్యూసర్ల అవతారం ఎత్తుతుండడం గమనార్హం.
కంటెంట్ లభ్యతతో..
వ్యయాల కారణంగా థియేటర్లు, టీవీల్లో సినిమాలు, వెబ్ సిరీస్, షోస్ విడుదల చేయలేని ప్రొడ్యూసర్లకు ఓటీటీ చక్కని వేదిక. తక్కువ ఖర్చు, నిడివితో తీసే సినిమాలకైతే ఇవి ప్రాణం పోస్తున్నాయి. పైగా ప్రాంతీయ భాషల్లో ఇప్పుడు విరివిగా కంటెంట్ లభిస్తోంది. చందా చెల్లించి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను వీక్షకులు ఎంజాయ్ చేస్తున్నా రు. అనతి కాలంలోనే ప్రాంతీయ ఓటీటీలు వీక్షకుల ఆదరణ అందుకుంటున్నాయి. ఇందుకు తెలుగులో వచ్చిన ఆహా చక్కని ఉదాహరణ. 2020 మార్చిలో ప్రారంభమైన ఈ స్ట్రీమింగ్ సర్వీస్ కంపెనీకి కోటి మందికిపైగా యూజర్లున్నారంటే ప్రాంతీయ భాషలకు ఉన్న డిమాండ్ ఇట్టే అర్థం చేసుకోవచ్చు. శ్రేయాస్ ఈటీ ఆరు లక్షలకుపైగా డౌన్‌లోడ్స్ సాధించింది. డిమాండ్ నేపథ్యంలో సెప్టెంబరుకల్లా 10 భాషలను పరిచయం చేయనున్నట్టు శ్రేయాస్ ఈటీ ఫౌండర్ గండ్ర శ్రీనివాస రావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
‘ఓటీటీ రంగంలో భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతోంది. కంపెనీలకు చందా ఆదాయం దేశంలో వచ్చే నాలుగేళ్లు ఏటా 30.7% అధికం అవుతుంది’ అని చెప్పారు.
పట్టు సాధిస్తున్న ప్రాంతీయం..
ఓటీటీ వేదికలపై ప్రాంతీయ భాషల వాటా 2025 నాటికి 50 శాతం దాటుతుందని ఫిక్కీ–ఈవై నివేదిక చెబుతోంది. 2019లో ఇది 30 శాతంగా ఉంది. సురేశ్ ప్రొడక్షన్స్‌తోపాటు పిల్లల కోసం సినీ నటుడు మహేశ్ బాబు ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళంలో నీస్ట్రీమ్, కూడె, బెంగాలీలో అడ్డాటైమ్స్, హోయిచొయి, తులు, కొంకణి, కన్నడలో టాకీస్, గుజరాతీలో ఓహో గుజరాతీ, సిటీషోర్.టీవీ, మరాఠీలో ప్లానెట్ మరాఠి, తమిళంలో రీగల్ టాకీస్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీలో సన్ నెక్ట్స్æ పోటీపడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ను ప్రాంతీయ భాషల్లో అనువదించి విడుదల చేస్తున్నాయి. ఒకట్రెండు ఓటీటీలు మాత్రమే ఆదాయంలో వాటా విధానాన్ని అమలు చేస్తున్నాయి. మిగిలినవన్నీ ఏక మొత్తంగా ప్రసార హక్కులను చేజిక్కించుకుంటున్నాయి. దేశంలో వీడియో ఓటీటీ విపణి ప్రస్తుతం రూ.11,100 కోట్లుంది. 2030 నాటికి రూ.92,500 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment