మార్కెట్‌లోకి అధునాతన మోడళ్లు
చలి దుస్తులకు పెరిగిన గిరాకీ
స్టైల్ కోసం ధరిస్తున్న నేటితరం యువత
చలితో సంబంధం లేకున్నా వినియోగం
ఇబ్బడిముబ్బడిగా నగరంలో స్టాళ్ల ఏర్పాటు
నగరంలో చలికాలం ప్రారంభమైంది. చలికాలం వస్తుందంటే చాలు స్వెటర్ల కోసం నగరవాసి కళ్లు వెతుకుతుంటాయి. మార్కెట్‌లోకి స్టైలిష్ స్వెటర్లు కొనేందుకు చూస్తుంటారు. నవంబర్ రాగానే నగరంలో స్వెటర్ దుకాణాలు భారీగా వెలుస్తుంటాయి. ఈ ఏడాది కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో స్వెటర్ దుకాణాలు వెలిశాయి. రంగురంగుల ఉన్ని దుస్తులతో పాటు రగ్గులు, దుప్పట్లు, టోపీలు, మఫ్లర్లు, చేతి గ్లౌజులు కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.
నవంబర్ రెండో వారం నుంచి జనవరి మూడో వారం వరకూ నగరంలో చలికాలం ఉంటుంది. ప్రత్యేకంగా డిసెంబర్, జనవరి నెలలో నగర ఉష్ణోగ్రతలు 12.5 డిగ్రీల కనిష్ట స్థాయిలో నమోదు అవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది నవంబర్ రెండో వారంలో చలి ప్రారంభమైంది. కానీ తుఫాను ప్రభావంతో చలి తీవ్రత తగ్గింది. ఈ వారం నుంచి చలి వాతావరణం మళ్లీ పుంజుకుంది. దీంతో స్వెటర్ల వ్యాపారాలు జోరుగా పెరిగాయి.
నేపాల్ నుంచి వచ్చి..
చలికాలం ప్రారంభం కాగానే నేపాల్ వ్యాపారులు నగరానికి భారీగా తరలివచ్చి స్లాళ్లు ఏర్పాటు చేసుకుని మరీ అమ్మకాలు జరుపుతుంటారు. కోఠికి వెళ్లేవారు ఇలాంటి దుకాణాలను వరుసగా చూసే ఉంటారు. వీటితోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల వెంబడి స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. చాలా మంది నగర వాసులు ఇక్కడే కొనుగోలు చేస్తుంటారు. మూడు నెలల పాటు ఇక్కడే ఉండి విక్రయిస్తుంటామని, తమ ఉత్పత్తులకు ఇక్కడ డిమాండ్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
బ్రాండెడ్ దుకాణాలు సైతం..
ఇటీవల స్వెటర్ల వ్యాపారం రోడ్లపై నుంచి బ్రాండెడ్ షాపుల వరకూ చేరింది. గతంలో చేతితో తయారు చేసిన స్వెటర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరుందిన బ్రాండెడ్ కంపెనీలు తయారు చేస్తున్న స్వెటర్లను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లు వేసుకుంటున్న స్వెటర్ల కోసం బ్రాండెడ్ దుకాణాల్లో వెతుకుతున్నారు. వారి అభిరుచిని బట్టి వ్యాపారులు కూడా బ్రాండెడ్ ఉన్ని దుస్తులను తెప్పిస్తున్నారు. ధర ఎక్కువైనా కూడా వాటిని కొనేందుకు ముందుకొస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.
తగ్గిన వ్యాపారం..
నగరంలో ఏటా చలికాలం ప్రారంభానికి ముందు నుంచే పలువురు వ్యాపారులు తాత్కాలిక స్వెటర్ల షాపులు, రోడ్డుల పక్కన స్టాళ్లు ఏర్పాటు చేసి, మైదానాల్లో అమ్మకాలు చేస్తుండేవారు. అయితే ఈ ఏడాది నవంబర్ రెండో వారం నుంచి చలి ప్రారంభమైనప్పటికీ బంగాళాఖాతంలో తుపాన్ రావడంతో నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. చలి తగ్గింది. తిరిగి డిసెంబర్ నెల్లో కూడా సైక్లోన్ రావడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి. దీంతో చలికాలం కోసం నగర వ్యాపారులు దేశ, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వివిధ రకాల స్వెటర్లతో పాటు ఇతర దుస్తువుల వ్యాపారం అనుకున్న స్థాయిలో జరగడంలేదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.
స్టైల్ కోసం..
చలిని తట్టుకోడంతో పాటు.. ధరించినప్పుడు హుందాగా కనబడేందుకు పలు స్వెటర్ తయారీ సంస్థలు వివిధ రకాల మోడల్స్‌ను రూపొందిస్తున్నాయి. ఇవి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. ఏఎన్‌ఆర్, ఎనీ్టఆర్, చిరంజీవి లాంటి ఆ తరం నటులు సినిమాల్లో ధరించిన స్వెటర్లను అప్పట్లో వాడేవారని, ఇప్పుడు ఈ తరం హీరోలు, హీరోయిన్లు ధరించే స్వెటర్లను వాడేందుకు ఇప్పటి యువత ఆసక్తి చూపిస్తోందని పేర్కొంటున్నారు. కొంత మంది యువతీ యువకులు ఫలానా సినిమాల్లో హీరోహీరోయిన్ ధరించిన స్వెటర్ తయారు చేసి ఇవ్వాలని ఆర్డర్లు కూడా చేస్తుంటారని చెబుతున్నారు.
ఉలెన్‌తో పాటు క్యాష్మిలన్ ఫ్యాబ్రిక్..
గతంలో ఉన్నితో తయారు చేసిన స్వెటర్లు ధరించేందుకు నగరవాసులు ఆసక్తి చూపేవారు. మందంగా ఉండే ఉన్ని దుస్తులను ధరించేందుకు ఇప్పుడు కొందరు ఆసక్తి చూపట్లేదు.. దీంతో తయారీదారులు తేలికగా ఉండే క్యాష్మిలన్ ఫ్యాబ్రిక్‌తో స్వెటర్లను తయారు చేస్తున్నారు. చలికాలంతో పాటు సాధారణ సీజన్‌లో కూడా ధరించేందుకు వీలుగా ఉండటంతో పాటు స్టైల్‌గానూ ఉంటున్నాయని యువత ఎక్కువగా ఈ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన స్వెటర్లను వాడుతున్నారు. తేలికగా ఉండే చలిని తట్టుకునే స్వెటర్లు, గ్లౌజ్‌లతో పాటు సాక్స్ ఎక్కువగా అడుగుతున్నారు.
– మహ్మద్ ఇల్యాస్ బుఖారీ, వ్యాపారి, మదీనా సర్కిల్
సరసమైన ధరల్లో..
ఏటా కోఠిలో వెలిసే స్వెటర్ దుకాణాల్లో కొనుగోలు చేస్తుంటాం. తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి. డిజైన్స్‌తో పాటు మంచి నాణ్యమైనవి ఇక్కడ దొరుకుతాయని మేం వస్తుంటాం. పిల్లలతో పాటు పెద్ద వారికి కూడా ఇక్కడ లభిస్తుంటాయి.
– మల్లికార్జున్, హైకోర్టు లాయర్
Comments
Please login to add a commentAdd a comment