sweater
-
స్వెట్టీస్.. స్టైల్..
నగరంలో చలికాలం ప్రారంభమైంది. చలికాలం వస్తుందంటే చాలు స్వెటర్ల కోసం నగరవాసి కళ్లు వెతుకుతుంటాయి. మార్కెట్లోకి స్టైలిష్ స్వెటర్లు కొనేందుకు చూస్తుంటారు. నవంబర్ రాగానే నగరంలో స్వెటర్ దుకాణాలు భారీగా వెలుస్తుంటాయి. ఈ ఏడాది కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో స్వెటర్ దుకాణాలు వెలిశాయి. రంగురంగుల ఉన్ని దుస్తులతో పాటు రగ్గులు, దుప్పట్లు, టోపీలు, మఫ్లర్లు, చేతి గ్లౌజులు కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.నవంబర్ రెండో వారం నుంచి జనవరి మూడో వారం వరకూ నగరంలో చలికాలం ఉంటుంది. ప్రత్యేకంగా డిసెంబర్, జనవరి నెలలో నగర ఉష్ణోగ్రతలు 12.5 డిగ్రీల కనిష్ట స్థాయిలో నమోదు అవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది నవంబర్ రెండో వారంలో చలి ప్రారంభమైంది. కానీ తుఫాను ప్రభావంతో చలి తీవ్రత తగ్గింది. ఈ వారం నుంచి చలి వాతావరణం మళ్లీ పుంజుకుంది. దీంతో స్వెటర్ల వ్యాపారాలు జోరుగా పెరిగాయి. నేపాల్ నుంచి వచ్చి.. చలికాలం ప్రారంభం కాగానే నేపాల్ వ్యాపారులు నగరానికి భారీగా తరలివచ్చి స్లాళ్లు ఏర్పాటు చేసుకుని మరీ అమ్మకాలు జరుపుతుంటారు. కోఠికి వెళ్లేవారు ఇలాంటి దుకాణాలను వరుసగా చూసే ఉంటారు. వీటితోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల వెంబడి స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. చాలా మంది నగర వాసులు ఇక్కడే కొనుగోలు చేస్తుంటారు. మూడు నెలల పాటు ఇక్కడే ఉండి విక్రయిస్తుంటామని, తమ ఉత్పత్తులకు ఇక్కడ డిమాండ్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. బ్రాండెడ్ దుకాణాలు సైతం.. ఇటీవల స్వెటర్ల వ్యాపారం రోడ్లపై నుంచి బ్రాండెడ్ షాపుల వరకూ చేరింది. గతంలో చేతితో తయారు చేసిన స్వెటర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరుందిన బ్రాండెడ్ కంపెనీలు తయారు చేస్తున్న స్వెటర్లను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లు వేసుకుంటున్న స్వెటర్ల కోసం బ్రాండెడ్ దుకాణాల్లో వెతుకుతున్నారు. వారి అభిరుచిని బట్టి వ్యాపారులు కూడా బ్రాండెడ్ ఉన్ని దుస్తులను తెప్పిస్తున్నారు. ధర ఎక్కువైనా కూడా వాటిని కొనేందుకు ముందుకొస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. తగ్గిన వ్యాపారం..నగరంలో ఏటా చలికాలం ప్రారంభానికి ముందు నుంచే పలువురు వ్యాపారులు తాత్కాలిక స్వెటర్ల షాపులు, రోడ్డుల పక్కన స్టాళ్లు ఏర్పాటు చేసి, మైదానాల్లో అమ్మకాలు చేస్తుండేవారు. అయితే ఈ ఏడాది నవంబర్ రెండో వారం నుంచి చలి ప్రారంభమైనప్పటికీ బంగాళాఖాతంలో తుపాన్ రావడంతో నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. చలి తగ్గింది. తిరిగి డిసెంబర్ నెల్లో కూడా సైక్లోన్ రావడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి. దీంతో చలికాలం కోసం నగర వ్యాపారులు దేశ, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వివిధ రకాల స్వెటర్లతో పాటు ఇతర దుస్తువుల వ్యాపారం అనుకున్న స్థాయిలో జరగడంలేదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. స్టైల్ కోసం..చలిని తట్టుకోడంతో పాటు.. ధరించినప్పుడు హుందాగా కనబడేందుకు పలు స్వెటర్ తయారీ సంస్థలు వివిధ రకాల మోడల్స్‌ను రూపొందిస్తున్నాయి. ఇవి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. ఏఎన్ఆర్, ఎనీ్టఆర్, చిరంజీవి లాంటి ఆ తరం నటులు సినిమాల్లో ధరించిన స్వెటర్లను అప్పట్లో వాడేవారని, ఇప్పుడు ఈ తరం హీరోలు, హీరోయిన్లు ధరించే స్వెటర్లను వాడేందుకు ఇప్పటి యువత ఆసక్తి చూపిస్తోందని పేర్కొంటున్నారు. కొంత మంది యువతీ యువకులు ఫలానా సినిమాల్లో హీరోహీరోయిన్ ధరించిన స్వెటర్ తయారు చేసి ఇవ్వాలని ఆర్డర్లు కూడా చేస్తుంటారని చెబుతున్నారు. ఉలెన్‌తో పాటు క్యాష్మిలన్ ఫ్యాబ్రిక్.. గతంలో ఉన్నితో తయారు చేసిన స్వెటర్లు ధరించేందుకు నగరవాసులు ఆసక్తి చూపేవారు. మందంగా ఉండే ఉన్ని దుస్తులను ధరించేందుకు ఇప్పుడు కొందరు ఆసక్తి చూపట్లేదు.. దీంతో తయారీదారులు తేలికగా ఉండే క్యాష్మిలన్ ఫ్యాబ్రిక్‌తో స్వెటర్లను తయారు చేస్తున్నారు. చలికాలంతో పాటు సాధారణ సీజన్లో కూడా ధరించేందుకు వీలుగా ఉండటంతో పాటు స్టైల్‌గానూ ఉంటున్నాయని యువత ఎక్కువగా ఈ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన స్వెటర్లను వాడుతున్నారు. తేలికగా ఉండే చలిని తట్టుకునే స్వెటర్లు, గ్లౌజ్‌లతో పాటు సాక్స్ ఎక్కువగా అడుగుతున్నారు. – మహ్మద్ ఇల్యాస్ బుఖారీ, వ్యాపారి, మదీనా సర్కిల్సరసమైన ధరల్లో.. ఏటా కోఠిలో వెలిసే స్వెటర్ దుకాణాల్లో కొనుగోలు చేస్తుంటాం. తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి. డిజైన్స్‌తో పాటు మంచి నాణ్యమైనవి ఇక్కడ దొరుకుతాయని మేం వస్తుంటాం. పిల్లలతో పాటు పెద్ద వారికి కూడా ఇక్కడ లభిస్తుంటాయి. – మల్లికార్జున్, హైకోర్టు లాయర్ -
ప్రిన్సెస్ డయానా స్వెటర్ ధర రూ. 9.14 కోట్లు
లండన్: దివంగత బ్రిటిష్ యువరాణి డయానా ధరించిన స్వెటర్ ఒకటి వేలంలో రికార్డు స్థాయిలో రూ.9.14 కోట్లు పలికింది. రాజ కుటుంబానికి చెందిన వస్తువుకు అంచనాకు మించి ఇంతటి ధర పలకడం ఇదే మొదటిసారి. ప్రముఖ సోథ్‌బీ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ ఫ్యాషన్ ఐకాన్ సేల్ వేలంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రూ.9,14,58,510కి ఈ స్వెటర్‌ను సొంతం చేసుకున్నారు. గురువారం ఆఖరి రోజు చివరి 15 నిమిషాల వరకు ఈ స్వెటర్‌కు అత్యధికంగా 1.90 లక్షల డాలర్ల వరకు పలికింది. చివరి నిమిషాల్లో ఒక్కసారిగా 11 లక్షల డాలర్లకు బిడ్ వేశారని సోథ్‌బీ తెలిపింది. జనవరిలో సోథ్‌బీ సంస్థ నిర్వహించిన డయానా ధరించిన బాల్ గౌన్ సైతం రూ.5 కోట్లకు పైగా పలకడం గమనార్హం. -
ఆ ముగ్గుర్నీ కలిశాకే ఈ నిర్ణయం తీసుకున్నా!..ఎప్పటికీ స్వెటర్స్ వేసుకోను
భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ టీషర్ట్స్ ధరించడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదీ కూడా శీతాకాలంలో ఇంత భయంకరమైన చలిలో సైతం రాహుల్ ఎందుకు టీషర్ట్స్ వేసుకుంటున్నారంటూ మీడియాతో సహా సర్వత్ర ఇదే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయమై స్పందించారు. తాను ముగ్గురు బాలికలను కలిసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ఆ చర్చలకు తెరదించారు. వారిని కలిసిన తర్వాత నుంచే టీ షర్టులు ధరించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందరూ ఈ టీ షర్ట్ ఎందుకు ధరిస్తున్నారు చలిగా అనిపించడం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. "ఐతే నేను కేరళలో ప్రవేశించినప్పుడూ కాస్త వేడిగ, తేమగా ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లోకి వచ్చేటప్పటికీ కాస్త చల్లగా ఉంది. అప్పుడే అక్కడకి చిరిగిన బట్లతో ముగ్గురు పేద బాలికలు నా దగ్గరికి వచ్చారు. సరైన దుస్తులు ధరించకపోవడంతో చలికి గజగజ వణకుతున్నారు. దీంతో ఆరోజు నేను నిర్ణయించుకున్నా వారికి చలి అనిపించేంత వరకు(వారు స్వెటర్లు ధరించేంత వరకు) తనకు చలి అనిపించదు. అప్పటి వరకు నేను కూడా స్వెటర్స్ ధరించను. అంతేకాదు ఆ ముగ్గురు బాలికలకు చలి అనిపిస్తే రాహుల్‌కి కూడా చలి అనిపిస్తుందని ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పారు. అయినా తాను టీషర్ట్స్ వేసుకోవడం అనేది ప్రధానాంశం కాదని, ఈ యాత్రలో తన వెంట వస్తున్న పేద రైతులు, కూలీలపై దృష్టి పెట్టండని మీడియాకి చురకలంటించారు. పేద రైతులు, కార్మికులు, వారి పిల్లలు చిరిగిని బట్టలు, టీషర్ట్లు, స్వెటర్లు ధరించకుండా ఎందుకు ఉన్నారో అనేది ప్రధానం, దాని గురించే ఆలోచించండి." అని చెప్పారు రాహుల్. కాగా జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో జరిగింది. జనవరి 30 కల్లా జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కి చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది. इस टी-शर्ट से बस इतना इज़हार कर रहा हूं, थोड़ा दर्द आपसे उधार ले रहा हूं। pic.twitter.com/soVmiyvjqA — Rahul Gandhi (@RahulGandhi) January 9, 2023 (చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ) -
Fashion:స్వెటర్.. ఆధునికతకు అద్దం పట్టేలా ఊలుదారాల అల్లికలు
చలిని తట్టుకోవడానికి స్వెటర్ ఎంపిక సాధారణంగా ఉండాలని కోరుకోవడం లేదు నేటి నవతరం. వాటి రంగులు, డిజైన్లు... ఆధునిక హంగులతో పోటీపడాలనుకుంటున్నారు. యాంకిల్ లెంగ్త్‌లో హుషారెత్తించాలనుకుంటున్నారు. సీతాకోక రెక్కలను ఒంటికి చుట్టేసుకున్నట్టు.. బబుల్ స్లీవ్స్‌తో ‘భలే’ అనిపించాలనుకుంటున్నారు. అందుకు తగినట్టే... ఈ శీతకాలాన్ని శత హొయలు పోయేలా ఊలుదారాల అల్లికలను తమదైన సృజనతో మెరిపించాలని పోటీపడుతున్నారు డిజైనర్లు. చదవండి: Manchu Laxmi: డి బెల్లె బ్రాండ్ సారీలో లక్ష్మీ మంచు! చీర ధర ఎంతంటే Saritha: వైకల్యం శరీరానికి మాత్రమే! మనసుకు కాదు.. బాహుబలిలో నటించా! -
స్వెటర్‌ను లాంచ్ చేసిన మైక్రోసాఫ్ట్..! ధర ఏంతంటే..!
Microsoft Launches A Minesweeper Inspired Christmas Special Sweater: మైక్రోసాఫ్ట్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు అనుకుంటా బహుశా..! టెక్ దిగ్గజం ఐటీ ఆధారిత సేవలకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ బేస్డ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సర్వీసులను మైక్రోసాఫ్ట్ అందిస్తోంది. వీటితో పాటుగా ప్రతి క్రిస్మస్కు మైక్రోసాఫ్ట్ వెరైటీ స్వెటర్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఏడాది కూడా క్రిస్మస్కు ‘ మైన్స్వీపర్ ఆగ్లీ’ అనే పేరుతో స్వెటర్‌ను విడుదల చేసింది. ఈ స్వెటర్ ప్రత్యేకత ఏమిటంటే..! మైక్రోసాఫ్ట్ 1990 నుంచి ప్రతి ఏడాది క్రిస్టమస్‌కు ఓ వినూత్న స్వెటర్‌ను లాంచ్ చేస్తుంది. వీటి సేల్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తుంది. గత ఏడాది ఎంఎస్ పెయింట్- ఆధారిత ‘అగ్లీ క్రిస్మస్ స్వెటర్‌ను లాంచ్ చేయగా...వాటి నుంచి వచ్చిన ఆదాయాన్ని మైక్రోసాఫ్ట్ గర్ల్స్ హూ కోడ్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చింది. కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసిస్తున్న యువతులకు గర్ట్స్ హూ కోడ్ ఫౌండేషన్ సహాయం చేసింది. ధర ఎంతంటే..! మైన్స్స్వీపర్ గేమ్ స్ఫూర్తిలో ఈ స్వెటర్‌ను మైక్రోసాఫ్ట్ రూపొందించింది. అమెరికన్ మార్కెట్లలో ఈ మైన్స్స్వీపర్ అగ్లీ స్వెటర్ ధర 74.99 డాలర్లు (సుమారు రూ. 5,600)గా ఉంది. ఈ స్వెటర్‌ను ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ చేయనుంది. అన్ని దేశాలవారు ఈ స్వెటర్‌ను కొనుగోలుచేయవచ్చును. స్మాల్, లార్జ్, మీడియమ్, ఎక్స్ఎల్, డబుల్ఎక్స్ఎల్, త్రిబుల్ ఎక్సెఎల్ సైజులో లభించనుంది. చదవండి: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త..! -
Saree Styles With Sweater: చలికాలంలో ఫ్యాషనబుల్‌గా వెచ్చని స్టైల్!
కాలానికి తగినట్టు చలిని తట్టుకోవాలంటే మన వేషధారణలోనూ ప్రస్తుతం కొన్ని మార్పులు చేసుకోవాలి. క్యాజువల్ అయినా.. పార్టీ అయినా.. పెళ్లి అయినా.. పండగ అయినా.. స్వెటర్‌తో ఒక స్టైల్, డెనిమ్ షర్ట్‌తో మరో స్టైల్.. పెప్లమ్ టాప్‌తో ఒక స్టైల్, లాంగ్ జాకెట్‌తో మరో స్టైల్... ఇలా ఒక చీరకట్టుకే భిన్నమైన స్టైల్స్‌ను జత చేయచ్చు. కాలానికి తగిన విధంగా లుక్‌లో మార్పులు తీసుకురావచ్చు. పెళ్లికి వెళ్లాలంటే ఎప్పుడూ ఒకేవిధంగా ఉండనక్కర్లేదు. బెనారస్ లాంగ్ జాకెట్‌ను పట్టు చీరకు జతగా ధరిస్తే చాలు చలికాలానికి తగినట్టుగా చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తుంది. క్యాజువల్ లుక్‌లో కొంచెం భిన్నంగా ఉండటంతోపాటు స్టైల్‌గా కనిపించాలంటే ఈ సీజన్‌కి తగినట్టుగా డెనిమ్ జాకెట్‌ను శారీకి జతగా ధరిస్తే చాలు. ఎక్కువ ఆభరణాలు అవసరం లేకుండా వర్క్వేర్గా అందంగా కనిపిస్తుంది. కాటన్ చీరలు ధరించేవారు ప్లెయిన్ లేదా శారీ కలర్ బ్లౌజ్ ధరించడం చూస్తుంటాం. దీంట్లోనే కొంత భిన్నమైన లుక్‌ను తీసుకురావచ్చు. టర్టిల్ నెక్, లాంగ్ స్లీవ్స్ ఉన్న ప్లెయిన్ కలర్ బ్లౌజ్‌లను ఈ శారీ స్టైల్‌కు వాడొచ్చు. ఈ కాటన్ శారీస్‌కు టర్టిల్ నెక్ ఉన్న స్వెట్ షర్ట్ కూడా ధరించవచ్చు. ప్రయాణాలు, సింపుల్ గెట్ టు గెదర్ వంటి వాటికి ఈ స్టైల్ బాగా నప్పుతుంది. కాంతిమంతమైన రంగులలో అంచు భాగాన్ని ఎంబ్రాయిడరీ చేసిన సాదా చీరను ఎంచుకోవాలి. ఆ ఎంబ్రాయిడరీకి సరిపోలే ఓపెన్ ఫ్రంట్ పెప్లమ్ జాకెట్‌ను తీసుకోవాలి. దీంతో పార్టీవేర్ లుక్ ఆకట్టుకుంటుంది. ఒక్క పెప్లమ్ ఓపెన్ టాప్‌తో మీదైన స్టైల్ స్టేట్మెంట్ను ఈ కాలానికి సరికొత్తగా పరిచయం చేయచ్చు. పెళ్లికి వెళ్లేవారు పట్టు చీర కట్టుకుంటారు. దీనికి బ్లాక్ కలర్ లంగా జాకెట్, సంప్రదాయ ఆభరణాలు ధరించి చూడండి. ఇండో వెస్ట్రన్ లుక్‌తో ప్రత్యేకంగా కనిపిస్తారు. పార్టీకి చిటికలో తయారై వెళ్లాలంటే లాంగ్ జాకెట్‌తో ఉన్న ద్రెసింగ్ రెడీమేడ్ శారీని ఎంచుకుంటే చాలు. ఫ్యాషనబుల్‌గా కనిపించడంతోపాటు కాలానుగుణంగా డ్రెస్ ధరించడంలోనూ మార్కులు కొట్టేస్తారు. పెళ్లికి స్వెటర్ ధరిస్తే బాగుండదు అనుకునేవారు ఇలా పట్టుచీరకు లాంగ్ స్లీవ్స్ ఉన్న వైట్ షర్ట్ ధరించి, నడుముకు వెడల్పాటి లెదర్ బెల్ట్‌తో తయారవ్వచ్చు. సంప్రదాయ ముత్యాల హారాలు ఈ స్టైల్‌కు మరింత వన్నె తెస్తాయి. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. -
ఆమెను కొత్త స్వెటర్ కొనుక్కోనిద్దాం..
చలికాలం పిల్లలు నిద్ర లేవరు. వారికి ఆ హక్కు ఉందట. భర్త గారు ‘కాసేపు నిద్రపోనీ’ అంటుంటారు. ఆయనగారిని ఏం అనగలం. కాని స్త్రీలు లేవాల్సిందే. వంట చేయాల్సిందే. అన్నీ సిద్ధం చేయాల్సిందే. వారెప్పుడు రుతువులను ఎంజాయ్ చేయాలి? భార్యకు కొత్త స్వెటర్ కొనివ్వాలంటే టైమ్ ఉండదు. పోనీ ఆమెను కొనుక్కోనివ్వము. అమ్మకు చెవులకు స్కార్ఫ్ ఎప్పుడూ పాతదే. చలికి ఆడవాళ్ల పాదాలకు సాక్సులు అవసరం అని కూడా అనుకోము. ఈ కాలంలో స్త్రీలకు ఏం కావాలో వారిని తెచ్చుకోనివ్వండి. పని ఒత్తిడి తగ్గించండి. టీ తాగుతూ చలిని వారినీ ఆస్వాదించనివ్వండి. చలికాలం బద్దకం కాలం. వెచ్చగా ముసుగుతన్నమని చెప్పేకాలం. కాని ఆ లగ్జరీ ఇంటి మగవారికి, పిల్లలకి ఉన్నట్టుగా ఆడవారికి ఉండదు. బయట ఎంత చలి ఉన్నా తెల్లారే ఆరుకు వాళ్లు లేవాల్సిందే. బయట ఎంత మంచు కురుస్తున్నా తొంగి చూడక వంట గదిలో దూరాల్సిందే. వరండాలోనో, బాల్కనీలోనో, ముంగిలి లోనో కుర్చీ వేసుకుని కాఫీ తాగుతూ మంచుతో తడిసిన బంతిపూల మొక్కను చూడాలని వారికీ ఉంటుంది. కాని వారికి కాఫీ తెచ్చిచ్చేవారు ఎవరూ ఉండరు. వారి కాఫీ వాళ్లే పెట్టుకోవాలి. చలికాలమైనా హిమ ఉదయమైనా. ఇంకా ద్వితీయశ్రేణి పౌరులేనా? చలికాలం వస్తే భర్త బజారు నుంచి వస్తూ వస్తూ రోడ్డు మీద అమ్మే ఒక జర్కిన్నో, స్వెటర్నో కొనుక్కుంటాడు. బండి నడుపుతాడు కదా మంకీ క్యాప్ కొనుక్కుంటాడు. పిల్లలు చలికి ఎక్స్పోజ్ అయితే ఎలా? వారి కోసం తప్పక స్వెటర్లు కొంటాడు. కాని భార్యకు ఎందుకనో వెంటనే కొనడు. కొనాలన్నా ఉంది కదా అనిపిస్తుంది. ఆమే కొనుక్కుంటుందిలే మన సెలక్షన్ నచ్చదు అనుకుంటాడు. ఆమె కొనుక్కునేది లేదు. ఆమెకు ఆ వీలూ చిక్కదు. చాలా ఇళ్లల్లో స్త్రీలు పాతబడిన స్వెటర్లతోనే తిరుగుతూ ఉంటారు ఈ సీజన్లలో. స్త్రీలకు రకరకాల స్వెటర్లు అమ్ముతారు. హాఫ్ స్వెటర్లు ఇంట్లో వేసుకోవచ్చు. ఫుల్స్వెటర్లు బయటకు వెళ్లేప్పుడు. కొనే స్తోమత ఉన్నా ‘ఇన్ని ఎందుకు’ అనే ప్రశ్న ఆమెకు ఎదురవుతుంది. స్త్రీలు సౌందర్య ప్రియులు అని తెలుసు. ఈ శీతాకాలం రెండు మూడు నెలలు ఒకే ఒక్క స్వెటర్‌తో వాళ్లు ఎందుకు గడిపేయాలి. అక్కర్లేదు అని వారూ అనుకోరు. ఇంటి మగవారూ చెప్పరు. అమ్మ సంగతి ఏమిటి? ఇంట్లో అమ్మ ఉంటే శీతాకాలం ఆమెకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆమెకు బడ్జెట్ కేటాయించాలి. ఒక మంచి షాల్ కప్పుకుని ఆమె కూచుంటే ఎంత బాగుంటుంది. ఆమెకు నచ్చిన రంగుల్లో రెండు మూడు స్కార్ఫులు ఉంటే ఎంత బాగుంటుంది. నేలకు పాదాలు తాకి జిల్లు మనకుండా ఇంట్లో తిరగడానికి మంచి స్లిప్పర్లు, సాక్సులు ఆమెకు తప్పనిసరి. ఒక కొత్త రగ్గు కొని ఇస్తే ఆ ఉత్సాహమే వేరు. అమ్మ ఆ ఇంట్లో కొడుకు, కోడలు మీద ఆధారితమైతే ఆమెను చిన్నబుచ్చకుండా ఇవన్నీ లేదా వీటిలో కొన్నయినా ఈ శీతాకాలపు ప్రారంభంలోనే ఆమెకు కొనిస్తే నోరు తెరిచి అడగాల్సిన అవస్థ తప్పుతుంది. ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి. ఆ డబ్బును చాలా ఇళ్లల్లో ఆ అమ్మలు, అత్తలు కొడుకు చేతుల్లోనో కోడలు చేతుల్లోనో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ‘ఈ నెల డబ్బు మీ కోసం మీ చలికాలపు అవసరాల కోసం ఉంచుకోండి’ అని చెప్పలేమా? వంట బాధ రోజూ ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నా ఒక్కపూట బజారు నుంచి తెచ్చుకోండి అంటే ‘బజారు టిఫినా’ అని విసుక్కుని రోజు మూడ్‌ని పాడు చేసే భర్తలు ఉంటారు. రోజూ టిఫిన్ చేసే బాధ వేరే ఏ కాలంలో అయినా ఓకే కాని చలికాలం చాలా కష్టం. చలికి పని చేయబుద్ధి కాదు. ఎవరైనా చేసిపెడితే బాగుండు అని భర్తలకు సదా అనిపించినట్టే భార్యలకు అప్పుడప్పుడైనా అనిపిస్తుంది. భోజనం తిప్పలు ఎలాగూ తప్పవు కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో ఎలా ఆ శ్రమ కాస్తంత తగ్గించవచ్చో ప్రతి ఇంటి పురుషులు, పిల్లలు ఆలోచించాలి. ప్రత్యామ్నాయ టిఫిన్లు, ఇన్స్టంట్ టిఫిన్లు, ఆమె చేయకపోయినా మనం చేసుకు తినగలిగే అల్పాహారాలు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. యూట్యూబ్‌లో కొడితే వందలాది వీడియోలు ఉన్నాయి. మనం ఇల్లు కదలకపోయినా తెచ్చిపెట్టే స్విగ్గి, జొమాటోలు ఉన్నాయి. వారంలో ఒకటి రెండు రోజులైనా ఈ శీతాకాలంలో ఉదయపు వంట చెర నుంచి ఆమెను విముక్తి చేస్తే ఆమెకు కలిగే సంతోషం ఆలోచించారా ఎవరైనా? ఆమె సౌందర్యం అవును. చక్కగా ఉండే హక్కు, సౌందర్యాన్ని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మగవాళ్లు దీనిని లెక్క చేయొచ్చు చేయకపోవచ్చు. కాని శీతాకాలంలో స్త్రీలు తమ శరీరం గురించి ఆలోచన చేస్తారు. చర్మాన్ని, శిరోజాల్ని కాపాడుకోవడానికి వారికి కొన్ని వస్తువులు అవసరం. క్రీములు, నూనెలు, సబ్బులు... అదనపు ఖర్చే. ఆ ఖర్చు వారు సంపాదించే దాని నుంచైనా భర్త సంపాదన నుంచైనా చేసే వాతావరణం ఇంట్లో ఉండాలి. చర్మ సమస్యలు కొందరిలో రావచ్చు. వాటిని చిట్కాలతో సరిపుచ్చుతూ బాధపడాల్సిన పని లేదు. వైద్యుల దగ్గరకు వెళ్లాలి. ఇక ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి చలికాలం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని రోజువారీ చాకిరీ నుంచి దాదాపుగా తప్పించాలి. ఈ కాలంలో జలుబు, త్రోట్ ఇన్ఫెక్షన్లు సహజం. వాటి నుంచి కాపాడేలా ఆమెను వెచ్చని వాతావరణంలో విశ్రాంతంగా ఉంచడం కోసం ఏం చేయొచ్చో ఆలోచించాలి. నిజానికి ఇవన్నీ రాసి చెప్పాలా అనిపించవచ్చు. రాసి చెప్తే కాని స్త్రీలకు ఎంత పని ఉందో దాని నుంచి ఎలా తప్పించవచ్చో తెలియనంతగా ఆ పని స్త్రీల నెత్తి మీద ఉంది. చలికాలం వారికి పని తేలిక చేద్దాం. చలికాలాన్ని ఎంజాయ్ చేసేలా చూద్దాం. హ్యాపీ వింటర్. నిజానికి ఇవన్నీ రాసి చెప్పాలా అనిపించవచ్చు. రాసి చెప్తే కాని స్త్రీలకు ఎంత పని ఉందో దాని నుంచి ఎలా తప్పించవచ్చో తెలియనంతగా ఆ పని స్త్రీల నెత్తి మీద ఉంది. చలికాలం వారికి పని తేలిక చేద్దాం. -
చిరిగిన స్వెటర్.. లక్షపైనే.. స్పెషల్ ఏంటంటే
చలికాలం వస్తుంది కదా అని మార్కెట్లో స్వెటర్ కొనడానికి వెళ్తే.. అక్కడ ‘ఎలుకలు కొరికిన స్వెటర్... కుందేలు కొరికిన స్వెటర్..’ ఇలా చిరిగిన స్వెటర్లు అమ్మే దృశ్యాలను త్వరలోనే చూడబోతున్నాం. నిజం, ఈ మధ్యనే ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ బాలెన్సియాగా ‘డిస్ట్రాయిడ్ క్రూనెక్’ పేరుతో కొత్తరకం స్వెటర్లను విడుదల చేసింది. వంద శాతం ఉన్నితో తయారు చేసిన వీటి డిజైన్, అచ్చం ఎలుకలు కొరికితే చిల్లులు పడిన స్వెటర్‌లాగే ఉంటుంది. మొదట చిరిగిన ప్యాంటుగా పేరు పొందిన టాన్ జీన్స్ ఫ్యాషన్‌ను కూడా ఇలాగే అన్నారు. ఇప్పుడు సామాన్యులు కూడా ఇష్టపడిమరీ ఆ ప్యాంట్లను కొంటున్నారు. మార్కెట్లో వచ్చేవి యువతకు నచ్చితే చాలు వాటి సేల్స్ అమాంతం పెరిగిపోతాయి. ఇక ఈ స్వెటర్లో ఆశ్చర్యపోయే మరో విషయం ఏంటంటే దీని ధర. మీరు కనుక దీన్ని కొనాలనుకుంటే ఈ స్వెటర్‌లాగే మీ జేబు, పర్స్కూ చిల్లు పడ్డం ఖాయం. ఎందుకంటే ఈ స్వెటర్ అక్షరాల 1,450 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1,07,652 పలుకుతుంది మరి! చదవండి: ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ -
సమ్మర్ స్పెషల్: చిరిగినదానికి ఇంత ఖరీదా?
వేసవి కాలం రానేలేదూ అప్పుడే మధ్యాహ్నం ఎండలు దంచేస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు శీతాకాలం డ్రెస్సుల కోసం చూసిన కళ్లన్నీ ఇప్పుడు సమ్మర్వేర్ కోసం వెతుకులాట మొదలు పెట్టాయి. ఈ క్రమంలో పైన కనిపిస్తున్న స్వెటర్ ఓ వ్యక్తి కంట పడింది. వార్నీ, ఇది సమ్మర్ స్వెటరా? అని కొన్ని క్షణాలపాటు తత్తరపాటుకు లోనైన అతడు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముందీ నెట్టింట ఇప్పుడీ స్వెటర్ హాట్ టాపిక్‌గా మారింది. (చదవండి: ఛీ ఛీ.. అసెంబ్లీలో ఇదేం పాడుపని!) ఇటాలియన్ ఫ్యాషన్ రంగానికి చెందిన ప్రద కంపెనీ ఓ పసుపు రంగు స్వెటర్‌ను అమ్మకానికి పెట్టింది. అయితే దానికి ఎక్కడపడితే అక్కడ రంధ్రాలు పెట్టి మరీ అమ్ముతుండటం ప్రత్యేకత. పైగా దాని ధరెంత అనుకుంటున్నారు. ఇంచుమించు 90,656 రూపాయలు. ధరకు దానికి ఏమాత్రం సంబంధం లేనట్లు కనిపిస్తోన్న ఈ స్వెటర్‌ను చూసిన ఓ ట్విటర్ యూజర్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'ఈ స్వెటర్ నాకు స్విస్ చీజ్‌ను గుర్తు చేస్తోంది' అని రాసుకొచ్చాడు. కొందరు నెటిజన్లు సైతం 'అవును, అది చీజ్‌ను తలపిస్తోందని లొట్టలేస్తుండగా మరికొందరు మాత్రం అదేమ్ స్వెటర్రా బాబూ' అని విమర్శిస్తున్నారు. 'అయినా చిరిగినట్లు కనిపిస్తోన్న దీనికి అన్ని వేల రూపాయలా?' అని పలువురు నోరెళ్లబెడుతున్నారు. (చదవండి: ఆస్తి 5 మిలియన్ డాలర్లు.. కానీ తినేది..) -
ఊలు స్వెట్టర్లు ముడుచుకుని పోకుండా ఉండాలంటే..!
ఊలు స్వెట్టర్లను మామూలుగా ఉతికి ఆరేస్తే అవి కుంచించుకుపోతాయి. ఆరిన తర్వాత వాటిని తిరిగి వేసుకుంటే అవి పొట్టిగా, బిగుతుగా అనిపిస్తాయి. ఊలు స్వెట్టర్లను ఉతకడంలో చిన్న చిట్కాలు పాటిస్తే చాలు, అవి శుభ్రంగా కొత్త వాటిలాగానే ఉంటాయి. ఊలు స్వెట్టర్లు కుంచించుకుపోకుండా ఉండాలంటే... గోరు వెచ్చని నీటిలో డిటెర్జెంట్కు బదులుగా బేబీ షాంపూ లేదా హెయిర్ కండిషనర్ వేసి, స్వెట్టర్లను నానబెట్టాలి. నానిన తర్వాత వాటిని మామూలు బట్టలు ఉతికినట్లు నలిపేసి, పిండేసి ఉతకొద్దు. నీళ్లలోంచి స్వెట్టర్లను పైకి తీసి, సున్నితంగా పిండుతూ నీరంతా ఓడిపోయేలా చేయాలి. తర్వాత నేలపై ఒక పొడి తువ్వాలును పరిచి, దాని మీద స్వెట్టర్‌ను జాగ్రత్తగా పూర్తిగా విస్తరించి పరచాలి. ఇలా చేస్తే పూర్తిగా ఆరిన తర్వాత స్వెట్టర్ ఏమాత్రం కుంచించుకుపోకుండా కొత్త దానిలాగానే ఉంటుంది. -
ఓనర్ ఫ్యామిలీకి చావును చూపించింది!
వాషింగ్టన్: విశ్వాసానికి మారుపేరుగా ఉండే శునకం తన యజమానులకు చుక్కలు చూపించింది. కుక్క దాడికి బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ఘటన గత శుక్రవారం అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. బ్రెండా గుర్రీరో అనే మహిళ స్కార్ఫేస్ అనే తన పెంపుడు కుక్కకు స్వెటర్ తొడగాలని చూసింది. క్రిస్మస్ శాంటా డ్రెస్ తరహాలో ఉంటే స్వెటర్ స్కార్‌ఫేస్‌కు తొడగాలని చూడగా.. దానికి ఎందుకో మరి విపరీతమైన కోపం వచ్చింది. ఇంకేం తన యజమాని గుర్రీరోపై దాడికి దిగింది. ఆమె చేసేదేంలేక అరవడం మొదలుపెట్టింది. అరుపులు విన్న ఆమె భర్త ఇస్మాయిల్ కుక్కను అదుపుచేయడానికి చూడగా ఆయనపైనా విరుచుకుపడింది. మొదట్లో వారిని రక్కి భయపెట్టిన స్కార్ఫేస్ ఆ తర్వాత కరవడానికి ప్రయత్నించింది. పేరేంట్స్ ను కాపాడేందుకు యత్నించిన వారి కుమారుడు ఆంటోని హారీస్(22)ను గాయపరిచింది. బతుకు జీవుడా అంటూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. వీరి పరస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 10 మందితో కూడిన బృందం అక్కడికి చేరుకుంది. తుపాకీతో బెదిరించినా కుక్క చెలరేగిపోయిందని ఎడ్డీ డర్కిన్ అనే పోలీసు తెలిపారు. కుక్కను డాగ్స్ వ్యానులో తీసుకెళ్లిపోయారు. గాయపడ్డ ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. స్కార్ఫేస్ మెడ, తల భాగంలో రక్తపు మరకలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాము తక్షణం స్పందించకపోతే ఆ ముగ్గురి పరిస్థితి మరింత విషమంగా ఉండేదని పోలీసులు వివరించారు. -
పాత స్వెటర్... కొత్తగా!
న్యూలుక్ పొట్టి స్వెటర్‌ను పొడుగ్గా కూడా మార్చేయవచ్చు. అంతేకాదు... చలి నుంచి రక్షణకు చేతులకు గ్లౌజులుగా, పాదాలకు సాక్సులుగా కూడా ఉపయోగించవచ్చు. మరో క్లాత్‌ను జత చేసి స్వెటర్ ఫ్రాక్, గౌన్లను తయారుచేయవచ్చు. ఈ చలికాలాన్ని ఇంకొత్తగా, వెచ్చగా గడిపేయవచ్చు. స్వెటర్ + డెనిమ్: స్వెటర్‌కి కింది భాగంలో డెనిమ్ ప్యాంట్స్ ముక్కలను కత్తిరించి, ప్యాచ్ వర్క్ చేయాలి. దీంతో స్వెటర్ ఫ్రాక్లా మారిపోతుంది. రెండు స్వెటర్స్ కలిపి కొత్త మోడల్ స్వెటర్నూ తయారుచేసుకోవచ్చు. పొట్టి స్వెటర్: పిల్లలు పెద్దవుతుంటారు కాబట్టి వారి స్వెటర్లు ఏడాదికోసారి మార్చేయాల్సి వస్తుంది. పాత స్వెటర్‌ని మూలన పడేయకుండా ఈసారి ఇలా మార్చేయండి. స్వెటర్ మధ్య భాగాన నెక్ నుంచి కింద వరకు కత్తిరించాలి. దానికి మరో క్లాత్‌ను జతచేసి, లోపలివైపు మడిచి కుట్టాలి. దీంతో స్వెటర్ ప్యాట్రన్ మారిపోతుంది. బిగుతు నుంచి వదులుగా అవుతుంది. చేతులకు + కాళ్లకు: స్వెటర్ లాంగ్ స్లీవ్స్‌ను కట్ చేయాలి. చేతుల వద్ద రెండు, మూడు రకాల ప్యాట్రన్ క్లాత్స్ జత చేసి కుడితే సరి. అలాగే వీటిని కాళ్లకు లాంగ్ సాక్స్లుగా రూపొందించుకోవచ్చు. సాక్సులకు పౌచ్‌లు అమర్చి, లేసు జత చేస్తే కొత్త డిజైన్‌తో ఆకట్టుకుంటాయి. పిల్లలకు, యువతరానికి ఇవి బాగా నప్పుతాయి. పెద్ద బటన్స్‌తో రూపుకట్టు: ప్లెయిన్ స్వెటర్స్కు పెద్ద పెద్ద బటన్స్ ముచ్చటగా ఉంటాయి. పాత బటన్స్‌ను తీసేసి, వాటి స్థానంలో కొత్త బటన్స్ కుట్టాలి. -
చలికి దుప్పటి కప్పేద్దాం!
చలి మొదలైంది. వణుకు మొదలైంది. ఇన్నాళ్లూ బీరువాలో అడుగునో, బ్యాగుల్లోనో దాచిన స్వెట్టర్లు మెల్లగా బయటకు వస్తున్నాయి. సరికొత్త మోడల్స్‌ను వెతికే నేటితరం కోసం మార్కెట్లో ఎన్నో స్వెటర్ వెరైటీలు సందడిచేస్తున్నాయ. కలర్స్, కట్స్, కవరింగ్స్.. ఏదైనా సరే స్టైల్‌గా.. వెచ్చగా స్వెటర్‌ని హత్తుకుపొండి. చలికి దుప్పటి కప్పేయండి. మెటీరియల్స్‌లో స్వెటర్స్ గొర్రె వెంట్రుకలను గ్రేడ్స్‌గా విభజించి స్వెటర్లను తయారుచేస్తారు. గ్రేడ్ రకాలను బట్టి ధర ఉంటుంది. కాశ్మీర్ స్వెటర్ల ప్రపంచంలోనే మంచి నాణ్యమైనవిగా పేరుంది. అల్పాకా స్వెటర్స్ను ఫైబర్‌తో తయారుచేస్తారు. వీటి ఉత్పత్తిలో వందేళ్లుగా దక్షిణ అమెరికా ప్రసిద్ధిగాంచింది. చలికి వెచ్చదనాన్ని ఇవ్వడంలోనూ, కాశ్మీర్ ఊలు అంత మెత్తగా ఈ ఫైబర్ ఊలు ఉంటుంది. దీంతో గ్లౌజ్‌లు, హ్యాట్లు కూడా తయారుచేస్తారు. కాటన్, పాలియస్టర్ మెటీరియల్‌తో స్వెటర్లు తయారుచేస్తారు. ఇవి చలిని కొంతవరకు మాత్రమే ఆపగలవు. కాటన్ నాణ్యతను బట్టి ఇవి చలిని ఆపగలవు. పాలియస్టర్, కాటన్ల కలయికతో స్వెటర్లను తయారుచేస్తారు. వీటిని రెగ్యులర్ వేర్‌గానూ ధరించవచ్చు. ఫైబర్ కూడా ఇందులో కలిసి ఉంటుంది. పరిమాణం చాలా వరకు వదులుగా, ఒంటిమీద పడిపోతున్నట్టుగా ఉంటుంటాయి స్వెటర్లు. అలా అయితే చూడ్డానికి బాగుండదు. ఛాతీ పరిమాణం, పొడవు, చేతుల పొడవు..ఇలా శరీర కొలతల ప్రకారం ఎంపిక చేసుకోవాలి. నెక్ స్టైల్స్ ముఖ్యం క్రో నెక్: చాలా వరకు సాధారణంగా అందరూ ఉపయోగించే స్వెటర్లకు క్రో(కాకి) నెక్ ఉంటుంది. దీంట్లో వెడల్పు, మెడకు పట్టేసినట్టు ఉండటం వంటి తేడాలు ఉంటాయి. ఇది చాలా మామూలు స్టైల్. వి-నెక్: ఈ స్టైల్ స్వెటర్ సాధారణం కన్నా భిన్నం. ఇన్నర్ షర్ట్ నెక్ భాగం పైకి కనిపించేలా 2 పీస్ స్టైల్ ఇందులో చూడచ్చు. టర్టిల్ నెక్ పొడవు కాలర్ మడ త వేసి ఉంటుంది. ఈ స్టైల్ క్లాసిక్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఫార్మల్ టైప్ స్వెటర్స్ కన్నా ఇది ఇంకాస్త వెచ్చదనాన్ని ఇస్తుంది. రోల్నెక్, షావ్ల్ నెక్, నాచ్ నెక్ అంటూ నెక్ స్టైల్స్‌లో మరికొన్ని ఉన్నాయి. స్వెటర్ నెక్ స్టైలో ఫుల్ జిప్, హాప్ జిప్, అలాగే హాఫ్ బటన్, బటన్ డౌన్ ఉన్నవీ స్టైల్లో ముందున్నాయి. రంగులు ప్రాధాన్యం సాధారణంగా స్వెటర్ రంగులలో ముదురు రంగులకే ప్రాధాన్యం ఉంటుంది. వీటిలో నీలం, పచ్చ, పసుపు, ముదురు గోధుమ, బూడిద, తెలుపు, నలుపు రంగువి ఉంటాయి. మీ శరీర రంగును బట్టి ఈ కలర్స్‌ని ఎంచుకోవాలి. ధర కాదు కీలకం ఖరీదు ఎక్కువ పెట్టిన స్వెటర్లే బాగుంటాయిని అనుకోకూడదు. మీరు ఎంచుకున్న స్వెటర్ మీకు సౌకర్యవంతంగా, కంటి రంగులు ఇంపుగా, కనీసం 10 ఏళ్లు వేసుకోదగినదిగా చూసి ఎంపిక చేసుకోవాలి. తక్కువ ధరలోనూ నాణ్యమైన మెటీరియల్స్‌లో స్వెటర్లు అందుబాటులో ఉన్నాయి. మీ ఎంపికే ప్రధానమైనది. టేక్ కేర్ మెషిన్ వాష్, డ్రై క్లీన్ వద్దు ఊలు స్వెటర్‌ను శుభ్రపరచాలంటే డిటర్జెంట్ లిక్విడ్ సోప్‌ను కొద్దిగా నీళ్లలో కలిపి, అందులో నానబెట్టి, మురికిగా ఉన్న చోట రుద్దితే చాలు. ఊలు చాలా మెత్తగా ఉంటుంది, మురికి కూడా త్వరగా వదిలిపోతుంది. బ్రష్, డ్రైక్లీన్, మెషిన్వాష్... తో శుభ్రపరిస్తే ఊలు త్వరగా పాడైపోతుంది. అలాగే శుభ్రపరిచిన తర్వాత నీళ్లు పోయేలా గట్టిగా పిండకూడదు. కాసేపు ట్యాప్ మీద అలాగే ఉంచి, నీళ్లన్నీ పోయాక తీసి ఆరే యాలి. హ్యాంగ్ చేయవద్దు స్వెటర్లను హ్యాంగర్‌కి వేయడం వల్ల భుజాలు, మెడ భాగంలో సాగి ఊలు పలచనవడం,రంధ్రాలు పడటం వంటివి జరుగుతాయి. అందుకని మడచి, షెల్ఫ్‌లో పెట్టేస్తే చాలు. ఆరేసేటప్పుడు కూడా హ్యాంగర్స్ వాడకూడదు. దారాలు ఊడితే... ఊలు స్వెటర్ దారాలు వదులై బయటకు రావచ్చు. వాటిని స్వెటర్ లోపలి భాగానికి కలిపి కుట్టువేయడమో, ముడివేయడమో చేయాలి. ఈ జాగ్రత్త వల్ల స్వెటర్ త్వరగా పాడవదు. కొనేటప్పుడు... చలి నుంచి తట్టుకోవడానికి మాత్రమే స్వెటర్ ఎంపిక అనుకుంటున్నారా.. లేక మీకు అత్యంత ఇష్టమైనదిగా ఉండిపోయేలా ఎంచుకోవాలనుకంటున్నారా.. అనేది ముందు తేల్చుకోవాలి. స్వెటర్ కొనుగోలుకు ముందు ఏ మెటీరియల్‌తో తయారుచేసినది, సైజ్, స్టైల్, కలర్, కుట్టు, ధర.. ఇలా వరసగా సరిచూసుకోవాలి. - ఎన్.ఆర్ -
వామ్మో ఇదేం చలి!
తాండూరు: కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతుండటంతో జనాలు చలితో గజగజ వణుకుతున్నారు. ఉదయం 10 గంటలైనా దీని తీవ్రత తగ్గని పరిస్థితి. సాయంత్రం 6 గంటలకే ప్రజలు దుప్పట్లు ముసుగేస్తున్నారు. ఆదివారం ఈ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత 7.9. డిగ్రీలు నమోదు కావడం చలి తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తోంది. ఉత్తర, వాయవ్యం నుంచి దక్షిణ దిశకు శీతల వాయువులు వీస్తుండటంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి.. చలి విపరీతంగా పెరుగుతోందని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త సుధాకర్ పేర్కొన్నారు. ఈ నెల 18న 9.6 డిగ్రీలు, 19న 11.6, 20న 8.8, 21న 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండటంతో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు తలతో పాటు శరీరానికి రక్షణగా స్వెటర్లు కచ్చితంగా ధరించాలని, చేతులకు గ్లౌస్లు వేసుకోవాలంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలి ప్రభావం బారిన పడకుండా దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. -
శిరోజాలతో స్వెట్టర్..
భర్త కోసం స్వెట్టర్లు అల్లేవారెందరో.. కానీ చైనాలోని చాంగ్‌క్వింగ్‌కు చెందిన జియాంగ్ రెంక్సియాన్(60) అనే రిటైర్డ్ ఉపాధ్యాయిని మాత్రం భర్త కోసం తన శిరోజాలతో స్వెట్టర్‌ను అల్లింది! దానికి మ్యాచింగ్ టోపీ కూడా తయారుచేసింది. అదీ 11 ఏళ్లు కష్టపడి.. జియాంగ్‌కు 34 ఏళ్ల వయసప్పుడు ఈ ఆలోచన వచ్చిందట. ‘కాలేజీ రోజుల్లో అందరూ నా శిరోజాల గురించే మాట్లాడుకునేవారు. అయితే వయసు పెరిగే కొద్దీ.. నా ముఖంతోపాటు శిరోజాల కాంతి కూడా తగ్గడం మొదలైంది. అవి రాలిపోవడం మొదలుపెట్టాయి. అందుకే వాటితో నా భర్త కోసం ఏదైనా చేయాలని ఆలోచించాను.రోజు దువ్వుకున్న అనంతరం దానికి చిక్కుకునే శిరోజాలను దాచి ఉంచడం మొదలుపెట్టాను’ అని ఆమె చెప్పుకొచ్చింది. అలా మొత్తం 1,16,058 శిరోజాలతో భర్తకు స్వెట్టర్ , క్యాప్ అల్లింది. 2003 మొదట్లో మొదలుపెట్టిన ఆ పని ఈ మధ్యే పూర్తయింది. స్వెట్టర్ బరువు 382.3 గ్రాములుండగా.. క్యాప్ బరువు 119.5 గ్రాములుంది. రేపొద్దున్న తన శిరోజాలు పూర్తిగా పాడైపోయినా.. ఈ స్వెట్టర్ తన యవ్వనాన్ని, భర్తతో తాను గడిపిన మధుర స్మృతులను గుర్తుకు తెస్తునే ఉంటుందని జియాంగ్ అంటోంది. భవిష్యత్తులోనూ శిరోజాలతో భర్త కోసం ఏదో ఒకటి తయారుచేస్తానని.. అదేమిటన్నది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పింది.