పాత స్వెటర్... కొత్తగా!
న్యూలుక్
పొట్టి స్వెటర్‌ను పొడుగ్గా కూడా మార్చేయవచ్చు. అంతేకాదు... చలి నుంచి రక్షణకు చేతులకు గ్లౌజులుగా, పాదాలకు సాక్సులుగా కూడా ఉపయోగించవచ్చు. మరో క్లాత్‌ను జత చేసి స్వెటర్ ఫ్రాక్, గౌన్‌లను తయారుచేయవచ్చు. ఈ చలికాలాన్ని ఇంకొత్తగా, వెచ్చగా గడిపేయవచ్చు.
స్వెటర్ + డెనిమ్: స్వెటర్‌కి కింది భాగంలో డెనిమ్ ప్యాంట్స్ ముక్కలను కత్తిరించి, ప్యాచ్ వర్క్ చేయాలి. దీంతో స్వెటర్ ఫ్రాక్‌లా మారిపోతుంది. రెండు స్వెటర్స్ కలిపి కొత్త మోడల్ స్వెటర్‌నూ తయారుచేసుకోవచ్చు.
పొట్టి స్వెటర్: పిల్లలు పెద్దవుతుంటారు కాబట్టి వారి స్వెటర్లు ఏడాదికోసారి మార్చేయాల్సి వస్తుంది. పాత స్వెటర్‌ని మూలన పడేయకుండా ఈసారి ఇలా మార్చేయండి. స్వెటర్ మధ్య భాగాన నెక్ నుంచి కింద వరకు కత్తిరించాలి. దానికి మరో క్లాత్‌ను జతచేసి, లోపలివైపు మడిచి కుట్టాలి. దీంతో స్వెటర్ ప్యాట్రన్ మారిపోతుంది. బిగుతు నుంచి వదులుగా అవుతుంది.
చేతులకు + కాళ్లకు: స్వెటర్ లాంగ్ స్లీవ్స్‌ను కట్ చేయాలి. చేతుల వద్ద రెండు, మూడు రకాల ప్యాట్రన్ క్లాత్స్ జత చేసి కుడితే సరి. అలాగే వీటిని కాళ్లకు లాంగ్ సాక్స్‌లుగా రూపొందించుకోవచ్చు. సాక్సులకు పౌచ్‌లు అమర్చి, లేసు జత చేస్తే కొత్త డిజైన్‌తో ఆకట్టుకుంటాయి. పిల్లలకు, యువతరానికి ఇవి బాగా నప్పుతాయి.
పెద్ద బటన్స్‌తో రూపుకట్టు: ప్లెయిన్ స్వెటర్స్‌కు పెద్ద పెద్ద బటన్స్ ముచ్చటగా ఉంటాయి. పాత బటన్స్‌ను తీసేసి, వాటి స్థానంలో కొత్త బటన్స్ కుట్టాలి.