
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్(Delhi NCR)లోని పలు ప్రాంతాల్లో ఈరోజు(శనివారం) ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. చల్లని గాలులు కూడా వీస్తున్నాయి. రెండు రోజుల క్రితం వరకూ వేడి వాతావరణంలో ఇబ్బంది పడిన ప్రజలకు రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలు ఉపశమనాన్ని అందిస్తున్నాయి. వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో స్థానికులు ఎంజాయ్ చేస్తున్నారు.
#WATCH | Delhi: Rain lashes several parts of the National Capital.
(Visuals from Central Secretariat) pic.twitter.com/8MajN4O8tD— ANI (@ANI) March 1, 2025
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావం వల్ల ఢిల్లీలో వర్షం కురుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. సాయంత్రం తేలికపాటి వర్షం పడటంతోపాటు చల్లని గాలులు వీచాయి. అయితే ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోలేదు. శుక్రవారం గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు(Maximum and minimum temperatures) పెరుగుతూనే ఉన్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.9 డిగ్రీలు ఎక్కువగా ఉంది. అంతకు ముందు గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
మార్చి ఒకటి నుండి పశ్చిమ హిమాలయ ప్రాంతాన్ని కొత్త పశ్చిమ అల్పపీడనం తాకబోతోంది. దీని ప్రభావం పర్వత ప్రాంతాల్లో అధికంగా కనిపించనుంది. ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో స్వల్ప ప్రభావం చూపనుంది. రాబోయే మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత తగ్గనుంది. ప్రస్తుతం 15-19 డిగ్రీల మధ్య ఉన్న ఉష్ణోగ్రత 13-15 డిగ్రీల మధ్యకు చేరుకోనుంది. శుక్రవారం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
హిమాచల్ ప్రదేశ్‌లో..
హిమాచల్ ప్రదేశ్‌లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అలాగే భారీగా కురుస్తున్న హిమపాతం స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపధ్యంలో చంబా, కులు, లాహౌల్-స్పితి, మండీలోని కర్సోగ్ సబ్-డివిజన్, సిమ్లా జిల్లాలోని రోహ్రు సబ్-డివిజన్, కిన్నౌర్ జిల్లాలోని విద్యా సంస్థలను మూసివేశారు. ఈ మేరకు విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రా జిల్లాల్లో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. శుక్రవారం ఉదయం సిమ్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. హిమపాతం కారణంగా, ఎగువ సిమ్లాలోని అనేక మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
రాష్ట్రంలో వర్షాలు, హిమపాతం మరియు కొండచరియలు విరిగిపడటం వల్ల వందలాది రోడ్లు దెబ్బతిన్నాయి. సిమ్లా-రాంపూర్, సిమ్లా-బిలాస్‌పూర్ హైవేలు, రాష్ట్ర రహదారి సిమ్లా-సున్నీ తట్టపాణి జాతీయ రహదారులను అతకష్టం మీద పునరుద్ధరించారు. చౌపాల్ రాష్ట్ర రహదారిని మంచు కారణంగా మూసివేశారు. రాష్టంలోని ములింగ్‌లో హిమపాతం కారణంగా, పర్యాటక వాహనం రోడ్డు మధ్యలో చిక్కుకుంది. వాహనంలోని పర్యాటకుడిని ములింగ్ పంచాయతీ డిప్యూటీ ప్రధాన్‌తో పాటు కొంతమంది యువకులు కాపాడారు.
ఇది కూడా చదవండి: Himachal: ఎడతెగని హిమపాతం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత