వామ్మో ఇదేం చలి!
తాండూరు: కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతుండటంతో జనాలు చలితో గజగజ వణుకుతున్నారు. ఉదయం 10 గంటలైనా దీని తీవ్రత తగ్గని పరిస్థితి. సాయంత్రం 6 గంటలకే ప్రజలు దుప్పట్లు ముసుగేస్తున్నారు. ఆదివారం ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత 7.9. డిగ్రీలు నమోదు కావడం చలి తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తోంది. ఉత్తర, వాయవ్యం నుంచి దక్షిణ దిశకు శీతల వాయువులు వీస్తుండటంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి.. చలి విపరీతంగా పెరుగుతోందని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త సుధాకర్ పేర్కొన్నారు.
ఈ నెల 18న 9.6 డిగ్రీలు, 19న 11.6, 20న 8.8, 21న 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండటంతో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు తలతో పాటు శరీరానికి రక్షణగా స్వెటర్లు కచ్చితంగా ధరించాలని, చేతులకు గ్లౌస్‌లు వేసుకోవాలంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలి ప్రభావం బారిన పడకుండా దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.