సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో ఎముకలు కొరికే చలి ఉండాలి. కానీ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో చలికి బదులు ఉక్కపోత ఉంటోంది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది.
సగటున 3 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మేర అధికంగా నమోదవుతుండడం గమనార్హం. రాష్ట్రంలోని వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఈ పరిస్థితి కొనసాగుతోందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వచ్చే మూడురోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అంతటా అధికమే...
రాష్ట్రంలో అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఐఎండీ అధికారుల గణాంకాల ప్రకారం అదిలాబాద్‌లో సాధారణం కంటే 9.1 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైంది. ఈ సమయంలో 10 డిగ్రీల నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 19 డిగ్రీలు నమోదవుతోంది. నిజామాబాద్‌లో సాధారణం కంటే 5.7 డిగ్రీ సెల్సియస్, రామగుండంలో 5.5 డిగ్రీ, భద్రాచలంలో 4.3 డిగ్రీ, మెదక్‌లో 3.8 డిగ్రీ, హైదరాబాద్‌లో 3 డిగ్రీ సెల్సియస్ చొప్పున అధికంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ప్రస్తుత వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో రానున్న మూడు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో రాత్రిపూట చలి ప్రభావం పెరిగే అవకాశం ఉంది. గురువారం ఖమ్మంలో 31 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 18 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment