చలికి దుప్పటి కప్పేద్దాం! | cold blanket! | Sakshi
Sakshi News home page

చలికి దుప్పటి కప్పేద్దాం!

Published Thu, Nov 19 2015 10:35 PM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

చలికి దుప్పటి కప్పేద్దాం!

చలికి దుప్పటి కప్పేద్దాం!

చలి మొదలైంది. వణుకు మొదలైంది. ఇన్నాళ్లూ బీరువాలో అడుగునో, బ్యాగుల్లోనో దాచిన స్వెట్టర్లు మెల్లగా బయటకు
 వస్తున్నాయి. సరికొత్త మోడల్స్‌ను వెతికే నేటితరం కోసం మార్కెట్‌లో ఎన్నో స్వెటర్ వెరైటీలు సందడిచేస్తున్నాయ.
 కలర్స్, కట్స్, కవరింగ్స్.. ఏదైనా సరే స్టైల్‌గా.. వెచ్చగా స్వెటర్‌ని హత్తుకుపొండి. చలికి దుప్పటి కప్పేయండి.

 
మెటీరియల్స్‌లో స్వెటర్స్
 గొర్రె వెంట్రుకలను గ్రేడ్స్‌గా విభజించి స్వెటర్లను తయారుచేస్తారు. గ్రేడ్ రకాలను బట్టి ధర ఉంటుంది. కాశ్మీర్ స్వెటర్ల ప్రపంచంలోనే మంచి నాణ్యమైనవిగా పేరుంది. అల్పాకా స్వెటర్స్‌ను ఫైబర్‌తో తయారుచేస్తారు. వీటి ఉత్పత్తిలో వందేళ్లుగా దక్షిణ అమెరికా ప్రసిద్ధిగాంచింది.  చలికి వెచ్చదనాన్ని ఇవ్వడంలోనూ, కాశ్మీర్ ఊలు అంత మెత్తగా ఈ ఫైబర్ ఊలు ఉంటుంది. దీంతో గ్లౌజ్‌లు, హ్యాట్‌లు కూడా తయారుచేస్తారు.  కాటన్, పాలియస్టర్ మెటీరియల్‌తో స్వెటర్లు తయారుచేస్తారు. ఇవి చలిని కొంతవరకు మాత్రమే ఆపగలవు. కాటన్ నాణ్యతను బట్టి ఇవి చలిని ఆపగలవు.  పాలియస్టర్, కాటన్‌ల కలయికతో స్వెటర్లను తయారుచేస్తారు. వీటిని రెగ్యులర్ వేర్‌గానూ ధరించవచ్చు. ఫైబర్ కూడా ఇందులో కలిసి ఉంటుంది.

పరిమాణం
చాలా వరకు వదులుగా, ఒంటిమీద పడిపోతున్నట్టుగా ఉంటుంటాయి స్వెటర్లు. అలా అయితే చూడ్డానికి బాగుండదు. ఛాతీ పరిమాణం, పొడవు, చేతుల పొడవు..ఇలా శరీర కొలతల ప్రకారం ఎంపిక చేసుకోవాలి.
 
నెక్ స్టైల్స్ ముఖ్యం
 క్రో నెక్: చాలా వరకు సాధారణంగా అందరూ ఉపయోగించే స్వెటర్లకు క్రో(కాకి) నెక్ ఉంటుంది. దీంట్లో వెడల్పు, మెడకు పట్టేసినట్టు ఉండటం వంటి తేడాలు ఉంటాయి. ఇది చాలా మామూలు స్టైల్. వి-నెక్: ఈ స్టైల్ స్వెటర్ సాధారణం కన్నా భిన్నం. ఇన్నర్ షర్ట్ నెక్ భాగం పైకి కనిపించేలా 2 పీస్ స్టైల్ ఇందులో చూడచ్చు.

టర్టిల్ నెక్
 పొడవు కాలర్ మడ త వేసి ఉంటుంది. ఈ స్టైల్ క్లాసిక్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఫార్మల్ టైప్ స్వెటర్స్ కన్నా ఇది ఇంకాస్త వెచ్చదనాన్ని ఇస్తుంది.
 
రోల్‌నెక్, షావ్ల్ నెక్, నాచ్ నెక్
 అంటూ నెక్ స్టైల్స్‌లో మరికొన్ని ఉన్నాయి. స్వెటర్ నెక్ స్టైలో ఫుల్ జిప్, హాప్ జిప్, అలాగే హాఫ్ బటన్, బటన్ డౌన్ ఉన్నవీ స్టైల్‌లో ముందున్నాయి.

రంగులు ప్రాధాన్యం
 సాధారణంగా స్వెటర్ రంగులలో ముదురు రంగులకే ప్రాధాన్యం ఉంటుంది. వీటిలో నీలం, పచ్చ, పసుపు, ముదురు గోధుమ, బూడిద, తెలుపు, నలుపు రంగువి ఉంటాయి. మీ శరీర రంగును బట్టి ఈ కలర్స్‌ని ఎంచుకోవాలి.
 
 ధర కాదు కీలకం
 ఖరీదు ఎక్కువ పెట్టిన స్వెటర్లే బాగుంటాయిని అనుకోకూడదు. మీరు ఎంచుకున్న స్వెటర్ మీకు సౌకర్యవంతంగా, కంటి రంగులు ఇంపుగా, కనీసం 10 ఏళ్లు వేసుకోదగినదిగా చూసి ఎంపిక చేసుకోవాలి. తక్కువ ధరలోనూ నాణ్యమైన మెటీరియల్స్‌లో స్వెటర్లు అందుబాటులో ఉన్నాయి. మీ ఎంపికే ప్రధానమైనది.
 
 టేక్ కేర్ మెషిన్ వాష్, డ్రై క్లీన్ వద్దు
 ఊలు స్వెటర్‌ను శుభ్రపరచాలంటే డిటర్జెంట్ లిక్విడ్ సోప్‌ను కొద్దిగా నీళ్లలో కలిపి, అందులో నానబెట్టి, మురికిగా ఉన్న చోట రుద్దితే చాలు. ఊలు చాలా మెత్తగా ఉంటుంది, మురికి కూడా త్వరగా వదిలిపోతుంది. బ్రష్, డ్రైక్లీన్, మెషిన్‌వాష్... తో శుభ్రపరిస్తే ఊలు త్వరగా పాడైపోతుంది. అలాగే శుభ్రపరిచిన తర్వాత నీళ్లు పోయేలా గట్టిగా పిండకూడదు. కాసేపు ట్యాప్ మీద అలాగే ఉంచి, నీళ్లన్నీ పోయాక తీసి ఆరే యాలి.

 హ్యాంగ్ చేయవద్దు
 స్వెటర్లను హ్యాంగర్‌కి వేయడం వల్ల భుజాలు, మెడ భాగంలో సాగి ఊలు పలచనవడం,రంధ్రాలు పడటం వంటివి జరుగుతాయి. అందుకని మడచి, షెల్ఫ్‌లో పెట్టేస్తే చాలు. ఆరేసేటప్పుడు కూడా హ్యాంగర్స్ వాడకూడదు.
 
దారాలు ఊడితే...
 ఊలు స్వెటర్ దారాలు వదులై బయటకు రావచ్చు. వాటిని స్వెటర్ లోపలి భాగానికి కలిపి కుట్టువేయడమో, ముడివేయడమో చేయాలి. ఈ జాగ్రత్త వల్ల స్వెటర్ త్వరగా పాడవదు.
 
కొనేటప్పుడు...
చలి నుంచి తట్టుకోవడానికి మాత్రమే స్వెటర్ ఎంపిక అనుకుంటున్నారా.. లేక మీకు అత్యంత ఇష్టమైనదిగా ఉండిపోయేలా ఎంచుకోవాలనుకంటున్నారా.. అనేది ముందు తేల్చుకోవాలి.
  స్వెటర్ కొనుగోలుకు ముందు ఏ మెటీరియల్‌తో తయారుచేసినది, సైజ్, స్టైల్, కలర్, కుట్టు, ధర.. ఇలా వరసగా సరిచూసుకోవాలి.
   - ఎన్.ఆర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement