ఓనర్ ఫ్యామిలీకి చావును చూపించింది!
వాషింగ్టన్: విశ్వాసానికి మారుపేరుగా ఉండే శునకం తన యజమానులకు చుక్కలు చూపించింది. కుక్క దాడికి బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ఘటన గత శుక్రవారం అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. బ్రెండా గుర్రీరో అనే మహిళ స్కార్‌ఫేస్ అనే తన పెంపుడు కుక్కకు స్వెటర్ తొడగాలని చూసింది. క్రిస్మస్ శాంటా డ్రెస్ తరహాలో ఉంటే స్వెటర్ స్కార్‌ఫేస్‌కు తొడగాలని చూడగా.. దానికి ఎందుకో మరి విపరీతమైన కోపం వచ్చింది. ఇంకేం తన యజమాని గుర్రీరోపై దాడికి దిగింది. ఆమె చేసేదేంలేక అరవడం మొదలుపెట్టింది. అరుపులు విన్న ఆమె భర్త ఇస్మాయిల్ కుక్కను అదుపుచేయడానికి చూడగా ఆయనపైనా విరుచుకుపడింది. మొదట్లో వారిని రక్కి భయపెట్టిన స్కార్‌ఫేస్ ఆ తర్వాత కరవడానికి ప్రయత్నించింది.
పేరేంట్స్ ను కాపాడేందుకు యత్నించిన వారి కుమారుడు ఆంటోని హారీస్(22)ను గాయపరిచింది. బతుకు జీవుడా అంటూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. వీరి పరస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 10 మందితో కూడిన బృందం అక్కడికి చేరుకుంది. తుపాకీతో బెదిరించినా కుక్క చెలరేగిపోయిందని ఎడ్డీ డర్కిన్ అనే పోలీసు తెలిపారు. కుక్కను డాగ్స్ వ్యానులో తీసుకెళ్లిపోయారు. గాయపడ్డ ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. స్కార్‌ఫేస్ మెడ, తల భాగంలో రక్తపు మరకలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాము తక్షణం స్పందించకపోతే ఆ ముగ్గురి పరిస్థితి మరింత విషమంగా ఉండేదని పోలీసులు వివరించారు.