ఆమెను కొత్త స్వెటర్‌ కొనుక్కోనిద్దాం.. | Lets buy her a new sweater | Sakshi
Sakshi News home page

ఆమెను కొత్త స్వెటర్‌ కొనుక్కోనిద్దాం..

Published Fri, Nov 12 2021 12:20 AM | Last Updated on Fri, Nov 12 2021 12:20 AM

Lets buy her a new sweater - Sakshi

చలికాలం పిల్లలు నిద్ర లేవరు. వారికి ఆ హక్కు ఉందట. భర్త గారు ‘కాసేపు నిద్రపోనీ’ అంటుంటారు. ఆయనగారిని ఏం అనగలం. కాని స్త్రీలు లేవాల్సిందే. వంట చేయాల్సిందే. అన్నీ సిద్ధం చేయాల్సిందే. వారెప్పుడు రుతువులను ఎంజాయ్‌ చేయాలి? భార్యకు కొత్త స్వెటర్‌ కొనివ్వాలంటే టైమ్‌ ఉండదు.

పోనీ ఆమెను కొనుక్కోనివ్వము. అమ్మకు చెవులకు స్కార్ఫ్‌ ఎప్పుడూ పాతదే. చలికి ఆడవాళ్ల పాదాలకు సాక్సులు అవసరం అని కూడా అనుకోము. ఈ కాలంలో స్త్రీలకు ఏం కావాలో వారిని తెచ్చుకోనివ్వండి. పని ఒత్తిడి తగ్గించండి. టీ తాగుతూ చలిని వారినీ ఆస్వాదించనివ్వండి.

చలికాలం బద్దకం కాలం. వెచ్చగా ముసుగుతన్నమని చెప్పేకాలం. కాని ఆ లగ్జరీ ఇంటి మగవారికి, పిల్లలకి ఉన్నట్టుగా ఆడవారికి ఉండదు. బయట ఎంత చలి ఉన్నా తెల్లారే ఆరుకు వాళ్లు లేవాల్సిందే. బయట ఎంత మంచు కురుస్తున్నా తొంగి చూడక వంట గదిలో దూరాల్సిందే. వరండాలోనో, బాల్కనీలోనో, ముంగిలి లోనో కుర్చీ వేసుకుని కాఫీ తాగుతూ మంచుతో తడిసిన బంతిపూల మొక్కను చూడాలని వారికీ ఉంటుంది. కాని వారికి కాఫీ తెచ్చిచ్చేవారు ఎవరూ ఉండరు. వారి కాఫీ వాళ్లే పెట్టుకోవాలి. చలికాలమైనా హిమ ఉదయమైనా.

ఇంకా ద్వితీయశ్రేణి పౌరులేనా?
చలికాలం వస్తే భర్త బజారు నుంచి వస్తూ వస్తూ రోడ్డు మీద అమ్మే ఒక జర్కిన్‌నో, స్వెటర్‌నో కొనుక్కుంటాడు. బండి నడుపుతాడు కదా మంకీ క్యాప్‌ కొనుక్కుంటాడు. పిల్లలు చలికి ఎక్స్‌పోజ్‌ అయితే ఎలా? వారి కోసం తప్పక స్వెటర్లు కొంటాడు. కాని భార్యకు ఎందుకనో వెంటనే కొనడు. కొనాలన్నా ఉంది కదా అనిపిస్తుంది. ఆమే కొనుక్కుంటుందిలే మన సెలక్షన్‌ నచ్చదు అనుకుంటాడు. ఆమె కొనుక్కునేది లేదు.

ఆమెకు ఆ వీలూ చిక్కదు. చాలా ఇళ్లల్లో స్త్రీలు పాతబడిన స్వెటర్లతోనే తిరుగుతూ ఉంటారు ఈ సీజన్లలో. స్త్రీలకు రకరకాల స్వెటర్లు అమ్ముతారు. హాఫ్‌ స్వెటర్లు ఇంట్లో వేసుకోవచ్చు. ఫుల్‌స్వెటర్లు బయటకు వెళ్లేప్పుడు. కొనే స్తోమత ఉన్నా ‘ఇన్ని ఎందుకు’ అనే ప్రశ్న ఆమెకు ఎదురవుతుంది. స్త్రీలు సౌందర్య ప్రియులు అని తెలుసు. ఈ శీతాకాలం రెండు మూడు నెలలు ఒకే ఒక్క స్వెటర్‌తో వాళ్లు ఎందుకు గడిపేయాలి. అక్కర్లేదు అని వారూ అనుకోరు. ఇంటి మగవారూ చెప్పరు.

అమ్మ సంగతి ఏమిటి?
ఇంట్లో అమ్మ ఉంటే శీతాకాలం ఆమెకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆమెకు బడ్జెట్‌ కేటాయించాలి. ఒక మంచి షాల్‌ కప్పుకుని ఆమె కూచుంటే ఎంత బాగుంటుంది. ఆమెకు నచ్చిన రంగుల్లో రెండు మూడు స్కార్ఫులు ఉంటే ఎంత బాగుంటుంది. నేలకు పాదాలు తాకి జిల్లు మనకుండా ఇంట్లో తిరగడానికి మంచి స్లిప్పర్లు, సాక్సులు ఆమెకు తప్పనిసరి. ఒక కొత్త రగ్గు కొని ఇస్తే ఆ ఉత్సాహమే వేరు.

అమ్మ ఆ ఇంట్లో కొడుకు, కోడలు మీద ఆధారితమైతే ఆమెను చిన్నబుచ్చకుండా ఇవన్నీ లేదా వీటిలో కొన్నయినా ఈ శీతాకాలపు ప్రారంభంలోనే ఆమెకు కొనిస్తే నోరు తెరిచి అడగాల్సిన అవస్థ తప్పుతుంది. ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి. ఆ డబ్బును చాలా ఇళ్లల్లో ఆ అమ్మలు, అత్తలు కొడుకు చేతుల్లోనో కోడలు చేతుల్లోనో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ‘ఈ నెల డబ్బు మీ కోసం మీ చలికాలపు అవసరాల కోసం ఉంచుకోండి’ అని చెప్పలేమా?

వంట బాధ
రోజూ ఉదయాన్నే టిఫిన్‌ చేస్తున్నా ఒక్కపూట బజారు నుంచి తెచ్చుకోండి అంటే ‘బజారు టిఫినా’ అని విసుక్కుని రోజు మూడ్‌ని పాడు చేసే భర్తలు ఉంటారు. రోజూ టిఫిన్‌ చేసే బాధ వేరే ఏ కాలంలో అయినా ఓకే కాని చలికాలం చాలా కష్టం. చలికి పని చేయబుద్ధి కాదు. ఎవరైనా చేసిపెడితే బాగుండు అని భర్తలకు సదా అనిపించినట్టే భార్యలకు అప్పుడప్పుడైనా అనిపిస్తుంది.

భోజనం తిప్పలు ఎలాగూ తప్పవు కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో ఎలా ఆ శ్రమ కాస్తంత తగ్గించవచ్చో ప్రతి ఇంటి పురుషులు, పిల్లలు ఆలోచించాలి. ప్రత్యామ్నాయ టిఫిన్లు, ఇన్‌స్టంట్‌ టిఫిన్లు, ఆమె చేయకపోయినా మనం చేసుకు తినగలిగే అల్పాహారాలు ఎన్నో మార్కెట్‌లో ఉన్నాయి. యూట్యూబ్‌లో కొడితే వందలాది వీడియోలు ఉన్నాయి. మనం ఇల్లు కదలకపోయినా తెచ్చిపెట్టే స్విగ్గి, జొమాటోలు ఉన్నాయి. వారంలో ఒకటి రెండు రోజులైనా ఈ శీతాకాలంలో ఉదయపు వంట చెర నుంచి ఆమెను విముక్తి చేస్తే ఆమెకు కలిగే సంతోషం ఆలోచించారా ఎవరైనా?

ఆమె సౌందర్యం
అవును. చక్కగా ఉండే హక్కు, సౌందర్యాన్ని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మగవాళ్లు దీనిని లెక్క చేయొచ్చు చేయకపోవచ్చు. కాని శీతాకాలంలో స్త్రీలు తమ శరీరం గురించి ఆలోచన చేస్తారు. చర్మాన్ని, శిరోజాల్ని కాపాడుకోవడానికి వారికి కొన్ని వస్తువులు అవసరం. క్రీములు, నూనెలు, సబ్బులు... అదనపు ఖర్చే. ఆ ఖర్చు వారు సంపాదించే దాని నుంచైనా భర్త సంపాదన నుంచైనా చేసే వాతావరణం ఇంట్లో ఉండాలి.

చర్మ సమస్యలు కొందరిలో రావచ్చు. వాటిని చిట్కాలతో సరిపుచ్చుతూ బాధపడాల్సిన పని లేదు. వైద్యుల దగ్గరకు వెళ్లాలి. ఇక ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి చలికాలం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని రోజువారీ చాకిరీ నుంచి దాదాపుగా తప్పించాలి. ఈ కాలంలో జలుబు, త్రోట్‌ ఇన్ఫెక్షన్లు సహజం. వాటి నుంచి కాపాడేలా ఆమెను వెచ్చని వాతావరణంలో విశ్రాంతంగా ఉంచడం కోసం ఏం చేయొచ్చో ఆలోచించాలి.

నిజానికి ఇవన్నీ రాసి చెప్పాలా అనిపించవచ్చు.  రాసి చెప్తే కాని స్త్రీలకు ఎంత పని ఉందో దాని నుంచి ఎలా తప్పించవచ్చో తెలియనంతగా ఆ పని స్త్రీల నెత్తి మీద ఉంది. చలికాలం వారికి పని తేలిక చేద్దాం. చలికాలాన్ని ఎంజాయ్‌ చేసేలా చూద్దాం.  హ్యాపీ వింటర్‌.
 
నిజానికి ఇవన్నీ రాసి చెప్పాలా అనిపించవచ్చు. రాసి చెప్తే కాని స్త్రీలకు ఎంత పని ఉందో దాని నుంచి ఎలా తప్పించవచ్చో తెలియనంతగా ఆ పని స్త్రీల నెత్తి మీద ఉంది. చలికాలం వారికి పని తేలిక చేద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement