శిరోజాలతో స్వెట్టర్..
భర్త కోసం స్వెట్టర్లు అల్లేవారెందరో.. కానీ చైనాలోని చాంగ్‌క్వింగ్‌కు చెందిన జియాంగ్ రెంక్సియాన్(60) అనే రిటైర్డ్ ఉపాధ్యాయిని మాత్రం భర్త కోసం తన శిరోజాలతో స్వెట్టర్‌ను అల్లింది! దానికి మ్యాచింగ్ టోపీ కూడా తయారుచేసింది. అదీ 11 ఏళ్లు కష్టపడి.. జియాంగ్‌కు 34 ఏళ్ల వయసప్పుడు ఈ ఆలోచన వచ్చిందట.
‘కాలేజీ రోజుల్లో అందరూ నా శిరోజాల గురించే మాట్లాడుకునేవారు. అయితే వయసు పెరిగే కొద్దీ.. నా ముఖంతోపాటు శిరోజాల కాంతి కూడా తగ్గడం మొదలైంది. అవి రాలిపోవడం మొదలుపెట్టాయి. అందుకే వాటితో నా భర్త కోసం ఏదైనా చేయాలని ఆలోచించాను.రోజు దువ్వుకున్న అనంతరం దానికి చిక్కుకునే శిరోజాలను దాచి ఉంచడం మొదలుపెట్టాను’ అని ఆమె చెప్పుకొచ్చింది.
అలా మొత్తం 1,16,058 శిరోజాలతో భర్తకు స్వెట్టర్ , క్యాప్ అల్లింది. 2003 మొదట్లో మొదలుపెట్టిన ఆ పని ఈ మధ్యే పూర్తయింది. స్వెట్టర్ బరువు 382.3 గ్రాములుండగా.. క్యాప్ బరువు 119.5 గ్రాములుంది. రేపొద్దున్న తన శిరోజాలు పూర్తిగా పాడైపోయినా.. ఈ స్వెట్టర్ తన యవ్వనాన్ని, భర్తతో తాను గడిపిన మధుర స్మృతులను గుర్తుకు తెస్తునే ఉంటుందని జియాంగ్ అంటోంది. భవిష్యత్తులోనూ శిరోజాలతో భర్త కోసం ఏదో ఒకటి తయారుచేస్తానని.. అదేమిటన్నది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పింది.