ప్రాంతీయ భాషలకు పెద్దపీట | Use of Indian Languages Encouraged in New National Education Policy | Sakshi
Sakshi News home page

ప్రాంతీయ భాషలకు పెద్దపీట

Published Thu, Mar 4 2021 3:14 AM | Last Updated on Thu, Mar 4 2021 7:32 AM

Use of Indian Languages Encouraged in New National Education Policy - Sakshi

న్యూఢిల్లీ:  ప్రాంతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించేలా నూతన జాతీయ విద్యా విధానాన్ని(ఎన్‌ఈపీ) తీసుకొచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యా వ్యవస్థలో భాషాపరమైన అవరోధాలను తొలగించడానికి ‘మిషన్‌ మోడ్‌’లో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు, పేదలకు తగిన అవకాశాలు దక్కుతాయని, వారి జీవితాలు మెరుగవుతాయని తెలిపారు.

విద్యా రంగం కోసం కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనల సమర్థ అమలుపై బుధవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలో, ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ విషయాలను(కంటెంట్‌) ప్రాంతీయ భాషల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత భాషా నిపుణులపై ఉందన్నారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో ఇది సాధ్యమేనని సూచించారు. జ్ఞానానికి, పరిశోధనలకు పరిమితులు విధించుకోవడం అంటే దేశానికి పెద్ద అన్యాయం చేసినట్లేనని తేల్చిచెప్పారు. అంతరిక్షం, అణుశక్తి, డీఆర్‌డీఓ, వ్యవసాయం తదితర కీలక రంగాల్లో ప్రతిభావంతులైన మన యువతకు తలుపులు తెరిచి ఉన్నాయని ప్రధానమంత్రి వివరించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..

ప్రపంచ దేశాల సరసన భారత్‌  
‘‘కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్యం తర్వాత విద్యా, నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలపైనే ఎక్కువ దృష్టి పెట్టాం. ఉపాధి, వ్యాపార సామర్థ్యాన్ని విద్యతో అనుసంధానించడమే లక్ష్యంగా మేము సాగిస్తున్న ప్రయత్నాలకు ఈ బడ్జెట్‌ మరింత ఊతం ఇస్తుంది. మా ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వైజ్ఞానిక ప్రచురణలు, పీహెచ్‌డీ స్కాలర్లు, స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌లో ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లో భారత్‌ స్థానం సంపాదించింది. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీలో ప్రపంచంలోని మొదటి 50 దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరింది. తన స్థానాన్ని క్రమంగా మెరుగుపర్చుకుంటోంది.

ఇక మన ఇంధనం హైడ్రోజన్‌
భారత్‌ స్వావలంబన సాధించిన దేశంగా మారాలంటే యువతకు తమపట్ల తమకు విశ్వాసం ఉండాలి. అది జరగాలంటే వారు ఆర్జించిన విద్య, విజ్ఞానం పట్ల పూర్తి నమ్మకం పెంచుకోవాలి. విద్యా వ్యవస్థలో ప్రాంతీయ భాషలకు చాలా ప్రాధాన్యం ఉంది. సబ్జెక్టును అర్థం చేసుకోవడంలో భాష ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య దాకా అత్యత్తమ కంటెంట్‌ను మన ప్రాంతీయ భాషల్లో తీసుకురావాలి. మెడికల్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌.. అన్ని సబ్జెక్టుల్లో ప్రపంచ స్థాయి కంటెంట్‌ ప్రాంతీయ భాషల్లో రావాలి. కేవలం భాష అన్న ఒక్క అవరోధం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని నైపుణ్యాలను వృథా కానివ్వొద్దు. దేశ అభివృద్ధి ప్రయాణంలో పల్లె ప్రజలను, పేద వర్గాలను సైతం కలుపుకొని వెళ్లాలి.

ప్రి–నర్సరీ నుంచి పీహెచ్‌డీ స్థాయి దాకా జాతీయ విద్యా విధానంలోని అన్ని ప్రతిపాదనలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో మన విద్యార్థులకు, యువ సైంటిస్టులకు కొత్త అవకాశాలు నానాటికీ పెరుగుతున్నాయి. పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు, ఉన్నత విద్యా సంస్థల్లో అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. నేషనల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ మిషన్‌ కింద ఐఐటీ–వారణాసి, ఐఐటీ–ఖరగ్‌పూర్, ఐఐఎస్‌ఈఆర్‌–పుణేలో పరంశివాయ్, పరంశక్తి, పరబ్రహ్మ అనే మూడు సూపర్‌ కంప్యూటర్లు ఏర్పాటు చేశాం. మరో 12 సంస్థల్లో సూపర్‌ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రతిపాదన ఉంది. దీనికి రూ.50 వేల కోట్లు కేటాయించాం. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంది. ఇందులో భాగంగానే బడ్జెట్‌లో హైడ్రోజన్‌ మిషన్‌ను ప్రకటించాం. హైడ్రోజన్‌ వాహనాన్ని ఇప్పటికే పరీక్షించాం. రవాణా రంగంలో ఇంధనంగా హైడ్రోజన్‌ను ఉపయోగించడంపై దృష్టి పెట్టాలి’’ అని ప్రధాని మోదీ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement