గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకున్నారు. అఖిల భారత ఉపాధ్యాయుల సదస్సులో ప్రధాని మాట్లాడుతూ కొత్త జాతీయ విద్యా విధానంతో (ఎన్‌ఈపీ) బోధనలో సమూల మార్పులు వస్తాయని చెప్పారు. ఒకప్పుడు విద్యార్థులు పుస్తకాలు చూసీ బట్టీ పట్టడమే ఉండేదని కానీ ఈ కొత్త విద్యావిధానం ప్రాక్టికల్ లెర్నింగ్‌పై దృష్టి పెట్టిందని అన్నారు. దీనిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు.
ప్రాథమిక విద్య విద్యార్థులకు వారి వారి మాతృభాషలోనే ఉండాలని అప్పుడే విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలు వెలికి వస్తాయని చెప్పారు. మన దేశంలో ఆంగ్ల భాషలో బోధనకే అధిక ప్రాధాన్యం ఉందని ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించడానికి ఇష్టపడుతున్నారని ప్రధాని చెప్పారు. దీని వల్ల గ్రామాల్లోని ప్రతిభ ఉన్న ఉపాధ్యాయులు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారికి సరైన అవకాశాలు రావడం లేదన్నారు. ఎన్‌ఈపీతో ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని ప్రధాని మోదీ వివరించారు.
ప్రభుత్వ పథకాల్లో వివక్షకు తావు లేదు
గాంధీనగర్‌లో మహాత్మా మందిర్ ప్రారంభోత్సవంతో పాటు రూ.4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకి ప్రధాని శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభు త్వ పథకాల్లో కుల, మత వివక్షకు తావు లేదని అర్హులైన అందరికీ అవి చేరుతున్నాయని చెప్పారు. నిజమైన లౌకికవాదం ఉన్న చోట వివక్ష కనిపించదని అన్నారు. అందరూ సంతోషంగా ఉండడానికి కృషి చేయడం కంటే మించిన సామాజిక న్యాయం మరోటి లేదని అభిప్రాయపడ్డారు. 70% మంది మహిళల సాధికారతకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ఒక పనిముట్టులా నిలిచిందని ప్రభుత్వ పథకాలన్నీ నూటికి నూరు శాతం లబ్ధి దారులకు చేరేలా చర్యలు చేపట్టామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment