జేఈఈలో ప్రాంతీయ భాషలకు పెరుగుతున్న ఆదరణ | JEE Main in 11 Languages, Including Telugu, Hindi, Bengali, Marathi, Urdu | Sakshi
Sakshi News home page

జేఈఈలో ప్రాంతీయ భాషలకు పెరుగుతున్న ఆదరణ

Published Mon, Jan 2 2023 2:56 PM | Last Updated on Mon, Jan 2 2023 2:56 PM

JEE Main in 11 Languages, Including Telugu, Hindi, Bengali, Marathi, Urdu - Sakshi

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ)లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలకు ఆదరణ పెరుగుతోంది. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఆధ్వర్యంలో జేఈఈని తొలుత ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహించేవారు. 2016లో గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో కూడా ప్రారంభించారు. ఆ తరువాతి ఏడాది మరాఠీ, ఉర్దూను ఉపసంహరించారు. 

2020లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి జేఈఈ పరీక్ష బాధ్యతలను చేపట్టాక ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో నిర్వహించారు. ఇతర భాషలకు ప్రాధాన్యమివ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో పాటు జాతీయ నూతన విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు ప్రాధా­న్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ తరువాత నుంచి ఇంగ్లిష్, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తోంది. 2021లో  నాలుగు దఫాలుగా నిర్వహించిన జేఈఈ మెయిన్‌కు 9.39 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో 1,49,621 మంది ప్రాంతీయ భాషలను ఎంచుకున్నారు. బెంగాలీలో 24,841 మంది, గుజరాతీలో 44,094 మంది, హిందీలో 76,459 మంది దరఖాస్తు చేయగా తెలుగులో 371, తమిళం 1264, కన్నడ 234, మలయాళం 398, మరాఠీ 658, ఒడియా 471, పంజాబీ 107, ఉర్దూ 24, అస్సామీ 700 మంది ఉన్నారు. నాలుగు దఫాలకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య ఇది. 

మొత్తం దరఖాస్తుదారుల సంఖ్య (యూనిక్‌ సంఖ్య)ప్రకారం చూస్తే 70 వేలు. వీరిలో ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసిన వారు 45 వేలు. 2022లో జేఈఈకి మొత్తం 10.26 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో  ప్రాంతీయ భాషల్లో రాసేందుకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య 80 వేలకు పైగా ఉంది. వీరిలో 50 వేల మంది వరకు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాశారు. బెంగాలీ, గుజరాతీ, హిందీ భాషల్లోనే ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు. 2022లో తెలుగులో పరీక్ష రాసిన వారి సంఖ్య 1,200 వరకు పెరిగింది. 2023లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే వారి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ఆయా భాషల్లో ప్రశ్నపత్రాల్లో సందేహాలు ఉంటే ఆంగ్ల ప్రశ్న పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవలసి ఉంటుంది. (క్లిక్‌ చేయండి: అనకాపల్లిలో ఎంఎస్‌ఎంఈ పార్కు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement