
న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నుంచి సర్వోన్నత న్యాయస్థానం పౌరులకు కొత్త వెసులుబాటు కల్పించనుంది. షెడ్యూల్డ్ భాషల్లోనూ న్యాయస్థానం తీర్పులను వెలువరిస్తామని బుధవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్(ఈ–ఎస్‌సీఆర్) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచుతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చబడిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, ఉర్దూ, బోడో, సంథాలీ, మైథిలీ, డోగ్రీ భాషల్లో తీర్పులను ప్రజలు ఉచితంగా పొందొచ్చు. ‘ ఈ–ఎస్‌సీఆర్ ప్రాజెక్ట్ ద్వారా 34,000 తీర్పులు పొందొచ్చు. వాటిలో ఇప్పటికే 1,268 తీర్పులు ప్రాంతీయ భాషల్లోనూ ఉన్నాయి. తీర్పుల్లో 1091 హిందీలో, 21 ఒడియాలో, 14 మరాఠీ, 4 అస్సామీ, ఒకటి గారో, 17 కన్నడ, ఒకటి ఖాసీ, 29 మలయాళం, 3 నేపాలీ, 4 పంజాబీ, 52 తమిళం, 28 తెలుగు, 3 ఉర్దూ భాషల్లో ఉన్నాయి.‘ గురువారం నుంచి 13 భాషల్లో 1,268 తీర్పులు సుప్రీంకోర్టు వెబ్‌సైట్, మొబైల్ యాప్, నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ వెబ్‌సైట్‌లో జనవరి 26వ తేదీ నుంచి అందుబాటులో వస్తాయి. ఈ ఏడాది జనవరి ఒకటోతేదీదాకా వెలువరిచిన తీర్పులను న్యాయవాదులు, లా విద్యార్థులు, సాధారణ జనం అందరూ వీటిల్లో ఉచితంగా చూసుకోవచ్చు’ అని సీజే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment