judgements
-
2023 Roundup: సుప్రీంకోర్టు వెలువరించిన టాప్-10 జడ్జ్మెంట్స్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఈ ఏడాది కీలక తీర్పులు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు, డిమానిటైజేషన్ వంటి పాలసీ నిర్ణయాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు.. మోదీసర్కార్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చాయి. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్ 10 జడ్జ్మెంట్స్ ఒకసారి చూద్దాం.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దుపై.. 2023 డిసెంబర్ 11న కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చింది. ఇది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, శాశ్వతం కాదని స్పష్టంచేసింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వ వాదనలతో పూర్తిస్థాయిలో ఏకీభవించింది సీజేఐ జస్టిస్ డీవై.చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాదాపు 23 పిటిషన్లపై 16 రోజులపాటు ఇరుపక్షాల వాదనలు వినిపించాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. ఆర్థికశాఖలో చేపట్టిన అతిపెద్ద సంస్కరణ డీమోనిటైజేషన్. 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేస్తూ 2016 నవంబర్ 8న సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోదీ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై.. ఏడేళ్ల తర్వాత 2023లో తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. పెద్ద నోట్ల రద్దును సమర్థించింది. ఈ మేరకు 4-1 తేడాతో మెజార్టీ తీర్పు ఇచ్చింది రాజ్యాంగ ధర్మాసనం. జస్టిస్ BV నాగరత్న ఒక్కరే ప్రభుత్వ నిర్ణయంతో వ్యతిరేకించారు. ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో.. కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుందని స్పష్టంచేసింది. 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించగా.. ఎన్నికల కమిషనర్ల అప్పాయింట్మెంట్స్కు సంబంధించిన సవరణ బిల్లును.. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు తెచ్చింది కేంద్రప్రభుత్వం. ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, విపక్ష నేతతో కూడిన ప్యానెల్.. సీఈసీ, ఈసీలను ఎంపికే చేసేలా 1991 నాటి చట్టానికి కీలక సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో.. తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రిపోర్ట్ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు చేపట్టాలనడం సరికాదని వ్యాఖ్యానించింది. హిండెన్‌బర్గ్ నివేదికతోపాటు ఆధారాలేమైనా ఉన్నాయా అని పిటిషనర్లను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. షార్ట్ సెల్లింగ్ కారణంగా మార్కెట్లు ఇబ్బందులు పడకుండా ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని సెబీకి ఆదేశాలు జారీచేసింది. విద్వేషపూరిత ప్రసంగాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది సుప్రీంకోర్టు. దీనిని తీవ్రమైన నేరంగా పేర్కొంది.విద్వేష ప్రసంగాల కారణంగా దేశ లౌకికవాదం ప్రభావితం అవుతుందని.. శాంతిభద్రతల సమస్యలు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తంచేసింది. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా..విద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయాలంటూ సంచలనఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. వివాహ వ్యవస్థ, విడాకుల మంజూరుకు సంబంధించి ఈ ఏడాది కీలక ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. పరస్పర అంగీకారం ఉన్న డివోర్స్ కేసుల్లో ఆరు నెలల కంపల్సరీ గడువు అవసరం లేదని పేర్కొంది. ఇరుపక్షాలు ఆసక్తి చూపితే.. 6 నెలల సమయం వద్దని.. విడాకులు వెంటనే జారీచేయాలని సూచించింది సుప్రీంకోర్టు. విడాకుల మంజూరుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. స్వలింగ సంపర్కలు వివాహానికి చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై 2023 అక్టోబర్‌లో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. LGBTQ+ కమ్యూనిటీ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. 21 పిటిషన్లను విచారించిన సీజేఐ జస్టిస్ DY.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. 3-2 తేడాతో తీర్పు ఇచ్చింది. స్వలింగ వివాహం చట్టం చేసే హక్కు కేవలం పార్లమెంట్‌కే ఉందని స్పష్టం చేసింది. జల్లికట్టు, కంబల. ఎద్దులబండి పందాల వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోవలేమని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. 2023 మేలో ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటకలో కంబల, మహారాష్ట్రలో ఎద్దుల బండి పోటీలను అనుమతిస్తూ.. ఆయా రాష్ట్రప్రభుత్వాలు చేసిన చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్ల దాఖలయ్యాయి. వీటిని విచారించింది సర్వోన్నత న్యాయస్థానం. సంప్రదాయ క్రీడలు మన సంస్కృతిలో భాగమని.. వాటికి అటంకం కలిగించలేమని తేల్చిచెప్పింది. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్ జడ్జ్మెంట్స్ ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చిన సుప్రీంకోర్టు డీమోనిటైజేషన్‌పై ఏడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం సీఈసీ, ఈసీల నియామకానికి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ సీజేఐ స్థానంలో కేబినెట్ మంత్రిని చేర్చిన కేంద్రప్రభుత్వం విదేశీ రిపోర్ట్ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు సరికాదన్న సుప్రీం విద్వేషపూరిత ప్రసంగాలను తీవ్రమైన నేరంగా పేర్కొన్న సుప్రీంకోర్టు విద్వేష ప్రసంగాలపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇరుపక్షాలు ఆసక్తి చూపితే.. వెంటనే విడాకులు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీం నిరాకరణ 3-2 తేడాతో తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనం జల్లికట్టు వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోలేమని స్పష్టంచేసిన సుప్రీంకోర్టు -
కోర్టు తీర్పులపై బాబు, ఎల్లో బ్యాచ్ వక్రభాష్యాలు.. సమాధానం ఇదే..
సాక్షి, ఢిల్లీ: దేశంలో కోర్టులపై వస్తోన్న విమర్శల సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో కోర్టు తీర్పులపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సూటిగా, స్పష్టంగా సమాధానాలిచ్చారు. దీంతో, కోర్టు తీర్పులపై అందరికీ క్లారిటీ ఇచ్చారు. ప్రశ్న: కోర్టుల స్వతంత్రత గురించి మీరేమంటారు?. సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిగా భారతీయ కోర్టులు ఎంత స్వతంత్రంగా పని చేస్తున్నాయి?. ఒక తీర్పు ఇచ్చే సమయంలో మీపై ఏమైనా ఒత్తిడులుంటాయా?. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్: ఒక జడ్జిగా నాకు 23ఏళ్లుగా అనుభవం ఉంది. అత్యంత సుదీర్ఘ సమయం జడ్జిలుగా ఉన్నవారిలో నేనొకరిని. ఈ విషయంలో నేను దేశానికి స్పష్టంగా ఒక విషయం చెబుతున్నాను. మాపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఈ కేసులో ఇలా ఉండండి, ఇలా తీర్పు చెప్పండి అని ఏ ఒక్కరు మాపై ఒత్తిడి తీసుకురారు, తీసుకురాలేదు. ఈ విషయంలో జడ్జిలందరూ ఒక స్పష్టమైన సూత్రాన్ని నమ్ముతాం. కొన్ని కచ్చితమైన నియమ, నిబంధనలను పాటిస్తాం. - ప్రతీ రోజూ సుప్రీంకోర్టులో ఉదయాన్నే బెంచ్ మీదకు వెళ్లకముందు జడ్జిలందరూ కలిసి కాఫీ తాగుతాం. కానీ, ఏ ఒక్కరు ఇంకొకరి కేసు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించబోం. - ఇక హైకోర్టులోనయితే ఈ సున్నితమైన పరిస్థితి మరింత ఎక్కువ. కొన్ని సార్లు సింగిల్ బెంచ్‌లో జడ్జి ఇచ్చిన తీర్పును అదే హైకోర్టులోని మరో ఇద్దరు జడ్జిలు సమీక్షించాల్సి ఉంటుంది. ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోరు. - ఎవరి కేసునయితే నేను సమీక్షించబోతున్నానో.. అదే జడ్జితో కలిసి భోజనం చేయవలిసిన పరిస్థితి ఉంటుంది. భోజనం షేర్ చేసుకుంటాం. అయితే కేసులను మాత్రం షేర్ చేసుకోం. అది మేం తీసుకున్న శిక్షణలో భాగం. అంతెందుకు మాపై ప్రభుత్వంలో ఉన్న ఏ వ్యవస్థ నుంచి ఒత్తిడి రాదు. ఇది నా ఒక్కరి గురించి చెప్పడం లేదు. మొత్తం దేశంలోని న్యాయవ్యవస్థ గురించి చెబుతున్నాను. - ఒత్తిడి ఉంటుంది. అదేలా అంటే.. అత్యుత్తమమైన న్యాయాన్ని అందించాలన్న ఒత్తిడి ఉంటుంది. మనసు మీద, ఆలోచన మీద ఒత్తిడి ఉంటుంది. మేం నేర్చుకున్న విషయం మీద, మా పరిజ్ఞానం మీద ఒత్తిడి ఉంటుంది. కచ్చితమైన పరిష్కారం కోసం అన్వేషిస్తున్నప్పుడు కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. - సుప్రీంకోర్టునే తీసుకోండి. దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానం ముందుకు వచ్చే కేసుల్లో.. చాలా భిన్నమైన కోణాలుంటాయి. 1+1=2 అని చెప్పలేం. మేం ఇచ్చే తీర్పులు ఇవ్వాళ ఒక్క కేసు గురించి కాదు.. భవిష్యత్తులో న్యాయవ్యవస్థ ప్రమాణాల మీద ఆధారపడాలి. ఈ సమాజం భవిష్యత్తులో ఎలా ఉండాలన్నదానికి సుప్రీంకోర్టు తీర్పులు అద్దం పట్టాలి. తీర్పులు ఇచ్చే విషయంలో సమాజం ఎలా స్వీకరిస్తుందన్నదానిపై జడ్జిలకు ఆత్మసమీక్ష ఉండాలి. అది ఒత్తిడి అని చెప్పలేను. అది సత్యాన్వేషణ. అదే నిజమైన పరిష్కారం అని సమాధానమిచ్చారు. -
ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు..
న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నుంచి సర్వోన్నత న్యాయస్థానం పౌరులకు కొత్త వెసులుబాటు కల్పించనుంది. షెడ్యూల్డ్ భాషల్లోనూ న్యాయస్థానం తీర్పులను వెలువరిస్తామని బుధవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్(ఈ–ఎస్సీఆర్) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచుతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చబడిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, ఉర్దూ, బోడో, సంథాలీ, మైథిలీ, డోగ్రీ భాషల్లో తీర్పులను ప్రజలు ఉచితంగా పొందొచ్చు. ‘ ఈ–ఎస్సీఆర్ ప్రాజెక్ట్ ద్వారా 34,000 తీర్పులు పొందొచ్చు. వాటిలో ఇప్పటికే 1,268 తీర్పులు ప్రాంతీయ భాషల్లోనూ ఉన్నాయి. తీర్పుల్లో 1091 హిందీలో, 21 ఒడియాలో, 14 మరాఠీ, 4 అస్సామీ, ఒకటి గారో, 17 కన్నడ, ఒకటి ఖాసీ, 29 మలయాళం, 3 నేపాలీ, 4 పంజాబీ, 52 తమిళం, 28 తెలుగు, 3 ఉర్దూ భాషల్లో ఉన్నాయి.‘ గురువారం నుంచి 13 భాషల్లో 1,268 తీర్పులు సుప్రీంకోర్టు వెబ్సైట్, మొబైల్ యాప్, నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ వెబ్సైట్లో జనవరి 26వ తేదీ నుంచి అందుబాటులో వస్తాయి. ఈ ఏడాది జనవరి ఒకటోతేదీదాకా వెలువరిచిన తీర్పులను న్యాయవాదులు, లా విద్యార్థులు, సాధారణ జనం అందరూ వీటిల్లో ఉచితంగా చూసుకోవచ్చు’ అని సీజే చెప్పారు. -
న్యాయాన్యాయాల విచికిత్స
న్యాయాన్యాయాలను నిర్ధారించే వేదిక ఎప్పుడూ బాధితుల పక్షం ఉంటుందనీ, ఉండాలనీ అందరూ నమ్ముతారు. కానీ అక్కడ అందుకు విరుద్ధమైన పోకడలకు పోతుంటే ఏం చేయాలి? బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ పుష్ప వీరేంద్ర గనేడివాలా ఇటీవల వరసబెట్టి ఇస్తున్న తీర్పులు ఈ ప్రశ్న రేకెత్తిస్తున్నాయి. అదృష్టవశాత్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పుల అసమంజసత్వాన్ని సకాలంలో గుర్తించి వాటి అమలును నిలిపేస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం అదనపు న్యాయమూర్తిగా వున్న ఆమెకు శాశ్వత న్యాయమూర్తి హోదా ఇవ్వాలని గతంలో చేసిన సిఫా ర్సును సుప్రీంకోర్టు కొలీజియం ఉపసంహరించుకుంది. ఆ వివాదాస్పద తీర్పులు, దానిపై సుప్రీం కోర్టు స్పందన, కొలీజియం నిర్ణయం వంటివన్నీ గత నెలలో జరిగాయి. కానీ ఆమె వెలువరించిన తాజా తీర్పు సైతం ఆ తరహాలోనే వుండటం అందరినీ మరింత ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇవన్నీ బాలబాలికలపట్ల అమలవుతున్న లైంగిక నేరాలను అరికట్టి, వారికి చట్టపరమైన రక్షణ కల్పించడా నికి తీసుకొచ్చిన కఠినమైన పోక్సో చట్టం కింద నమోదైన కేసులు. కానీ జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పులు దాని మౌలిక ఉద్దేశాన్ని దెబ్బతీశాయి. వివాదాస్పదమైన ఈ తీర్పుల్ని స్థూలంగా పరిశీలిస్తే అవి ఎంత అన్యాయంగా వున్నాయో అర్ధమవుతుంది. మొదటి కేసులో అయిదేళ్ల బాలికపై లైంగిక దాడి చేయ డానికి నిందితుడు ప్రయత్నించాడు. ఆమె ఎదురుగానే తన ప్యాంట్స్ జిప్ తీసేందుకు ప్రయత్నించాడు. దీన్ని లైంగిక దాడిగా పరిగణించాల్సిన అవసరం లేదంటూ అతనికి విధించిన మూడేళ్ల జైలు శిక్షను తగ్గించి, ఐపీసీ సెక్షన్ 354కింద ఏడాది జైలు శిక్ష వేశారు. మరో కేసులో బాలిక ఛాతిని మరో నిందితుడు అదిమాడు. ఆమె ఒంటిపై దుస్తులుండగా ఆ పనికి పాల్పడ్డాడని, ఇందులో ‘చర్మం– చర్మం(స్కిన్ టు స్కిన్) రాసుకున్న’ వైనం లేదు గనుక ఇక్కడ నేరమేమీ జరగలేదని తేల్చారు. నిందితుడిని విడుదల చేయాలని ఆదేశించారు. ఇంకో కేసులో కూడా అంతే. ఆ కేసులో బాలికపై అత్యాచారం జరిగింది. అయితే ఆమె సాక్ష్యం విశ్వసించదగ్గదిగా లేదని అభిప్రాయపడుతూ, ఇలాంటి అప్రామాణిక సాక్ష్యాల ఆధారంగా నిందితులను శిక్షిస్తే వారికి అన్యాయం చేసినట్టవు తుందని చెప్పారు. మరో లైంగిక దాడి కేసులోనూ ఆమె నిర్ణయం వింతగా వుంది. ఆ సమయంలో బాలిక ప్రతిఘటించిన దాఖలా కనబడలేదని తెలిపారు. నేరగాడు తన దుస్తులు తొలగించుకుంటూ ఆమె దుస్తులు కూడా తీసి అత్యాచారం చేశాడంటే నమ్మశక్యంగా లేదని, ఇది పరస్పరం అంగీకారం వున్న కేసుగా భావించవచ్చునని తేల్చారు. తాజా కేసులో నేరగాడి అత్యాచారం కారణంగానే బాలిక గర్భవతి అయిందనటానికి ఆధారం లేదని, పోలీసులు డీఎన్ఏ నివేదిక జతపర్చలేదని చెప్పారు. ఈ కేసులన్నిటా ఆమె నిందితుల ఉద్దేశాలనుగానీ, బాధితుల నిస్సహాయతనుగానీ పరిగణన లోకి తీసుకోకుండా సాంకేతిక అంశాలు చూసి తనకు తోచిన తీర్పులిచ్చారని స్పష్టంగా వెల్లడవు తోంది. ప్రపంచ దేశాలన్నిటితో పోలిస్తే భారత్‌లోనే బాలబాలికలపై లైంగిక నేరాలు అత్యధికమని చాన్నాళ్లక్రితం యునిసెఫ్ తెలిపింది. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో నివేదిక ప్రకారం 2018లో పిల్ల లపై జరిగిన లైంగిక నేరాలు దాదాపు 40,000. వాస్తవానికి ఈ తరహా నేరాలు గోప్యంగానే వుండి పోతాయి. బాలిక భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో ఫిర్యాదు చేయడానికే అత్యధికులు సందే హిస్తారు. కానీ ఆ వచ్చే కేసుల్ని సైతం ఇంత నిర్లక్ష్యంగా, ఇంత యాంత్రికంగా పరిశీలించి తీర్పులిస్తే నేరగాళ్లు మరింత రెచ్చిపోయే ప్రమాదం వుండదా? న్యాయమూర్తి మహిళ అయినా, మరొకరైనా ఇలాంటి కేసుల్లో బాధితుల మానసిక స్థితి ఏమిటన్నది ప్రధానంగా చూడాల్సివుంటుంది. తనకు తెలి సినవాడనో, కుటుంబానికి సన్నిహితుడనో భావించి వెళ్లిన బాలికపై హఠాత్తుగా దుండగుడు దాడి చేసే క్షణాల్లో ఆమె ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనై నిస్సహాయతకు లోనవటం, ప్రతిఘటించే శక్తి కోల్పోవటం సంభవిస్తాయి. కనీసం కన్నవారికి కూడా చెప్పుకోలేని దురవస్థలో పడిపోతుంది. జీవిం చినంతకాలమూ బాలికను ఆ ఉదంతం వెన్నాడుతూనే వుంటుంది. చదువుల్లో, ఆ తర్వాత జీవితాన్ని తీర్చిదిద్దుకోవటంలో అడుగడుగునా ఆమె తోటివారికన్నా వెనకబడిపోయి వుంటుంది. ఇలా యావ జ్జీవితమూ వెన్నాడే భయంకరమైన అనుభవాన్ని మిగిల్చిన దుండగులను నిర్హేతుకమైన సాంకేతిక అంశాలను ప్రాతిపదికగా చేసుకుని విడుదల చేస్తే, మరిన్ని నేరాలకు ఆజ్యం పోసినట్టవుతుంది. లైంగిక నేరాల వెనక ఆధిపత్యాన్ని, బలాన్ని ప్రతిష్టించుకోవటం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రతి ఘటించటం తెలియని పసివాళ్లపట్లా, పలుకుబడిలేని అట్టడుగు కులాలవారిపట్లా లైంగిక నేరాలు ఎక్కువగా జరగటం కేవలం యాదృచ్ఛికం కాదు. కిక్కిరిసివుండే బస్సుల్లో, జనసమ్మర్థం ఎక్కువగా వుండే ప్రాంతాల్లో మృగాళ్లు అసభ్యకరంగా ప్రవర్తించటం, లైంగిక వేధింపులకు పాల్పడటం ఆడ పిల్లల్లో ఎక్కువమందికి నిత్యానుభవం. జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పులు తీరు చూస్తే వాటిని అసలు నేరాలుగా పరిగణించనవసరం వుండదు. ఢిల్లీలో తొమ్మిదేళ్లక్రితం నిర్భయ ఉదంతం జరిగినప్పుడు కఠిన చట్టానికి రూపకల్పన చేసిన జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికలో చేసిన వ్యాఖ్యలు ఈ సంద ర్భంగా గుర్తుంచుకోవాలి. దేశంలో అభద్ర వాతావరణానికి కారణం తగిన చట్టాలు లేకపోవటం వల్లకాదని, వాటిని సరిగా అమలుచేసే వ్యవస్థలు కొరవడటం వల్లని తెలిపింది. జస్టిస్ పుష్పకు ఇలాంటి కేసుల పరిశీలన విషయంలో మరింత శిక్షణ అవసరమవుతుందని కొలీజియం అభిప్రాయ పడింది. అది మటుకు వాస్తవం. -
శబరిమల, రాఫెల్‌పై తీర్పు నేడే
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నెలకొన్న అయో«ధ్య వివాదంపై ఇటీవల తుది తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు మరో మూడు కీలక అంశాలపై తీర్పు ఇవ్వనుంది. శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం, రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో అక్రమాలు, రాఫెల్ తీర్పుపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణ పిటిషన్లపై గురువారం తీర్పునివ్వనుంది. శబరిమల వివాదం.. శబరిమలలో ఉన్న ప్రముఖ అయ్యప్పస్వామి ఆలయంలోకి రుతుక్రమం (10 నుంచి 50 మధ్య వయస్సు)లోని స్త్రీల ప్రవేశంపై నిషేధం ఉంది. ఆలయంలోకి అన్ని వయస్సుల స్త్రీలను అనుమతిస్తూ 2018, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ధర్మాసనం వీటిపై విచారణ జరిపి ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వులో ఉంచింది. రఫేల్ వివాదం రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు ఏమీ లేవని కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ 2018 డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఈ కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలతో, ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. అలాగే రాఫెల్‌పై సుప్రీంకోర్టును తప్పుగా అన్వయిస్తూ ‘కాపలాదారు దొంగ’అని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణపై పిటిషన్‌పై కూడా ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. -
జడ్జీలపై కథనాలు బాధించాయి: జస్టిస్ బాబ్డే
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల తీర్పులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలపై కాబోయే ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే(63) 18న బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో కొన్ని కథనాలు జడ్జీల తీర్పులను తప్పుపట్టడంతో ఆగకుండా వారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంటున్నాయి. అలాంటి వేధింపుల అనుభవం నాకు కూడా కలిగింది. న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలను పరువు నష్టం కింద కూడా భావించవచ్చు. అయితే, ఇలాంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాకు కూడా తెలియడం లేదు. ఏదైనా చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది కదా’అని వ్యాఖ్యానించారు. కేసుల విచారణ సకాలంలో జరగాలన్నారు. లేకుంటే నేరాలు పెరిగిపోతున్నాయని, శాంతి భద్రతలు దిగజారుతాయని పేర్కొన్నారు. -
‘తప్పు తీర్పు ఇచ్చానని ఏ జడ్జీ ఒప్పుకోడు’
న్యూఢిల్లీ: ఏ న్యాయమూర్తి తాను తప్పు తీర్పు ఇచ్చానని ఒప్పుకోరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సరైన ఆధారాలు లేకుండా, కేవలం తప్పుడు ఆదేశాలు ఇచ్చారన్న కారణంతో జడ్జీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేమంది. ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత పవిత్రమైంది.తప్పు చేసినట్లు, అవినీతికి పాల్పడినట్లు, ప్రలోభాలకు గురైనట్లు స్పష్టమైన ఆరోపణలుంటే తప్ప.. తప్పు తీర్పు ఇచ్చారన్న ఒకే కారణంతో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించరాదు’ అని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. తనపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించడంపై బిహార్‌కు చెందిన ఒక న్యాయాధికారి దాఖలు చేసి పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పటికే హైకోర్టు బెయిల్‌ను నిరాకరించిన విషయాన్ని గుర్తించకుండా.. హత్యారోపణలు ఎదుర్కొంటున్న కొందరికి బెయిల్ మంజూరు చేయడంపై, మరో డ్రగ్ సంబంధిత కేసు విచారణను హడావుడిగా ముగించడంపై ఆ న్యాయాధికారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అది హిందూ నిర్మాణమే! : అయోధ్య వివాదాస్పద స్థలంలో పురాతత్వ శాఖ(ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో వెల్లడైన విషయాలు ఆ స్థలం తమదేనన్న ముస్లింల వాదనను స్పష్టంగా తోసిపుచ్చుతున్నాయని రామ్ లల్లా తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. అయోధ్య వివాదాస్పద స్థల యాజమాన్య వ్యాజ్యంపై జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు గురువారం వాదనలు కొనసాగాయి. -
కొన్ని మెరుపులు.. కాసిన్ని మరకలు
2018లో బాబ్రీ మసీదు–రామ జన్మభూమి వివాదం నుంచి ఆధార్ కార్డు చెల్లుబాటు వ్యవహారం, రఫెల్ విమానాల కొనుగోలు, శబరిమల ఆలయంలో మహిళ ప్రవేశం వరకు భిన్నమైన కేసులను విచారించిన సుప్రీం కోర్టు అనూహ్యమైన తీర్పులు ఇచ్చింది. సెక్షన్ 377ను పునర్నిర్వచించి స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించింది. వివాహేతర సంబంధాలను క్రిమినల్ నేరంగా పరిగణించడం సరికాదు అంది. శబరిమలలో మహిళ ప్రవేశాన్ని అనుమతించాలంది. జస్టిస్ లోయ అనుమానాస్పద మృతి, మానవ హక్కుల నేతల అరెస్ట్‌పై పిటిషన్లను కొట్టివేసింది. బాబ్రీ మసీదు–రామజన్మభూమి వివాదంపై విచారణ, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ న్యాయబద్ధత, అలోక్ వర్మ పిటిషన్లతో 2019 స్వాగతం పలుకుతోంది. కొన్ని మంచి రోజులున్నట్టే... కొన్నిసార్లు గడ్డు రోజులు కూడా దాపురిస్తాయి. సుప్రీం కోర్టుకు సంబంధించినంత వరకు 2018 ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులకు చెందిన సంవత్సరం. సుప్రీం కోర్టుకు చెందిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులు అనూహ్యంగా విలేఖరుల సమావేశం ఏర్పాటుచేయడంతో ఈ ఏడాది మొదలయ్యింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి తమకు కేసులు కేటాయించడంలో వివక్ష చూపుతున్నారని వారు ఆ సమావేశంలో ఆరోపించి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు. ఇప్పుడు మన ఏడాది చివరికి వచ్చేశాం. ఆ నలుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు పదవీ విరమణ చేయగా, నాలుగోవారైన జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఏడాది ప్రారంభంలో పైస్థాయి న్యాయవ్యవస్థలో చాలా నియమాకాలు అపరిష్కృతంగా ఉండేవి. అయితే, అక్టోబర్‌లో గొగోయ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. అక్టోబర్ నుంచి వివిధ హైకోర్టుల్లో వందలాది నియామకాలు జరిగాయి. సుప్రీం కోర్టులో కూడా కొన్ని ఖాళీలు భర్తీ చేశారు. బాధ్యతలు స్వీకరించినవారిని చూసి కొంతమంది కళ్లెగరేశారు, మరికొందరు పెదవి విరిచారు. ఆయా పదవులను చేపట్టిన తర్వాతైనా వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం. అనూహ్యమైన తీర్పులు ఎన్నో రకాలుగా సుప్రీంకోర్టుకు 2018 చాలా కీలకమైన సంవత్సరం. ఎన్నో విభిన్నమైన కేసులను ఈ ఏడాది సుప్రీం కోర్టు విచారించింది. బాబ్రీ మసీదు–రామ జన్మభూమి వివాదం నుంచి ఆధార్ కార్డు చెల్లుబాటు వ్యవహారం, రఫెల్ విమానాల కొనుగోలు, శబరిమల ఆలయంలో మహిళ ప్రవేశం వరకు భిన్నమైన కేసులను విచారించిన న్యాయస్థానం అనూహ్యమైన తీర్పులు ఇచ్చింది. సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు తీసుకున్న కీలక నిర్ణయాలతోపాటు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయిన సందర్బాలను కూడా గుర్తుచేసుకుంటే బావుంటుంది. లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికల దిశగా న్యాయస్థానం ముందడుగు వేసింది. 1961నాటి ఎన్నికల నిబంధనలను మార్పు చేయాలని ఆదేశించింది. దీంతో అభ్యర్థులు, వారి అనుయాయుల ఆదాయ వివరాల అఫిడవిట్‌ను స్వయంగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ççహదియా కేసుగా అందరికీ తెలిసిన షఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేఎం కేసులో తనకు నచ్చినవారిని వివాహం చేసుకునే హక్కు వారికుందని పునరుద్ఘాటించింది. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడే దిశగా తీర్పు వెలువరిస్తూ కోర్టు సంరక్షకుడి పాత్ర పోషించింది. ‘సామాజిక కట్టుబాట్లు, నైతిక విలువలకు ఎప్పుడూ విలువ ఉంటుంది. అయితే, ఆ విలువలు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛకంటే ఎక్కువకాదని’ సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు వ్యాఖ్యానించింది. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రతి భారతీయుడికీ హుందాగా మరణించే హక్కుందని పేర్కొంది. నిరంతరం మిషన్ల సహాయంతో మాత్రమే జీవించగలిగేవారికి, వాటిని తొలగించడం ద్వారా సహజంగా మరణించే అవకాశం కల్పించవచ్చని తీర్పు చెప్పింది. అయితే, ఇందుకు అవసరమైన విధానపరమైన సూచనలను కూడా సవివరంగా వెల్లడించింది. స్టే కాలపరిధి ఆరు నెలలే ఆసియన్ రిసర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ వర్సెస్ సీబీఐ కేసులో సివిల్, క్రిమినల్ కేసుల విచారణ సుదీర్ఘకాలం ఆలస్యం కాకుండా కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొన్నిసార్లు స్టేను కేసు విచారణను సాగదీయడానికి వాడుకుంటున్న నేపథ్యంలో; సివిల్, క్రిమినల్ కేసుల విచారణలో ఇచ్చే స్టే ఆరు నెలల తర్వాత రద్దవుతుందని పేర్కొంది. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం కేసును ముగించడం కంటే, స్టేను కొనసాగించడమే ముఖ్యమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. తహ్సీన్ పూనావాలా పిటిషన్‌ను విచారించిన కోర్టు దేశంలో మూకదాడులు ఎక్కువైపోవడంపై స్పందిస్తూ నిందితులను పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో విధివిధానాలు రూపొందించాలని ఆదేశించింది. సెప్టెంబర్ చివరికొచ్చేసరికి అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కొన్ని ముఖ్యమైన తీర్పులు ఇచ్చింది. నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సెక్షన్ 377ను పునర్నిర్వచించి స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ చరిత్రాత్మకమైన తీర్పు వెలు వరించింది. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సెక్షన్ 497 కొట్టివేస్తూ భార్య భర్త సొత్తుకాదని, వివాహేతర సంబంధాలను క్రిమినల్ నేరంగా పరిగణించడం సరికాదు అంది. దీనివల్ల మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. అంతేకాదు, ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో శబరిమలలో మహిళా ప్రవేశాన్ని అనుమతించాలని తీర్పు చెప్పింది. పది నుంచి యాభై ఏళ్ల వయసు కలిగిన మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని వ్యాఖ్యానించింది. అన్నీ అనుకూలమైనవి కావు ఇటీవలి ఈ తీర్పులన్నీ దేశంలోని పౌరులందరికీ మేలు చేయాలని సుప్రీంకోర్టు తీసుకున్నవే. ఈ తీర్పులపై వ్యాఖ్యానించే ముందు కోర్టు పెద్దన్న తరహాలో హక్కులను ధారాదత్తం చేయలేదనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటికే రాజ్యాంగంలో పొందుపరిచిన వాటినే మరోసారి పునర్నిర్వచించింది. అంతమాత్రనా కోర్టు ప్రతి సందర్భంలోనూ పౌరుడి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పడం కాదు. ఆధార్ కార్డు చెల్లుబాటును సవాల్ చేసిన కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జనవరి నుంచి వాదనలు సాగాయి. చివరికి సుప్రీం కోర్టు ఆధార్ కార్డుకు చట్టబద్ధత కల్పించింది. ప్రైవేట్ పార్టీలు కూడా ఆధార్ కార్డును డిమాండ్ చేయడం వంటి అంశాలను మాత్రం కొట్టివేసింది. చీకటి కోణాలు కొన్ని కేసుల విషయంలో అనేక వివాదాలు ఈ ఏడాది సుప్రీం కోర్టును చుట్టుముట్టాయి. సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ లోయ అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అలాగే, భీమా కోరేగావ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలతో సంబంధం ఉందని ఆరోపిస్తూ ఐదుగురు మానవ హక్కుల నేతలను అరెస్ట్ చేయడంపై సమగ్రమైన స్వతంత్ర విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ప్రభుత్వం రఫెల్ విమానాల కొనుగోలు చేయడంపై దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కూడా కోర్టు తోసిపుచ్చింది. సీల్డ్ కవర్లో వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించే విధానాన్ని అవలంబించడం చాలా చర్చకు తావిచ్చింది. ఈ తీర్పు విషయంలో పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి కాగ్ సమర్పించే నివేదికపై కోర్టు ఆధారపడింది. అయితే, అటువంటి నివేదిక ఏదీ అప్పటికి కాగ్ సమర్పించలేదు. దీంతో తీర్పులో తప్పులను దిద్దాలంటూ కేంద్రం దరఖాస్తు చేసుకుంది. రాబోయే 2019వ సంవత్సరం కూడా కీలకంగానే కనిపిస్తోంది. కోర్టు ప్రారంభం కాగానే బాబ్రీ మసీదు–రామజన్మభూమి వివాదంపై కేసు విచారణకు తేదీ ఖరారు చేయాల్సి ఉంది. తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ న్యాయబద్ధతపై నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అలాగే, సీబీఐ డైరెక్టర్‌గా తనను తొలగించడంపై అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషనపై కూడా కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు సంబంధించి మరో ఏడాది 2018 కూడా కాలప్రవాహంలో కలిసిపోతోంది. సుప్రీంకోర్టు ఈ ఏడాది తనను తాను ఒక బృంద సంస్థగా నిలబెట్టుకుంది. ఎవరో ఒకరు పెత్తనం చేయడం కుదరదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడలేకపోయినా, సామాజిక నైతిక చట్రం నుంచి పౌరులను కాపాడే విషయంలో అండగా నిలిచింది. రాజ్యాంగ నైతికతను కాపాడటానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, అస్పష్ట భావనతో, ఇంద్రియ జ్ఞానంకంటే వ్యక్తిత్వంపైనే ఎక్కువ ఆధారపడుతుంది. కొన్ని మంచి సమయాలు, మరి కొన్ని చెడు సమయాలు. వ్యాసకర్తలు: సంజయ్ హెగ్డే, ప్రెంజాల్ కిషోర్.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు – ‘ది వైర్’ సౌజన్యంతో -
తీర్పులివ్వడంలో జెట్ స్పీడ్!
జగిత్యాల: చట్టం ముందు అందరు సమానులే. తప్పు చేస్తే ఎంత పెద్దవారైనా శిక్షలు పడాల్సిందే. విచారణ పేరిట కాలయాపన చేయడం ఆ జడ్జికి అసలు నచ్చదు. అందుకే ప్రతి కేసును లోతుగా విచారణ చే సి, వెంటనే తీర్పులు ఇస్తుంటారు. కేసుల్లో నేరం నిరూపణ అయితే కఠినమైన శిక్షలు వేస్తుంటారు. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను ఏడాదిన్నరలోనే విచారణ చేసి, 25 కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు వేసి రికార్డు సృష్టించారు. తక్కువ కాల వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కేసులను విచారణ చేసి, అత్యధికంగా నిందితులకు శిక్షలు వే సిన జడ్జిగా కరీంనగర్ జిల్లా జగిత్యాల రెండవ అదనపు జిల్లా జడ్జి శ్యాం మోహన్ రావు పేరు పొందారు. గడిచిన మూడు రోజుల్లో ఒకరికి పదేళ్ల జైలు శిక్ష, మరొకరికి ఏడేళ్ల జైలు శిక్షలు వేసి, నిందితుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా తీర్పులిస్తున్నారు. ఎక్కడ పనిచేసిన విచారణ వేగవంతం జగిత్యాల రెండవ అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న డి. శ్యాం మోహన్‌రావు 23 ఏళ్లుగా మున్సిఫ్ మేజిస్ట్రేట్, సబ్ జడ్జి, అదనపు జిల్లా జడ్జిగా న్యాయ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. జగిత్యాలకు రాక ముందు, వరంగల్ 4వ అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. ఆ సమయంలో వందల్లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు విచారణ చేయడంతో, చివరకు రెండు కేసులు మాత్రమే మిగిలాయి. జగిత్యాల కోర్టుకు 24 ఏప్రిల్, 2013 బదిలిపై వచ్చిన సమయంలో 63 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాదిన్నరలో మరో 100 కేసులు వచ్చి చేరాయి. వంద కేసులు పోను, మిగతా అన్ని కేసులను విచారణ చేపట్టి పరిష్కరించగా, ప్రస్తుతం 50 వరకు పెండింగ్ కేసులు ఉన్నాయి. శిక్షలు వేయడమే కాకుండా, మానవ సంబంధాలతో ముడిపడి ఉన్న కేసుల్లో భార్య భర్తలను కలపడం, తల్లిదండ్రులకు మనోవర్తి ఇప్పించేలా తీర్పులు ఉంటాయి. 15 వరకు యావజ్జీవ శిక్షలు అత్యాచారం, హత్యలు, వరకట్న చావులు వంటి క్రూరమైన నేరాలకు పాల్పడ్డ 15 కేసుల్లోని నిందితులకు యావజ్జీవ శిక్షలు వేశారు. ఒకరికి పదేళ్ల జైలు శిక్ష, మరొకరికి ఏడేళ్ల జైలు శిక్ష, ఐదు కేసుల్లో ఐదేళ్ల జైలు శిక్షలు విధించారు. కేసు ఫైల్ తన టేబుల్ మీదకు వచ్చిదంటే చాలు, వెంటనే విచారణ తేదిలను నిర్ణయించి వారం రోజుల్లోనే కేసు విచారణ పూర్తి చేస్తారు. బెయిల్ ఇచ్చేవారు లేక, జైళ్లలో గడిపేవారి కేసులను పెండింగ్‌లో పెట్టకుండా, ఎప్పటికప్పుడు విచారణ చేస్తుంటారు. కక్షిదారులకు సత్వర న్యాయం జరిగితేనే కోర్టులపై నమ్మకం పెరుగుతుందని ఆశిస్తూ, తన తీర్పులను సత్వరం ప్రకటిస్తుంటారు. పోలీసుల హర్షం పోలీసులు పెట్టిన కేసుల్లో కొన్ని సరైన సాక్ష్యాలు లేక వీగిపోతుంటే, మరికొన్ని కేసులు సాక్ష్యం ఉన్నప్పటికి ఇరువర్గాలు కోర్టులో రాజీకి రావడంతో వీగి పోతుంటాయి. ఇలాంటి సమయంలో, జిల్లాలో ఎక్కడ లేనివిధంగా జగిత్యాల కోర్టులో శిక్షలు పడుతుండటంతో పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా, సాక్ష్యాలను బట్టి శిక్షలు వేయడం వల్ల ప్రతి ఒక్కరికి న్యాయవ్యవస్థ మీద నమ్మకం పెరిగి, సత్వర న్యాయం అందుతుందని సామాన్యులు భావిస్తున్నారు. నేరస్థుల్లో భయం పెరిగి, నేరాలకు దూరంగా ఉంటారని, తద్వారా శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని పోలీసులు ఆశిస్తున్నారు.