జగిత్యాల: చట్టం ముందు అందరు సమానులే. తప్పు చేస్తే ఎంత పెద్దవారైనా శిక్షలు పడాల్సిందే. విచారణ పేరిట కాలయాపన చేయడం ఆ జడ్జికి అసలు నచ్చదు. అందుకే ప్రతి కేసును లోతుగా విచారణ చే సి, వెంటనే తీర్పులు ఇస్తుంటారు. కేసుల్లో నేరం నిరూపణ అయితే కఠినమైన శిక్షలు వేస్తుంటారు. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను ఏడాదిన్నరలోనే విచారణ చేసి, 25 కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు వేసి రికార్డు సృష్టించారు. తక్కువ కాల వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కేసులను విచారణ చేసి, అత్యధికంగా నిందితులకు శిక్షలు వే సిన జడ్జిగా కరీంనగర్ జిల్లా జగిత్యాల రెండవ అదనపు జిల్లా జడ్జి శ్యాం మోహన్ రావు పేరు పొందారు. గడిచిన మూడు రోజుల్లో ఒకరికి పదేళ్ల జైలు శిక్ష, మరొకరికి ఏడేళ్ల జైలు శిక్షలు వేసి, నిందితుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా తీర్పులిస్తున్నారు.
ఎక్కడ పనిచేసిన విచారణ వేగవంతం
జగిత్యాల రెండవ అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న డి. శ్యాం మోహన్‌రావు 23 ఏళ్లుగా మున్సిఫ్ మేజిస్ట్రేట్, సబ్ జడ్జి, అదనపు జిల్లా జడ్జిగా న్యాయ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. జగిత్యాలకు రాక ముందు, వరంగల్ 4వ అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. ఆ సమయంలో వందల్లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు విచారణ చేయడంతో, చివరకు రెండు కేసులు మాత్రమే మిగిలాయి. జగిత్యాల కోర్టుకు 24 ఏప్రిల్, 2013 బదిలిపై వచ్చిన సమయంలో 63 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాదిన్నరలో మరో 100 కేసులు వచ్చి చేరాయి. వంద కేసులు పోను, మిగతా అన్ని కేసులను విచారణ చేపట్టి పరిష్కరించగా, ప్రస్తుతం 50 వరకు పెండింగ్ కేసులు ఉన్నాయి. శిక్షలు వేయడమే కాకుండా, మానవ సంబంధాలతో ముడిపడి ఉన్న కేసుల్లో భార్య భర్తలను కలపడం, తల్లిదండ్రులకు మనోవర్తి ఇప్పించేలా తీర్పులు ఉంటాయి.
15 వరకు యావజ్జీవ శిక్షలు
అత్యాచారం, హత్యలు, వరకట్న చావులు వంటి క్రూరమైన నేరాలకు పాల్పడ్డ 15 కేసుల్లోని నిందితులకు యావజ్జీవ శిక్షలు వేశారు. ఒకరికి పదేళ్ల జైలు శిక్ష, మరొకరికి ఏడేళ్ల జైలు శిక్ష, ఐదు కేసుల్లో ఐదేళ్ల జైలు శిక్షలు విధించారు. కేసు ఫైల్ తన టేబుల్ మీదకు వచ్చిదంటే చాలు, వెంటనే విచారణ తేదిలను నిర్ణయించి వారం రోజుల్లోనే కేసు విచారణ పూర్తి చేస్తారు. బెయిల్ ఇచ్చేవారు లేక, జైళ్లలో గడిపేవారి కేసులను పెండింగ్‌లో పెట్టకుండా, ఎప్పటికప్పుడు విచారణ చేస్తుంటారు. కక్షిదారులకు సత్వర న్యాయం జరిగితేనే కోర్టులపై నమ్మకం పెరుగుతుందని ఆశిస్తూ, తన తీర్పులను సత్వరం ప్రకటిస్తుంటారు.
పోలీసుల హర్షం
పోలీసులు పెట్టిన కేసుల్లో కొన్ని సరైన సాక్ష్యాలు లేక వీగిపోతుంటే, మరికొన్ని కేసులు సాక్ష్యం ఉన్నప్పటికి ఇరువర్గాలు కోర్టులో రాజీకి రావడంతో వీగి పోతుంటాయి. ఇలాంటి సమయంలో, జిల్లాలో ఎక్కడ లేనివిధంగా జగిత్యాల కోర్టులో శిక్షలు పడుతుండటంతో పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా, సాక్ష్యాలను బట్టి శిక్షలు వేయడం వల్ల ప్రతి ఒక్కరికి న్యాయవ్యవస్థ మీద నమ్మకం పెరిగి, సత్వర న్యాయం అందుతుందని సామాన్యులు భావిస్తున్నారు. నేరస్థుల్లో భయం పెరిగి, నేరాలకు దూరంగా ఉంటారని, తద్వారా శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని పోలీసులు ఆశిస్తున్నారు.
తీర్పులివ్వడంలో జెట్ స్పీడ్!
Published Thu, Feb 12 2015 11:10 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement