న్యాయాన్యాయాలను నిర్ధారించే వేదిక ఎప్పుడూ బాధితుల పక్షం ఉంటుందనీ, ఉండాలనీ అందరూ నమ్ముతారు. కానీ అక్కడ అందుకు విరుద్ధమైన పోకడలకు పోతుంటే ఏం చేయాలి? బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ పుష్ప వీరేంద్ర గనేడివాలా ఇటీవల వరసబెట్టి ఇస్తున్న తీర్పులు ఈ ప్రశ్న రేకెత్తిస్తున్నాయి. అదృష్టవశాత్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పుల అసమంజసత్వాన్ని సకాలంలో గుర్తించి వాటి అమలును నిలిపేస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం అదనపు న్యాయమూర్తిగా వున్న ఆమెకు శాశ్వత న్యాయమూర్తి హోదా ఇవ్వాలని గతంలో చేసిన సిఫా ర్సును సుప్రీంకోర్టు కొలీజియం ఉపసంహరించుకుంది.
ఆ వివాదాస్పద తీర్పులు, దానిపై సుప్రీం కోర్టు స్పందన, కొలీజియం నిర్ణయం వంటివన్నీ గత నెలలో జరిగాయి. కానీ ఆమె వెలువరించిన తాజా తీర్పు సైతం ఆ తరహాలోనే వుండటం అందరినీ మరింత ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇవన్నీ బాలబాలికలపట్ల అమలవుతున్న లైంగిక నేరాలను అరికట్టి, వారికి చట్టపరమైన రక్షణ కల్పించడా నికి తీసుకొచ్చిన కఠినమైన పోక్సో చట్టం కింద నమోదైన కేసులు. కానీ జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పులు దాని మౌలిక ఉద్దేశాన్ని దెబ్బతీశాయి. వివాదాస్పదమైన ఈ తీర్పుల్ని స్థూలంగా పరిశీలిస్తే అవి ఎంత అన్యాయంగా వున్నాయో అర్ధమవుతుంది. మొదటి కేసులో అయిదేళ్ల బాలికపై లైంగిక దాడి చేయ డానికి నిందితుడు ప్రయత్నించాడు. ఆమె ఎదురుగానే తన ప్యాంట్స్ జిప్ తీసేందుకు ప్రయత్నించాడు. దీన్ని లైంగిక దాడిగా పరిగణించాల్సిన అవసరం లేదంటూ అతనికి విధించిన మూడేళ్ల జైలు శిక్షను తగ్గించి, ఐపీసీ సెక్షన్ 354కింద ఏడాది జైలు శిక్ష వేశారు.
మరో కేసులో బాలిక ఛాతిని మరో నిందితుడు అదిమాడు. ఆమె ఒంటిపై దుస్తులుండగా ఆ పనికి పాల్పడ్డాడని, ఇందులో ‘చర్మం– చర్మం(స్కిన్ టు స్కిన్) రాసుకున్న’ వైనం లేదు గనుక ఇక్కడ నేరమేమీ జరగలేదని తేల్చారు. నిందితుడిని విడుదల చేయాలని ఆదేశించారు. ఇంకో కేసులో కూడా అంతే. ఆ కేసులో బాలికపై అత్యాచారం జరిగింది. అయితే ఆమె సాక్ష్యం విశ్వసించదగ్గదిగా లేదని అభిప్రాయపడుతూ, ఇలాంటి అప్రామాణిక సాక్ష్యాల ఆధారంగా నిందితులను శిక్షిస్తే వారికి అన్యాయం చేసినట్టవు తుందని చెప్పారు. మరో లైంగిక దాడి కేసులోనూ ఆమె నిర్ణయం వింతగా వుంది. ఆ సమయంలో బాలిక ప్రతిఘటించిన దాఖలా కనబడలేదని తెలిపారు. నేరగాడు తన దుస్తులు తొలగించుకుంటూ ఆమె దుస్తులు కూడా తీసి అత్యాచారం చేశాడంటే నమ్మశక్యంగా లేదని, ఇది పరస్పరం అంగీకారం వున్న కేసుగా భావించవచ్చునని తేల్చారు. తాజా కేసులో నేరగాడి అత్యాచారం కారణంగానే బాలిక గర్భవతి అయిందనటానికి ఆధారం లేదని, పోలీసులు డీఎన్‌ఏ నివేదిక జతపర్చలేదని చెప్పారు.
ఈ కేసులన్నిటా ఆమె నిందితుల ఉద్దేశాలనుగానీ, బాధితుల నిస్సహాయతనుగానీ పరిగణన లోకి తీసుకోకుండా సాంకేతిక అంశాలు చూసి తనకు తోచిన తీర్పులిచ్చారని స్పష్టంగా వెల్లడవు తోంది. ప్రపంచ దేశాలన్నిటితో పోలిస్తే భారత్‌లోనే బాలబాలికలపై లైంగిక నేరాలు అత్యధికమని చాన్నాళ్లక్రితం యునిసెఫ్ తెలిపింది. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో నివేదిక ప్రకారం 2018లో పిల్ల లపై జరిగిన లైంగిక నేరాలు దాదాపు 40,000. వాస్తవానికి ఈ తరహా నేరాలు గోప్యంగానే వుండి పోతాయి. బాలిక భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో ఫిర్యాదు చేయడానికే అత్యధికులు సందే హిస్తారు. కానీ ఆ వచ్చే కేసుల్ని సైతం ఇంత నిర్లక్ష్యంగా, ఇంత యాంత్రికంగా పరిశీలించి తీర్పులిస్తే నేరగాళ్లు మరింత రెచ్చిపోయే ప్రమాదం వుండదా? న్యాయమూర్తి మహిళ అయినా, మరొకరైనా ఇలాంటి కేసుల్లో బాధితుల మానసిక స్థితి ఏమిటన్నది ప్రధానంగా చూడాల్సివుంటుంది.
తనకు తెలి సినవాడనో, కుటుంబానికి సన్నిహితుడనో భావించి వెళ్లిన బాలికపై హఠాత్తుగా దుండగుడు దాడి చేసే క్షణాల్లో ఆమె ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనై నిస్సహాయతకు లోనవటం, ప్రతిఘటించే శక్తి కోల్పోవటం సంభవిస్తాయి. కనీసం కన్నవారికి కూడా చెప్పుకోలేని దురవస్థలో పడిపోతుంది. జీవిం చినంతకాలమూ బాలికను ఆ ఉదంతం వెన్నాడుతూనే వుంటుంది. చదువుల్లో, ఆ తర్వాత జీవితాన్ని తీర్చిదిద్దుకోవటంలో అడుగడుగునా ఆమె తోటివారికన్నా వెనకబడిపోయి వుంటుంది. ఇలా యావ జ్జీవితమూ వెన్నాడే భయంకరమైన అనుభవాన్ని మిగిల్చిన దుండగులను నిర్హేతుకమైన సాంకేతిక అంశాలను ప్రాతిపదికగా చేసుకుని విడుదల చేస్తే, మరిన్ని నేరాలకు ఆజ్యం పోసినట్టవుతుంది.
లైంగిక నేరాల వెనక ఆధిపత్యాన్ని, బలాన్ని ప్రతిష్టించుకోవటం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రతి ఘటించటం తెలియని పసివాళ్లపట్లా, పలుకుబడిలేని అట్టడుగు కులాలవారిపట్లా లైంగిక నేరాలు ఎక్కువగా జరగటం కేవలం యాదృచ్ఛికం కాదు. కిక్కిరిసివుండే బస్సుల్లో, జనసమ్మర్థం ఎక్కువగా వుండే ప్రాంతాల్లో మృగాళ్లు అసభ్యకరంగా ప్రవర్తించటం, లైంగిక వేధింపులకు పాల్పడటం ఆడ పిల్లల్లో ఎక్కువమందికి నిత్యానుభవం. జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పులు తీరు చూస్తే వాటిని అసలు నేరాలుగా పరిగణించనవసరం వుండదు. ఢిల్లీలో తొమ్మిదేళ్లక్రితం నిర్భయ ఉదంతం జరిగినప్పుడు కఠిన చట్టానికి రూపకల్పన చేసిన జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికలో చేసిన వ్యాఖ్యలు ఈ సంద ర్భంగా గుర్తుంచుకోవాలి. దేశంలో అభద్ర వాతావరణానికి కారణం తగిన చట్టాలు లేకపోవటం వల్లకాదని, వాటిని సరిగా అమలుచేసే వ్యవస్థలు కొరవడటం వల్లని తెలిపింది. జస్టిస్ పుష్పకు ఇలాంటి కేసుల పరిశీలన విషయంలో మరింత శిక్షణ అవసరమవుతుందని కొలీజియం అభిప్రాయ పడింది. అది మటుకు వాస్తవం.
Comments
Please login to add a commentAdd a comment