హెచ్‌సీఏఏ కార్యక్రమంలో మాట్లాడుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహా. చిత్రంలో హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్‌భూయాన్
సాక్షి, హైదరాబాద్: అత్యున్నత న్యాయస్థానం తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి ఇవ్వడం శుభ పరిణామమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహా వ్యాఖ్యానించారు. అలాగే, కనీసం జిల్లా కోర్టుల్లోనైనా స్థానిక భాషల్లో వాదనలు సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో తమ కేసులో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కక్షిదారులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
ప్రస్తుతం ఆంగ్లంలో వాదనలు సాగుతుండటంతో చాలామంది కేసు గురించి అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పారు. ‘బార్ అండ్ బెంచ్’ సంబంధాలపై హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ)ల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి జస్టిస్ నరసింహా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మన సొంత భాషలో న్యాయ విద్యాబోధనకు అవకాశం ఇవ్వాలన్నారు. ‘న్యాయవా దులు మన భాష, మన సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలి.
దీంతోపాటే ఆంగ్లంపై కూడా పట్టు సాధించాలి. పెండింగ్ కేసులను మాత్రమే కాదు.. రోజూ నమోదవుతున్న కేసులను కూడా సత్వరం పూర్తి చేయాలి. దీనికి బార్ అండ్ బెంచ్ సమన్వయంతో పని చేయాలి. అన్నదమ్ముల భూ పంచాయతీకి.. భార్యాభర్తల విడాకులకు.. దాదాపు 15 ఏళ్లకుపైగా సమయం పడుతుండటంతో కోర్టులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలి’ అని వివరించారు.
ఇక్కడి వారికి సుపరిచితుడు..
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. ‘ప్రత్యేకంగా జస్టిస్ నరసింహా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో పుట్టి పెరగ డమే కాదు.. న్యాయవాద వృత్తినీ ఇక్కడే ఆరంభించారు. ఇక్కడి న్యాయవాదులకు ఆయన సుపరిచితుడు.
పలు కీలక కేసులను వాదించి సుప్రీంకోర్టు న్యాయవాదిగానూ పేరుతెచ్చుకున్నారు. రాజ్యాంగబద్ధమైన కేసుల్లో విజ యం సాధించి.. న్యాయమూర్తిగా నియమితులయ్యారు’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు రఘునాథ్, కార్యదర్శులు మల్లారెడ్డి, నరేందర్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment