
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఎయిర్ ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కస్టమర్ సర్వీసును తెలుగు భాషలో కూడా అందిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్, హిందీతో పాటు ఏడు కొత్త భాషలను దాని ఐవీఆర్ సిస్టమ్‌కు జోడించడం ద్వారా కస్టమర్ సపోర్ట్ సేవలను మెరుగుపరిచినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
కొత్త ప్రవేశపెట్టిన ఏడు భాషలలో తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, తమిళం ఉన్నాయి. ఈ సర్వీస్ ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా వెల్లడించింది. అంతే కాకుండా ఎయిర్ ఇండియా కొత్తగా ఐదు కొత్త కాంటాక్ట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కస్టమర్లు తమకు కావాల్సిన సమాచారం కోసం ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు.