customer service
-
Nitin Gadkari: కస్టమర్ సర్విసులపై మరింతగా దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని వాహన సంస్థలకు కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. నాణ్యతకు భరోసానిస్తూ, విక్రయానంతర సేవలను మెరుగుపర్చుకునే విధంగా కొత్త ఆవిష్కరణలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా కార్యక్రమానికి పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్వయం సమృద్ధి సాధించాలన్న భారత లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో ఆటోమోటివ్ డీలర్లు ప్రధాన పాత్ర పోషించగలరని ఆయన తెలిపారు. దేశ ఎకానమీలో కీలకంగా ఉంటున్న ఆటో రిటైల్ పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతునిస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారు. పర్యావరణహిత మొబిలిటీ సొల్యూషన్స్ విషయంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేందుకు భారత్ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. -
ప్రాంతీయ భాషలో కస్టమర్ సర్వీస్: ఎయిర్ ఇండియా
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఎయిర్ ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కస్టమర్ సర్వీసును తెలుగు భాషలో కూడా అందిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్, హిందీతో పాటు ఏడు కొత్త భాషలను దాని ఐవీఆర్ సిస్టమ్‌కు జోడించడం ద్వారా కస్టమర్ సపోర్ట్ సేవలను మెరుగుపరిచినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.కొత్త ప్రవేశపెట్టిన ఏడు భాషలలో తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, తమిళం ఉన్నాయి. ఈ సర్వీస్ ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా వెల్లడించింది. అంతే కాకుండా ఎయిర్ ఇండియా కొత్తగా ఐదు కొత్త కాంటాక్ట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కస్టమర్లు తమకు కావాల్సిన సమాచారం కోసం ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. -
రెండో సారి నెం.1గా నిలిచిన ప్రముఖ కంపెనీ
న్యూఢిల్లీ: వినియోగదారులకు సేవలు అందించే విషయంలో ఎంజీ ఇండియా వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో నిలిచినట్టు జేడీ పవర్ తెలిపింది. ఇండియా కస్టమర్ సర్వీసెస్ ఇండెక్స్ అధ్యయనాన్ని నీల్సన్ ఐక్యూ భాగస్వామ్యంతో జేడీ పవర్ నిర్వహించింది. సర్వీస్ అభ్యర్థనల ధ్రువీకరణ, సర్వీస్‌కు ముందు, సర్వీస్‌కు తర్వాత కస్టమర్ల అభిప్రాయం, ఎప్పటికప్పుడు సర్వీస్‌కు సంబంధించి తాజా సమాచారం అందించే విషయంలో ఎంజీ ఇండియా సేవల పట్ల ఎక్కువ మంది కస్టమర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎంజీ ఇండియా 25 ఇండెక్స్ పాయింట్లు (మొత్తం 1,000 పాయింట్ల స్కేల్‌పై) పెంచుకుంది. సర్వీసు నాణ్యత బాగుందని 80 శాతం మంది కస్టమర్లు చెప్పారు. ఇండెక్స్‌లో ఎంజీ ఇండియా అత్యధికంగా 860 స్కోర్ సంపాదించింది. హోండా 852, టయోటా 852 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటే ఫ్రీగా ఫ్లైట్ జర్నీ చేయొచ్చు! -
కస్టమర్ సర్వీసుకే భారతీయుల ప్రాధాన్యం
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ 2017 సర్వే న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులు .. అత్యుత్తమ కస్టమర్ కేర్ సర్వీసులు అందించే సంస్థలకే పెద్ద పీట వేస్తారని ఆర్థిక సేవల సంస్థ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మెరుగైన సేవలు అందించే సంస్థల ఉత్పత్తులు, సర్వీసులు కొనుగోలు చేసేందుకు కాస్త ఎక్కువ మొత్తం వెచ్చించడానికి కూడా భారతీయులు వెనుకాడరని.. వీలైతే వాటి గురించి నలుగురికీ కాస్త మంచిగా చెప్పడం ద్వారా ప్రచారం కూడా ఇస్తారని సర్వే నివేదిక పేర్కొంది. భారత్, అమెరికా, బ్రిటన్లతో పాటు తొమ్మిది దేశాల్లో నిర్వహించిన 2017 గ్లోబల్ కస్టమర్ సర్వీస్ బారోమీటర్ సర్వే వివరాలను అమెరికా ఎక్స్‌ప్రెస్ విడుదల చేసింది. భారత్‌లో వ్యాపార సంస్థలు నిలదొక్కుకోవాలంటే మంచి ఉత్పత్తులతో పాటు కొనుగోలు అనంతర సేవలు అవసరమని వివరించింది.