సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ముందుగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతాయనే ప్రచారంతో నిరుద్యోగ యువత ఎక్కువగా ఈ కొలువులకే సన్నద్ధమవుతోంది. అత్యధిక పోస్టులు ఉండటంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత కావడంతో వీటికి అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. వయోపరిమితి విషయంలో నెలకొన్న అస్పష్టతతో చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు.
అధిక సంఖ్యలో నియామకాలు చేపట్టే కానిస్టేబుల్ ఉద్యోగానికి గరిష్ట వయోపరిమితి 22 ఏళ్లు ఉండగా, ఎస్సై పోస్టులకు 25, డీఎస్పీకి 28, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు 26 ఏళ్లు ఉంది. దీంతో గరిష్ట వయోపరిమితి పెంపుపై నిరుద్యోగ యువత గంపెడాశలు పెట్టుకుంది.
వయోపరిమితి పెంచితేనే..
పోలీసు శాఖలో వివిధ కేటగిరీల్లో 16,587 కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేసేందుకు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా గ్రూప్–1లో డీఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్, రీజినల్ ట్రా న్స్‌పోర్ట్ ఆఫీసర్ విభాగాల్లో 120 ఉద్యోగాలున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న నేపథ్యంలో ఇతర ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
కానీ యూనిఫాం కొలువులపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రిజర్వేషన్ అభ్యర్థులకు కాస్త సడలింపు ఉన్నప్పటికీ జనరల్ కేటగిరీలో సడలింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ జనరల్ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి పెంచితే రిజర్వ్‌డ్ అభ్యర్థులకు మరింత ఉపశమనం కలుగుతుందనే ఆశ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో కనిపిస్తోంది. వయోపరిమితిపై ప్రభుత్వం ముం దుగానే నిర్ణయం ప్రకటించాలని, నోటిఫికేషన్ విడుదలయ్యాక సడలింపు జఠిలమవుతుందని అభ్యర్థులు చెబుతున్నారు.
పొరుగున 35 ఏళ్లు
గ్రూప్–1 కేటగిరీలో యూనిఫాం ఉద్యోగాలు డీఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఆర్టీఓ ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీలో డీఎస్పీకి గరిష్ట వయోపరిమితి 28, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు 26 ఏళ్లు ఉంది. అయితే, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలుగా ఉంది. ఇక్కడా వయోపరిమితి పెంచాలని, లేనిపక్షంలో చాలామంది ఆశలు గల్లంతవుతాయని నిరుద్యోగులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment