
మిర్యాలగూడ అర్బన్: గ్రూప్–4 పరీక్ష రాసేందుకు శనివారం ఇంటికి వచ్చిన కానిస్టేబుల్ ఆదివారం తిరిగి డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణకాలనీ బైపాస్ వద్ద చోటుచేసుకుంది. మిర్యాలగూడ టూటౌన్ ఎస్‌ఐ ఎస్. క్రిష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని బాబూ జీనగర్ కాలనీకి చెందిన కుంచం వెంకన్న, ఇద్దమ్మ దంపతులకు కుమారుడు సైదులు(30), కుమార్తె సుచరిత సంతానం. తన పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలనే ఆశయంతో వెంకన్న ఆటో నడుపుతూ ఇద్దరినీ కష్టపడి చదివించాడు.
తండ్రి ఆశయాన్ని నిజం చేస్తూ కుంచం సైదులు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి గత రెండేళ్లుగా నల్లగొండలోని 12వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివా రం గ్రూప్–4 పరీక్ష రాసేందుకు సైదులు సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. పరీక్ష రాసిన సైదులు తిరిగి ఆదివారం ఉదయం 6:30 గంటల సమయంలో బైక్‌పై డ్యూటీకి వెళ్తుండగా మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణకాలనీ బైపాస్ వద్ద వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది.
లారీ సైదులు నడుముపై నుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు
సైదులు నేత్రాలను కుటుంబ సభ్యులు మిర్యాలగూడ లయన్స్ క్లబ్ సహకారంతో ఖమ్మం నేత్ర నిధికి అందజేశారు. తన చెల్లెలు సుచరితకు వివాహం చేసిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పిన కుమారుడు విగతజీవిగా పడి ఉండటం చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment