మునగాల(కోదాడ): అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో దంపతులతో పాటు వారి కుమార్తె మృతిచెందారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద ఈ ప్రమాదంలో మరో ముగ్గురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. మృతుల స్వస్థలం మునగాల మండలంలోని వెంకట్రాంపురం గ్రామ పంచాయతీ ఆవాసం ఎస్‌ఎంపేట గ్రామం. వివరాలు.. ఎస్‌ఎంపేట గ్రామానికి చెందిన మందపెల్లి రామారావు, లక్ష్మయ్య అన్నదమ్ములు. రామారావు మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. రామారావు కుమారుడు ఆస్ట్రేలియాలో ఉండడంతో అతడు వచ్చాక శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా లక్ష్మయ్య కుమారులు సంతోష్‌కుమార్, అరుణ్‌కుమార్ గత ఏడాది కాలంగా ఖమ్మం పట్టణంలో నివాసముంటున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం తమ పెద్దనాన్న అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రెండు కార్లలో కుటుంబ సభ్యులతో కలిసి ఎస్‌ఎంపేటకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో సంతోష్‌కుమార్‌తో పాటు భార్య ఝాన్సీరాణి, వారి ఇద్దరు కుమార్తెలు, అతడి తమ్ముడు(అరుణ్‌కుమార్) పిల్లలు ఇద్దరు కలిసి ఒక కారులో వెళ్తున్నారు. మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు ఖమ్మం జిల్లాలోని తల్లంపాడు వద్ద సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మందపల్లి సంతోష్‌కుమార్(38) అక్కడికక్కడే మృతిచెందాడు.
అతడి భార్య ఝాన్సీరాణి(35)కి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఖమ్మం పట్టణంలోని మమత హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారిని ఖమ్మం పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఇందులో సంతోష్‌కుమార్ పెద్ద కుమార్తె యోజిత(16) చికిత్స పొందుతూ మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం శనివారం మృతదేహాలను ఎస్‌ఎంపేటకు తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment