వారం ముందే ముగియనున్న  కానిస్టేబుళ్ల శిక్షణ | telangana constable training may complete one week before | Sakshi
Sakshi News home page

వారం ముందే ముగియనున్న  కానిస్టేబుళ్ల శిక్షణ

Published Thu, Aug 6 2020 3:26 AM | Last Updated on Thu, Aug 6 2020 3:26 AM

telangana constable training may complete one week before - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతోన్న కానిస్టేబుల్‌ శిక్షణ గడువుకు వారం ముందే ముగియనుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ప్రక్రియ అక్టోబర్‌ 12 తరువాత పూర్తవ్వాల్సి ఉంది. కరోనా కారణంగా మొదటి సెమిస్టర్‌ అనంతరం ఇవ్వాల్సిన వారం రోజుల సెలవులు రద్దయ్యాయి. మర్నాటి నుంచే రెండో సెమిస్టర్‌ ప్రారంభమవడంతో తొమ్మిది నెలల కానిస్టేబుల్‌ శిక్షణ ఈసారి వారం ముందే పూర్తవుతోంది. ఇదే విషయాన్ని సాక్షి జూన్‌ 26 నాటి సంచికలో వెల్లడించింది. అక్టోబరు 5 నుంచి 7వ తేదీ మధ్య పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ), అంబర్‌పేట, గోషామహల్, మేడ్చల్‌ యూనిట్లతోపాటు జిల్లాలకు చెందిన అన్ని పీటీసీ, డీటీసీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలందాయి. 

కరోనా కారణంగా.. 
జనవరి 17న రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12వేలమంది సివిల్, ఏఆర్‌ తదితర విభాగాల కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభమైంది. అంతలో కరోనా, లాక్‌డౌన్‌ పరిణామాలతో ముందుజాగ్రత్తగా అధికారులు కేడెట్లను బయటకు అనుమతించలేదు. మార్చి 25 నుంచి ఇప్పటిదాకా అంటే 130 రోజులకుపైగా వీరందరినీ టీఎస్‌పీఏపాటు, జిల్లాల్లోని పీటీసీలకు పరిమితం చేశారు. కేడెట్లకు ఔటింగ్‌ ఇవ్వకపోగా వారిని చూసేందుకు వచ్చే తల్లిదండ్రులు, భార్యాపిల్లలను అనుమతించట్లేదు. చివరిసారిగా కానిస్టేబుల్‌ కేడెట్లకు మార్చి 8, 9 తేదీల్లో సెలవులిచ్చారు. తరువాత లాక్‌డౌన్‌తో ఇవన్నీ రద్దయ్యాయి. మే 4,5,6,7 తేదీల్లో తొలి సెమిస్టర్‌ పరీక్షలు జరిగాయి. షెడ్యూల్‌ ప్రకారం వీరికి మే 8 నుంచి 14 వరకు సెమిస్టర్‌ హాలీడేస్‌ ఇవ్వాలి. కానీ, కరోనా దృష్ట్యా రద్దు చేసి, మే 8 నుంచి రెండో సెమిస్టర్‌ తరగతులు ప్రారంభించారు. దీంతో కోర్సు వారం ముందే పూర్తికానుంది.

టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థుల్లో చిగురిస్తున్న ఆశలు 
వాస్తవానికి ప్రస్తుత కానిస్టేబుల్‌ అభ్యర్థులతోపాటు తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) అభ్యర్థులకూ శిక్షణ ప్రారంభించాలి. ఈసారి భారీగా పోలీసు కానిస్టేబుళ్లను భర్తీ చేయడంతో రాష్ట్రంలో పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీల్లో ఖాళీ లేకుండా పోయింది. దీంతో దాదాపు 4,200 మంది టీఎస్‌ఎస్‌పీ కేడెట్లను ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని భావించినా, సాంకేతిక కారణాలతో వీలుపడలేదు. ఈ క్రమంలో సివిల్, ఏఆర్‌ అభ్యర్థుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ తేదీలు ప్రకటించడంతో టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. త్వరలోనే వీరి శిక్షణ తేదీలు ప్రకటించే అవకాశాలున్నాయి.  

నలుగురు అడిషనల్‌ ఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్‌: పోలీసుశాఖలో అడిషనల్‌ ఎస్పీలు (నాన్‌కేడర్‌)గా విధులు నిర్వర్తిస్తున్న పలువురు అధికారులు బదిలీ అయ్యారు. రా మగుండం అడిషనల్‌ డీసీపీ (ఆపరేషన్స్‌)గా ఉన్న పి.శోభన్‌కుమార్‌ను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అడిషనల్‌ ఎస్పీ (ఆపరేషన్స్‌)గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న కె.సురేశ్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయమన్నారు. వరంగల్‌లో అడిషనల్‌ డీసీపీ (క్రైమ్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌)గా వి.తిరుపతిని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్‌ ఎస్పీ (ఆపరేషన్స్‌)గా బదిలీ చేశారు. అక్కడున్న అట్ల రమణారెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement