
హతురాలు ఎన్ సుధా, నిందితురాలు రాణి
తుమకూరు: హుళియారు పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ సుధా హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమెను హత్య చేయడానికి సహచర కానిస్టేబుల్ రాణినే సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే మంజునాథ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా అతనికి సహకరించిన వ్యక్తి పట్టుబడ్డాడు. కానిస్టేబుల్ రాణితో పాటు నిఖేశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ప్రాణం తీసిన గొడవ
హుళియారు పీఎస్‌లో సుధాతో పాటు రాణి అనే మహిళా కానిస్టేబుల్ కూడా పనిచేస్తోంది. అయితే డ్యూటీ విషయాలతో పాటు సుధా, రాణి ఇద్దరు తరచూ డబ్బుల గురించి గొడవ పడేవారు. ఇద్దరు మూడు నాలుగు సార్లు స్టేషన్‌లోనే తీవ్రంగా రగడ పడినట్లు సమాచారం. దీంతో ఎలాగైనా సుధను అడ్డుతొలగించుకోవాలని రాణి పథకం వేసింది. ఏకంగా సుధకు వరుసకు సోదరుడైన మంజునాథ్‌కు సుపారీ ఇచ్చింది.
దీంతో రాణి వద్ద సుపారీ తీసుకున్న మంజునాథ్ (23), తన స్నేహితుడు నిఖేశ్ (30) సాయంతో సుధను కారులో తీసుకుని పోయి హాసన్ వద్ద హత్య చేసి పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. తరువాత భయాందోళనకు గురైన మంజునాథ్ శివమొగ్గకు చేరుకుని అక్కడ ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కేవీ మూర్తి తెలిపారు.
(చదవండి: ఫోటోలు లీక్, ప్రియుడు ఖతం)
Comments
Please login to add a commentAdd a comment