అనంతపురం శ్రీకంఠంసర్కిల్: జాతీయ రహదారిలో సినీ ఫక్కీలో జరిగిన రూ.2 కోట్ల దారి దోపిడీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. దోపిడీకి పథకం వేసింది ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... ఈనెల 22న ఎస్‌ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన రూ.3 కోట్ల నగదును కొందరు రెండు కార్లలో తీసుకుని బెంగళూరు నుంచి హైదరాబాదు బయలు దేరారు. రూ.కోటి నగదు బ్యాగుతో వెళ్తున్న కారు డ్రైవరు.. కడపకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్‌కు మరొక కారులో తీసుకొస్తున్న రూ.2 కోట్ల నగదు తరలింపుపై సమాచారం చేరవేశాడు.
ఎలాగైనా ఆ సొమ్మును దోపిడీ చేయాలని సదరు కానిస్టేబుల్ పథకం వేశాడు. మరో ఇద్దరు వ్యక్తుల(ఒక కానిస్టేబుల్, మరొక వ్యక్తి)తో కలసి పోలీసు దుస్తుల్లో జాతీయ రహదారి–44లోని గార్లదిన్నె మండలం కలగాసిపల్లి వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచే వాహనాల సమాచారం గురించి రూ.కోటితో వస్తున్న కారు డ్రైవర్‌కు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చాడు.
అప్పటి వరకు వెనుకగా వస్తున్న సదరు డ్రైవర్ గార్లదిన్నె సమీపంలో రూ.2 కోట్లతో వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసేశాడు. కలగాసిపల్లి వద్ద మాటు వేసిన కానిస్టేబుల్ అండ్‌కోకు సంకేతాలు పంపాడు. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న మరొక కారును ఆపి.. తమకందిన సమాచారం, ఆనవాళ్ల ఆధారంగా కారు డిక్కీలో నగదు ఉంచిన బ్యాగును లాగేసుకున్నారు. ప్రశ్నించబోయిన కారులోని వ్యక్తులపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితులు తమ ముందు వెళ్లిపోయిన రూ.కోటి కారులోని వ్యక్తులకు జరిగిన విషయం తెలియజేశారు. అనంతరం గార్లదిన్నె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సీసీ ఫుటేజీతో దర్యాప్తు ముందుకు..
రూ.2 కోట్ల నగదుతో ఉడాయించిన వ్యక్తులు ఇన్నోవా వాహనంలో అనంతపురం వచ్చారు. దోపిడీ చేసే కొన్ని గంటల ముందు అనంతపురం వద్ద వాహనం నంబరు ప్లేట్‌కు స్టిక్కర్ అతికించారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో పోలీసులు పసిగట్టారు. దీంతో చోరీకి తెగబడింది వీరేనన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. స్టిక్కర్ అతికించిన వ్యక్తి జంగిల్ షూ, జంగిల్ ప్యాంట్ ధరించి ఉండటంతో వైఎస్సార్ జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. అనంతరం అతని మొబైల్‌కు వచ్చిన కాల్ డిటైల్స్ పరిశీలించగా.. ఎస్‌ఆర్‌ఆర్ కంపెనీకి చెందిన ఓ డ్రైవరు నంబరుతో ఎక్కువగా సంభాషించినట్లు తెలిసింది.
కాల్ డీటైల్స్‌తో దొరికిపోయిన డ్రైవర్..
బెంగళూరు నుంచి రూ.3 కోట్ల నగదుతో హైదరాబాద్‌కు వెళ్తున్న విషయాన్ని ఎస్‌ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ నిర్వాహకులు దాచిపెట్టారు. దోపిడీకి గురైన రూ.2 కోట్ల గురించి మాత్రమే పోలీసులకు చెప్పారు. మరో రూ.కోటి ముందు వెళ్లిన కారులో తరలించారని దర్యాప్తులో తేలింది. రూ.కోటిని సురక్షితంగా తీసుకెళ్లిన కారు డ్రైవర్‌ను ఆరా తీయగా... ప్రస్తుతం తాను కళ్లకలక వల్ల డ్యూటీకి వెళ్లడం లేదని బుకాయించాడు.
అయితే అతడి సెల్‌ఫోన్ నుంచి వైఎస్సార్ జిల్లా ఏఆర్ కానిస్టేబుల్‌కు కాల్స్ వెళ్లినట్లు తేలడంతో.. అతడిని అదుపులోకి తీసుకున్నాడు. దోపిడీలో పాలుపంచుకున్న మరొక కానిస్టేబుల్, ఇంకొక నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దోపిడీ అయిన సొమ్ములో కొంతమేర మాత్రమే రికవరీ చేసినట్లు సమాచారం. నిందితుల అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment