అంతా మా ఇష్టం! | Telangana Police Over Actions In Karimnagar | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం!

Published Wed, May 8 2019 7:39 AM | Last Updated on Wed, May 8 2019 7:53 AM

Telangana Police Over Actions In Karimnagar - Sakshi

‘వేములవాడ సర్కిల్‌ పరిధిలోని ఓ మండలంలో ఎస్సై మోడల్‌ గ్రంథాలయం నిర్మాణం కోసం చందాల పేరుతో రూ.లక్షలు వసూలు చేశాడు. అక్కడ గ్రంథాలయం ఏర్పాటైంది కానీ ఎస్సై వసూలు చేసిన డబ్బులతో కాదు... మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు రూ.20 లక్షలు ఇవ్వడంతో..’ ‘మంథని సర్కిల్‌ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు, అమరవీరుల స్తూపం నిర్మాణం కోసం ఇక్కడి పోలీస్‌ అధికారి వ్యాపారుల నుంచి రూ.లక్షలు వసూలు చేశాడు. సదరు అధికారి చేసిన ఘనకార్యాల గురించి అక్కడి వ్యాపారులు డీజీపీని కూడా ఆశ్రయించారు’

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో కొందరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు తమకున్న విశేష అధికారాలను ఉపయోగించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతోనో... లేక డిపార్ట్‌మెంట్‌లోని ఉన్నతాధికారితోనో మంచి సంబంధాలు కొనసాగించి ఆయా స్టేషన్లలో ఉన్నన్నాళ్లూ నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చనే ధోరణితో ఖాకీలు వ్యవహరిస్తున్నారు. రియల్టర్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో ఆర్థిక లావాదేవీలు నడుపుతూ చేతిలో అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకునే పనిలో ఉన్న ఖాకీలు కరీంనగర్‌ పాత జిల్లాలో అనేక మందే ఉన్నారు.

ఈ నెల 4న మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో కాంట్రాక్టర్‌ ‘రవన్న’ బర్త్‌డే ఉత్సవాలు ఘనంగా జరపడం వెనుక కూడా ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి. గతంలో సుల్తానాబాద్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తించినప్పుడు కూడా పలు వివాదాలకు కారణమైన చరిత్ర సదరు అధికారిది. అలాగే కాళేశ్వరంలో బంధువులతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు స్థానిక గ్రామస్తులతో జరిగిన గొడవలో తన ఐడెంటిటీని చూపించేందుకు సర్వీస్‌ రివాల్వర్‌తో భయపెట్టిన ఘనుడు ఆయన. ఉన్నతాధికారులతో సంబంధాలు కొనసాగించడం వల్ల తనకేం కాదనే ధీమాతో ఉన్న కొందరు పోలీసులు వివాదాలకు కారణం అవుతున్నారనడంలో సందేహం లేదు. మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో ప్రైవేటు వ్యక్తికి బర్త్‌డే వేడుకలు జరిపిన సీఐ ఇంద్రసేనారెడ్డిని కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్‌ రూరల్‌ సీఐ సంతోష్‌కుమార్‌కు మానకొండూరు బాధ్యతలు అప్పగించారు.
 
రియల్టర్లు... కాంట్రాక్టర్లు... అక్రమార్కులతో బంధాలు
కరీంనగర్‌ శివార్లతోపాటు కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో రియల్‌ వెంచర్లు సాగుతున్నాయి. దీంతో పోలీస్‌ అధికారులతో సంబంధాలు సర్వసాధారణంగా మారాయి. ఈ బంధంతో రియల్‌ వెంచర్లలో భాగస్వాములుగా మారిన పోలీసు అధికారులు కూడా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలి కాలంలో వేరే జిల్లాల్లో వెంచర్లు చేస్తున్న రియల్టర్లకు పెట్టుబడి సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో ఉన్న సంబంధాలతో సెటిల్‌మెంట్లు కూడా కొందరు ఖాకీలకు సాధారణ అంశాలుగా మారాయి. ఏఎస్సై మోహన్‌రెడ్డి రియల్‌ దందా, సెటిల్‌మెంట్లు తరువాత చోటుచేసుకున్న పరిణామాలు కరీంనగర్‌లోనే గాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఓ ఏఎస్సై కోట్లకు పడగలెత్తిన తీరు ఖాకీలకు, అక్రమ దందాలు సాగించే వారికి మధ్యనున్న బంధాన్ని తేటతెల్లం చేసింది. ఆయన స్థాయిలో కాకపోయినా... ఉమ్మడి జిల్లాలో పలువురు పోలీస్‌ అధికా>రులు బినామీలుగా సొంత దందాలు సాగిస్తున్నారనేది నిర్వివాదాంశం. సివిల్‌ దందాల్లో జోక్యం చేసుకొని శాఖాపరమైన చర్యలను ఎదుర్కొన్న పోలీసులు కూడా జిల్లాలో ఉన్నారు. అలాగే రాజకీయ ప్రముఖులు, అక్రమార్కులతో కూడా పలువురు పోలీసులకు సంబంధాలు అందరికీ తెలిసిన సత్యాలే.

గతంలో చోటు చేసుకున్నకొన్ని సంఘటనలు...

  • పెద్దపల్లి జిల్లా కమన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కొన్ని నెలల క్రితం ఎస్సై, ఇతర సిబ్బంది ఒకరినొకరు దూషించుకుని తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 
  • పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌ ఎన్నికలు, హోలీ సందర్భంగా కిందిస్థాయి సిబ్బంది పలువురు నుంచి మామూళ్లు వసూలు చేసి వాటా పంపకాల విషయంలో గొడవకు దిగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 
  • ఓ భూ సమస్యపై వీణవంక ఎస్సై విచారణ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన ముదిగంటి నర్సింహరెడ్డి వీడియో తీస్తున్నాడనే నేపంతో చితకబాదడంతో యువకుడు తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. 
  • హుజూరాబాద్‌ డివిజన్‌లో ఓ సీఐ భార్యాభర్తల పంచాయతీని సెటిల్‌ చేసి వారి నుంచి సుమారు రెండు లక్షలకు పైగా వసూలు చేశారని ప్రచారంలో ఉంది. ఉన్నతాధికారులు విచారించగా రాజకీయ ఒత్తిడితో చర్యలు తీసుకోలేదని సమాచారం. 
  • ఆర్థిక లావాదేవిలకు సంబంధించిన ఓ అనే వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించి చితకబాదిన హుజూరాబాద్‌ ఎస్సైపై బాధితులు సీపీకి ఫిర్యాదు చేశారు. అదే ఎస్సై ఓ కేసు విషయంలో నిర్లక్ష్యం చేయడంతో సదరు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.
  • కోరుట్లలో పనిచేసిన ఓ ఎస్సైని నెలరోజుల క్రితం అవినీతి ఆరోపణలపై కుమురంభీం జిల్లాకు బదిలీ చేశారు. 
  • ఓ కేసు విషయంలో ఒక వర్గం నుంచి డబ్బులు తీసుకున్నడన్న ఆరోపణలతో కొద్ది రోజుల క్రితం గంగాధర ఎస్సైని రెండు నెలల క్రితం హెడ్‌క్వార్టర్‌కు అటాచ్డ్‌ చేశారు. 
  • తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీలో గతంలో పనిచేసిన ఓ ఎస్సై ఇసుక అక్రమ రవాణాదారులకు సహకరించారన్న ఆరోపణలతో కుమురంభీం జిల్లాకు బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేసిన మరో ఎస్సై కూడా అవినీతి ఆరోపణలతోనే బదిలీ అయ్యాడు. 
  • మెట్‌పల్లి సబ్‌డివిజన్‌ పరిధిలోని దాదాపు అన్ని పోలీస్‌స్టేషన్లలో ఇసుక దందా నుంచి రూ.లక్షల్లో మామూళ్లు ముడుతున్నాయి. 
  • పెద్దపల్లి జిల్లాలో జరిగే ఇసుక దందాలు, ఇటుక బట్టీలు, రైస్‌మిల్లుల యజమానులతో కూడా పోలీసులకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. 
  • మంథనిలో అక్రమార్కులతో పోలీసు సంబంధాల గురించి రామగుండం కమిషనరేట్‌కు, డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదుల రూపంలో ఇప్పటికే చేరాయి.  
  • ఇటీవల మానకొండూరుకు ఎన్నికల విధులకు వచ్చిన ఓ ప్రొబేషనరీ ఎస్సై రాత్రి పార్టీ చేసుకొని ఇంటికొచ్చిన ఇద్దరు వ్యక్తులను తీవ్రంగా కొట్టాడు. అందులో ఒక వ్యక్తి అపోలో రీచ్‌లో జాయిన్‌ అయి చికిత్స పొందగా, పోలీసులు రూ.50వేలు విదిలించుకోవాల్సి వచ్చింది. 
  • కానిస్టేబుళ్లు, హోంగార్డు స్థాయిల్లో పలువురిపై వేటు పడింది. కానీ రాజకీయ, ఉన్నతాధికారుల అండదండలు ఉన్నవారు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement