సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి.. మార్కులను లెక్కించి, మళ్లీ ఫలితాలు వెల్లడించాలని రాష్ట్ర పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. 122, 130, 144వ నంబర్ ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57వ ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని తొలగించాలని తేల్చిచెప్పింది. 2022, ఆగస్టు 30న జరిగిన కానిస్టేబుల్ నియామక తుది రాత పరీక్షలో 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు వినతిపత్రం సమర్పించినా ఎలాంటి బదులివ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్లు తెలిపారు.
తప్పుగా రూపొందించిన ప్రశ్నలు, ఇచ్చిన తప్పు సమాధానాలను తొలగించాలని కోరడంతో పాటు తెలుగులోకి అనువదించని కొన్ని ప్రశ్నలను సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు రమేశ్ చిల్ల, ఎన్‌ఎస్ అర్జున్ వాదనలు వినిపించారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేసిన న్యాయమూర్తి.. సోమవారం తీర్పు వెలువరించారు.
‘పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో 4 ప్రశ్నలను మినహాయించి, అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు ఇవ్వాలని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుని ఆదేశిస్తున్నాం. పేపర్‌లను మూల్యాంకనం చేసి, ఆ తర్వాత ఫలితాలను ప్రచురించి, తదుపరి నియామక ప్రక్రియ కొనసాగించాలి’అని తీర్పులో పేర్కొన్నారు.
కానిస్టేబుల్ అభ్యర్థుల్లోనూ గందరగోళం....
కానిస్టేబుల్ నియామక పరీక్షల తుది ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గత బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. 15,750 మంది పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. అయి తే తాజా తీర్పు మళ్లీ ఫలితాలు వెల్లడించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే విడుదలైన ఫలితాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థుల్లో ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. నాలుగు మార్కులు కలిపి మళ్లీ ఫలితాలు వెల్లడిస్తే ఉద్యోగాలు ఉంటాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే గ్రూప్–1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దు కాగా, ఇప్పుడు కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు మళ్లీ వెల్లడించే అవకాశం రావడంతో నియామక బోర్డుల తీరుపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ ప్రకటించండి
Published Tue, Oct 10 2023 5:05 AM | Last Updated on Tue, Oct 10 2023 12:51 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment