కర్నూలు: ఆలూరు సర్కిల్ పరిధిలోని ఆస్పరి పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విజయకుమార్ (పీసీ 2910)పై సస్పెన్షన్ వేటు పడింది. నకిలీ నోట్ల పేరుతో చీటింగ్ చేస్తున్న ముఠాతో చేతులు కలిపి భారీగా డబ్బులు వసూలు చేశాడన్న ఫిర్యాదు నేపథ్యంలో పోలీస్ ‘బాస్’ విచారణ జరిపించారు.
కై రుప్పల, ములుగుందం, కారుమంచి, ఆస్పరి, ఆలూరు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఆయా ప్రాంతాల్లోని ప్రముఖుల నుంచి దాదాపు రూ.30 లక్షల దాకా డబ్బులు దండుకున్నట్లు బాధితుల్లో ఒకరైన కారుమంచి గ్రామానికి చెందిన అంజనయ్యతో పాటు మరికొంతమంది స్వయంగా ఎస్పీ కృష్ణకాంత్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కానిస్టేబుల్‌ను విచారణలో భాగంగా మొదట వీఆర్‌కు రప్పించి ఆ తర్వాత శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
బళ్లారి ముఠాతో చేతులు కలిపి...
లక్ష అసలు నోట్లకు మూడు లక్షలు నకిలీ నోట్లు (ఫేక్ కరెన్సీ) ఇస్తామని నమ్మబలికి బళ్లారికి చెందిన ఓ అజ్ఞాత వ్యక్తితో కానిస్టేబుల్ విజయకుమార్ చేతులు కలిపి భారీగా వసూలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వెంగలాయదొడ్డి గ్రామానికి చెందిన ఎరువుల వ్యాపారి ఒకరు బళ్లారిలో స్థిరపడ్డారు. దొంగనోట్ల పేరుతో చీటింగ్‌కు పాల్పడుతున్న ఈ ముఠా వెనుక అతని హస్తం ప్రధానంగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అరెస్టుకు రంగం సిద్ధం...
కానిస్టేబుల్ విజయకుమార్‌పై ఆస్పరి పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఆదోని డీఎస్పీ శివనారాయణస్వామి పర్యవేక్షణలో ఆలూరు సీఐ వెంకటేశ్వర్లు ఈ కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. పనిచేస్తున్న స్టేషన్‌లోనే కానిస్టేబుల్‌పై చీటింగ్ కేసు నమోదు కావడం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు 50 మందికి పైగా కానిస్టేబుల్ చేతిలో మోసపోయినట్లు సమాచారం. దీంతో ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపేందుకు రంగం సిద్ధమైంది. కాగా మోసం చేసిన వారిలో విజయకుమార్‌తో పాటు ఇద్దరు తెలియని వ్యక్తులు కూడా ఉన్నారని, విచారణ కొనసాగుతుందని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన ప్రకటనలు చూసి నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment