విజయనగరం: ‘ఏం కష్టం వచ్చిందో ఏమో.. కనీసం ఎవరితో చెప్పుకోలేదు.. అటు స్నేహితులకుగాని ఇటు కుటుంబ సభ్యులకుగానీ ఎవరికీ తెలియదు... అర్థరాత్రి వరకు స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడాడు. అంతలోనే ఏమైందో తెలియదుగానీ లోకాన్ని విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.. తన గదిలో ఉరి వేసుకుని సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.’ అధికారులు ద్వారా విషయం తెలుసుకున్న భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పట్టణంలోని రుంకానవీధికి చెందిన సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ దాసరి నాగేశ్వరరావు ఢిల్లీలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలచివేసింది.
ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, బంధువులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు నాగేశ్వరరావు ఢిల్లీలో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం అర్థరాత్రి ఢిల్లీలోని తన క్వార్టర్స్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2017లో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన నాగేశ్వరరావుకు రేణుకతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. మూడేళ్ల పాప ఉండగా, భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. నెల రోజుల సెలవు కోసం ఇటీవల కుటుంబంతో చీపురుపల్లి వచ్చాడు. సెలవులు పూర్తవ్వడంతో వారం క్రితమే నాగేశ్వరరావు భార్య, పాపను చీపురుపల్లిలోనే ఉంచి విధులకు ఢిల్లీ వెళ్లాడు.
త్వరలో పాప పుట్టినరోజు ఉండడంతో భార్య, కుమార్తెను చీపురుపల్లిలో ఉంచి, ఆ సమయానికి తిరిగి రావాలనుకునే విధులకు వెళ్లాడు. కానీ ఏం జరిగిందో తెలియదుగానీ ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం అర్థరాత్రి ఆత్మహత్యకు పాల్పడగా మంగళవారం ఉదయం విధుల్లోకి రాకపోవడంతో అక్కడి అధికారులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
దీంతో మృతుడు అన్నయ్య మన్మధరావు, స్థానిక ఎంపీటీసీ ముల్లు పైడిరాజు ఢిల్లీ వెళ్లారు. అక్కడ నుంచి మృతదేహాన్ని విమానంలో చీపురుపల్లి తీసుకొస్తున్నారు. గురువారం చీపురుపల్లిలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు జరగనున్నాయని ముల్లు పైడిరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment