cisf Constable
-
విమానంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై మహిళ దాడి
ముంబై: విమానంలో ఓ మహిళ.. తోటి ఇద్దరు ప్రయాణికులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగపడ్డారు. ఈ ఘటన శనివారం పుణెలోని లోహెగావ్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. ఉదయం 7. 45 గంటలకు పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరే.. ఓ ప్రైవేటు విమానంలో బోర్డింగ్ ప్రాసెస్ సమయంలో ఓ మహిళ దాడికి తెడపడ్డారు. మొదట ఆ మహిళ ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విమాన సిబ్బంది, సీఐఎస్ఎఫ్ కానిస్టెబుల్స్ ఆమె వద్దకు వచ్చారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయి.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడి చేసింది. అనంతరం ఆ మహిళను, ఆమె భర్తను విమానం నుంచి దింపేశారు. ఆ మహిళను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేశారు.సీనియర్ ఇన్స్పెక్టర్ అజయ్ సంకేశ్వరి మాట్లాడుతూ.. విచారణ కోసం సదరు మహిళకు నోటీసు ఇచ్చి విడిచిపెట్టాం. ఎయిర్‌లైన్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది,సహ ప్రయాణీకులు వాంగ్మూలాలను రికార్డు చేశాం’ అని చెప్పారు. వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె తీవ్రమైన బాధలో ఉన్నట్లు గమనించామని, అందుకే ఆమె తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారని ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు. -
తలలోకి బుల్లెట్లు చొచ్చుకుపోయి.. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరులోని బీడీఎల్ కంపెనీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో బస్సులో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి మృతిచెందాడు. సీఐఎస్‌ఎఫ్‌ఎస్ యూనిట్ లైన్ బ్యారెక్‌లో బస్సు దిగే క్రమంలో అతని వద్ద ఉన్న ఇన్సస్ రైఫిల్ పేలి తూటా తలలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడిని నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన జవాను వెంకటేష్‌గా గుర్తించారు. కాగా వెంకటేష్ ఏడాదిన్నర క్రితం ట్రాన్స్ ఫర్ కింద హైదరాబాద్ వచ్చి సీఐఎస్ఎఫ్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య లక్ష్మీదేవి, తొమ్మిదేళ్ల కొడుకు సాయి, ఎనిమిదేళ్ల పాప సాయి పల్లవి ఉన్నారు. తుపాకీ పేలిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
ఎంపీని కానిస్టేబుల్ కొట్టడం దేనికి సంకేతం?
హిమాచల్ ప్రదేశ్ మండీ లోక్ సభ స్థానం నుండి నూతనంగా ఎన్నికైన ప్రముఖ సినీ తార కంగనా రనౌత్‌ను చండీగఢ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ విధులను నిర్వహిస్తున్న కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెంప మీద కొట్టడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎందుకు కొట్టావు అని సదరు ఎంపీ అడిగినప్పుడు రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు ఈ చెంప దెబ్బ అని దురుసుగా సమాధానం చెప్పడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఆ కానిస్టేబుల్ సోదరుడు కిసాన్ మజ్దూర్ సంఘ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడం, ఆమ్ ఆద్మీ సపోర్టుగా ఉండడం బట్టి చూస్తే– కంగనా రనౌత్‌పై దాడి యాదృచ్చికంగా జరిగింది కాదనీ, ఇది ఒక ప్రణాళికా బద్ధంగానే జరిగిందనే భావన కలుగక మానదు. నూతనంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సమగ్రమైన విచారణ జరిపి, దేశ ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమం పేరుతో రైతుల ముసుగులో ఖలిస్థాన్ వేర్పాటు వాదుల మద్దతుదారులు రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండాను ఎగరవేయడం, శాంతి భద్రతలను పరిరక్షించడానికి వచ్చిన అనేకమంది పోలీసుల తలలు పగలగొట్టడం వంటి దృశ్యాలు దేశ ప్రజల స్మృతి పథంలో ఇప్పటికీ స్థిరంగానే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రతిపక్షాలు తమ రాజకీయ స్వార్థం కోసం రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమకారులను రెచ్చగొడుతున్నాయనీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో అనేక చోట్ల హింస చెలరేగి శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందనీ నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు సందర్భోచితంగా సంయమనం పాటించారు. దీంతో దేశానికి పెద్ద ముప్పే తప్పింది.ప్రభుత్వ విధానాలపైనా, దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలూ, ఉద్యమాలపైనా అనేకమంది వ్యతిరేకంగా, అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాగే ఒక పౌరురాలిగా కంగనా కూడా రైతు ఉద్యమంపై వ్యాఖ్య చేశారు. ఈ చెంప దెబ్బ ఆ వ్యాఖ్యలు చేసినందుకే కొట్టానని కౌర్ చెప్పిన సమాధానం నమ్మశక్యంగా లేదు. సిక్కు తీవ్రవాద భావాలు కుల్విందర్ కౌర్ మనసులో ఎవరైనా నాటి ఉండవచ్చునేమో! ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు? 1984 అక్టోబర్ 31న భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని కాల్చి చంపిన ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లు సిక్కులు అనే విషయం మరవకూడదు. నాడు వారు ‘ఖలిస్థాన్’ వేర్పాటు వాద భావజాలాన్ని తలకెక్కించుకుని ఆ ఘాతుకానికి ఒడిగట్టారు.సిక్కు వేర్పాటు వాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023 జూన్ 18న కెనడాలో హత్యకు గురైన తర్వాత, కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలలో ఖలిస్థాన్ వేర్పాటు వాదుల మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో... నిజర్ హత్య వెనుక భారత ప్రభుత్వ నిఘా వర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా అమెరికా దౌత్యవేత్తలు మాట్లాడడం, భారత ప్రభుత్వం ఇందుకు ఆధారాలు చూపించాలని కౌంటర్ వేయడం వంటి వాటి నేపథ్యంలో ఈ సంఘటనను పరిశీలించాలి. ఉల్లి బాల రంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
కంగనను చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్‌కు జాబ్ ఆఫర్
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చండీగఢ్ ఎయిర్‌పోర్టులో ఓ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. తాజాగా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌కు గాయకుడు విశాల్ దద్లానీ మద్దతుగా నిలిచాడు. అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ఆమెపై ఏదైనా చర్య తీసుకుంటే..కానిస్టేబుల్‌కి తాను ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నేను హింసను ఎప్పుడూ సమర్ధించను. కానీ మహిళా కానిస్టేబుల్ కోపాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఒకవేళ ఆ అమ్మాయిపై ఏదైనా చర్య తీసుకుంటే.. అలాగే ఆమె ఉద్యోగం పోతే నేను జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. జై హింద్.. జై జవాన్ జై కిసాన్ అంటూ తన పోస్ట్ లో తెలిపారు. కాగా గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ధర్నాపై.. కంగనా అనుచిత చేసిన వ్యాఖ్యలను గానూ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్.. చండీగఢ్ నుంచి ఢీల్లీ వెళ్తుండగా ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో నటి చెంప చెళ్లుమనిపించారు. ఆ ధర్నాలో తన తల్లి కూడా ఉందని, రైతులను అవమానించినందుకే తాను ఈపని చేసినట్లు కానిస్టేబుల్ తెలిపారు. అయితే కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను అధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆమెపై విచారణ జరుగుతోంది. -
‘నా తల్లి కోసం ఇలాంటి వెయ్యి ఉద్యోగాలైనా కోల్పోతా’ : కుల్విందర్ కౌర్
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను కొట్టినందుకు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ సస్పెండ్ అయ్యారు. అయితే, తాజా పరిణామాలపై కుల్విందర్ కౌర్ స్పందించారు. ఈ ఉద్యోగం పోతుందనే భయం లేదు.. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా తల్లి గౌరవం కోసం అలాంటి వేలాది ఉద్యోగాలను కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు.కంగనా రనౌత్ గతంలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ధర్నా చేసిన వారిలో తన తల్లి కూడా ఉందంటూ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్.. చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న కంగనాను చెంప దెబ్బకొట్టింది. రైతులను అగౌరపరించినందుకు తాను ఈ పనిచేసినట్లు కుల్విందర్ కౌర్ చెప్పారు. ఈ ఘనటపై కొన్ని గంటల్లోనే ఆమె సస్పెండ్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. ఈ ఉదయం పోలీసులు కుల్విందర్ కౌర్‌ను అరెస్ట్ అయ్యారు. కాగా, కంగనాపై చేయి చేసుకున్న కుల్విందర్ కౌర్‌కు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ అండగా నిలిచారు. ఆమె ఒప్పుకుంటే ఆమెకు తగిన ఉద్యోగం ఇస్తామని తెలిపారు. అంతేకాదు ఎవరైనా మీ తల్లి రూ.100కే అందుబాటులో ఉందని కామెంట్ చేస్తే మీరేం చేస్తారు? అని ప్రశ్నించారు. मुझे नौकरी की फिक्र नहीं है,मां की इज्जत पर ऐसी हजारों नौकरियां कुर्बान है- कुलविंदर कौर— Kulvinder Kaur (@Kul_winderKaur) June 7, 2024 -
కంగనాను కొట్టిన మహిళకు బంపరాఫర్.. ప్రముఖ సింగర్ పోస్ట్ వైరల్!
ఇప్పుడు దేశవ్యాప్తంగా నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పైనే ఉంది. తాజాగా ఆమెపై సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారిపోయింది. కంగనా ఎంపీగా గెలవడంతో చెంపదెబ్బ కొట్టిన మహిళా ఉద్యోగిని ఇప్పటికే సస్పెండ్ చేశారు. అయితే రైతుల ధర్నాను ఉద్దేశించి కంగనా గతంలో కామెంట్స్ చేసినందుకే తాను కొట్టినట్లు సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ వెల్లడించింది. ఇదే విషయాన్ని కంగనా కూడా అంగీకరించింది. ఆ తర్వాత ఈ ఘటనపై కంగనా మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను సురక్షితంగానే ఉన్నానని, అయితే పంజాబ్‌లో పెరిగిపోతున్న ఉగ్రవాదులను ఏం చేయాలో అర్థం కావడం లేదని వీడియో రిలీజ్ చేసింది. ఈ ఘటనపై అధికారులు మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాబ్ ఇస్తానని హామీతాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ స్పందించాడు. కంగనాపై చేయి చేసుకున్న ఆ యువతికి అతడు మద్దతుగా నిలిచాడు. కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన కుల్విందర్ కౌర్‌కు తాను ఉద్యోగం కల్పిస్తానని సింగర్ విశాల్ దద్లానీ హామీ ఇచ్చాడు. ఆమెతో తనకు ఒప్పుకుంటే తగిన ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. తాను హింసకు ఎప్పుడూ మద్దతు ఇవ్వను.. కానీ ఆమె కోపాన్ని నేను కచ్చితంగా అర్థం చేసుకున్నానని తెలిపారు. సీఐఎస్ఎఫ్ ఆమెపై చర్యలు తీసుకున్నట్లయితే.. తనకు ఉద్యోగం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నా.. జై హింద్. జై జవాన్. జై కిసాన్ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఎవరైనా మీ మదర్ రూ.100కు అందుబాటులో ఉందని కామెంట్ చేస్తే నువ్వు ఏం చేస్తావ్? ఆయన ప్రశ్నించారు. గతంలో కంగనా రైతుల ధర్నాను ఉద్దేశించి రూ.100 కోసం వచ్చారంటూ కామెంట్స్ చేసింది. ఒకప్పుడు బిల్కిస్ బానో విషయంలోనూ కంగనా చేసిన పోస్టును షేర్ చేశాడు. -
కంగనకు కానిస్టేబుల్ చెంపదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం చండీగఢ్ విమానాశ్రయానికి వచ్చిన బాలీవుడ్ నటి, మండీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ అనూహ్య ఘటనపై కంగనా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్‌ను పూర్తిచేసుకుని లోపలికి వెళ్తుంటే మహిళా కానిస్టేబుల్ హఠాత్తుగా ఎదురొచ్చి చెంప చెళ్లుమనిపించింది. తర్వాత దూషించింది. ఎందుకని అడిగితే రైతులకు మద్దతుగా ఆ పని చేశా అని చెప్పింది. పంజాబ్‌లో ఉగ్ర, హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి’’ అని కంగనా అన్నారు. ఢిల్లీకి చేరుకున్నాక సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌ను కలిసి జరిగింది వివరించారు.కానిస్టేబుల్ వాదనేంటి?చెంపదెబ్బ కొట్టాక అక్కడే కొద్దిసేపు ఉన్న కానిస్టేబుల్ అక్కడ వారితో.. ‘‘ నాలుగేళ్ల క్రితం వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దుచేయాలంటూ ఆందోళన బాటపట్టిన వేలాది మంది రైతులను కించపరుస్తూ వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేసినందుకే కంగనను కొట్టా. ఆనాడు ఢిల్లీలో బైఠాయించిన మహిళా రైతులను చూపిస్తూ వీళ్లంతా కేవలం రూ.100 కోసం ధర్నాలో పాల్గొన్నారు అని కంగనా కించపరిచారు. ఆనాడు ధర్నా చేస్తున్న వాళ్లలో మా అమ్మ కూడా ఉంది. మాది రైతు కుటుంబం. మా అన్న కూడా రైతు. కంగనా అలాగే రోడ్డుపై కూర్చొని ధర్నా చేయగలదా?’’ అని ఆవేశంగా మాట్లాడారు. -
'అమ్మా.. ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను.. నీతోనే ఉంటానని' అనంత లోకాలకు
కరీంనగర్: ‘అమ్మ.. ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. ఇక నీతోనే ఉంటాను..’ అని చెప్పిన ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అనంతలోకాలకు వెళ్లాడు. రాజస్థాన్ డియోలి సీఐఎస్ఎఫ్ 16వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం జగ్గారావుపల్లికి చెందిన కానిస్టేబుల్ చాడ శివకుమార్(23) జైపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. గ్రామస్తులు, కుటంబసభ్యులు తెలిపిన వివరాలు. జగ్గారావుపల్లికి చెందిన చాడ భాగ్యమ్మ–గోపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు గంగారెడ్డి సిరిసిల్లలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండో కుమారుడు శివకుమార్ రెండేళ్ల క్రితం సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికై రాజస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గత డిసెంబర్ 16న కార్యాలయ పరిసరాల్లో శివకుమార్ ప్రమాదవశాత్తు కింద పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. తోటి ఉద్యోగులు జైపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. తలకు బలమైన గాయం కావడంతో రక్తం గడ్డ కట్టి శివకుమార్ కోమాలోకి వెళ్లాడు. చికిత్స పొందుతున్న శివకుమార్ సోమవారం మృతిచెందినట్లు జగ్గారావుపల్లి లోని కుటుంబ సభ్యులకు అక్కడి ఉద్యోగులు సమాచారం అందించారు. కొత్త సంవత్సరం రోజు గ్రామంలో విషాదం.. నూతన సంవత్సరం తొలి రోజే గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శివకుమార్ మృతిచెందడంతో జగ్గారావుపల్లిలో విషాదం నెలకొంది. కానిస్టేబుల్‌గా ఎంపికై న శివకుమార్ పోస్టింగ్ వస్తే జిల్లాకు వచ్చేవాడు. కానీ కానిస్టేబుల్ ఫలితాలపై కోర్టులో కేసు ఉండడంతో పోస్టింగ్‌లు ఆగిన విషయం తెలిసిందే. శివకుమార్ మృతితో అతని స్నేహితులు, కుటుంబసభ్యులు విషన్నవదనంలో ఉన్నారు. మంగళవారం మృతదేహం స్వగ్రామానికి వస్తుందని తెలిపారు. ఇవి చదవండి: నా ఆత్మహత్యకు ఆ ముగ్గురే కారణం! -
ఏం కష్టం వచ్చిందో ఏమో... అప్పటి వరకు స్నేహితులతో మాట్లాడి..
విజయనగరం: ‘ఏం కష్టం వచ్చిందో ఏమో.. కనీసం ఎవరితో చెప్పుకోలేదు.. అటు స్నేహితులకుగాని ఇటు కుటుంబ సభ్యులకుగానీ ఎవరికీ తెలియదు... అర్థరాత్రి వరకు స్నేహితులతో ఫోన్లో మాట్లాడాడు. అంతలోనే ఏమైందో తెలియదుగానీ లోకాన్ని విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.. తన గదిలో ఉరి వేసుకుని సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.’ అధికారులు ద్వారా విషయం తెలుసుకున్న భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పట్టణంలోని రుంకానవీధికి చెందిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ దాసరి నాగేశ్వరరావు ఢిల్లీలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలచివేసింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, బంధువులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు నాగేశ్వరరావు ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం అర్థరాత్రి ఢిల్లీలోని తన క్వార్టర్స్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2017లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన నాగేశ్వరరావుకు రేణుకతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. మూడేళ్ల పాప ఉండగా, భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. నెల రోజుల సెలవు కోసం ఇటీవల కుటుంబంతో చీపురుపల్లి వచ్చాడు. సెలవులు పూర్తవ్వడంతో వారం క్రితమే నాగేశ్వరరావు భార్య, పాపను చీపురుపల్లిలోనే ఉంచి విధులకు ఢిల్లీ వెళ్లాడు. త్వరలో పాప పుట్టినరోజు ఉండడంతో భార్య, కుమార్తెను చీపురుపల్లిలో ఉంచి, ఆ సమయానికి తిరిగి రావాలనుకునే విధులకు వెళ్లాడు. కానీ ఏం జరిగిందో తెలియదుగానీ ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం అర్థరాత్రి ఆత్మహత్యకు పాల్పడగా మంగళవారం ఉదయం విధుల్లోకి రాకపోవడంతో అక్కడి అధికారులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతుడు అన్నయ్య మన్మధరావు, స్థానిక ఎంపీటీసీ ముల్లు పైడిరాజు ఢిల్లీ వెళ్లారు. అక్కడ నుంచి మృతదేహాన్ని విమానంలో చీపురుపల్లి తీసుకొస్తున్నారు. గురువారం చీపురుపల్లిలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు జరగనున్నాయని ముల్లు పైడిరాజు తెలిపారు. -
హానీట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం పాక్ చేతిలోకి?
సాక్షి, విశాఖపట్నం: పాకిస్తాన్ ఎప్పటిలానే తన కపట బుద్దిని ప్రదర్శిస్తోంది. భారత అంతర్గత వ్యవహారాలను తెలుసుకునేందుకు ఉద్యోగులపై హానీ ట్రాప్ వల విసురుతోంది. తాజాగా పాక్ హానీ ట్రాప్‌లో ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చిక్కుకున్నాడు. అనుమానం రావడంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ జగదీష్ భాయ్ మురారీ పని చేస్తున్నాడు. అంతకు ముందు రక్షణ రంగంలో కీలకమైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహించేవాడు. దీంతో అతని నుంచి కీలక సమాచారం తెలుసుకునే క్రమంలో పాకిస్తాన్ అతనిపై హనీట్రాప్ ప్లాన్‌ని ప్రయోగించింది. ఓ ఉగ్రవాద సంస్థకి చెందిన పెద్ద నాయకుడి పీ.ఏకి తమిషా అనే పాకిస్తాన్ యువతితో పరిచయం ఉంది. ఆ యువతితో సోషల్ మీడియా ద్వారా కపిల్‌తో పరిచయం పెంచుకుంది. రెండేళ్ల పాటు ట్రాప్ చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టింది. న్యూడ్ వీడియో కాల్స్‌తో మొదలై.. రహస్యంగా ఓ గదిలో కలిసేంత వరకు వీరి కథ నడిచింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కపిల్ కుమార్ కదలికలపై ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా కపిల్ కుమార్ ఏడాది క్రితం హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి విశాఖలో పని చేస్తున్నాడు. కీలక సమాచారం పాకిస్థాన్ గూఢచార సంస్థకు చేరినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. కపిల్ కుమార్ మొబైల్స్ స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ ఫోరెన్సిక్ విచారణకు పంపింది. తదుపరి విచారణ కోరుతూ స్టీల్ ప్లాంట్ పోలీసు స్టేషన్లో సీఐఎస్ఎఫ్ యూనిట్ ఇన్ఛార్జ్ ఫిర్యాదు చేశారు. అధికారిక రహస్యాల ఉల్లంఘన నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ అంశం అంతరంగిక భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో వివిధ ఏజెన్సీలు దర్యాప్తులోకి దిగాయి. చదవండి వచ్చినవాడు గద్దర్.. ఆ హెడింగ్ చూసి ఆశ్చర్యపోయాం! -
గుండెపోటుతో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి
కర్లపాలెం (బాపట్ల): జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామానికి చెందిన రాయపూడి గోపి (27) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు రాంచీ నుంచి ఉన్నతాధికారులు తెలపడంతో మృతుడి కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. చింతాయపాలెం గ్రామానికి చెందిన రాయపూడి వెంకటరావు, రమాదేవి దంపతుల పెద్ద కుమారుడు రాయపూడి గోపీ 2017 మార్చి నెలలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికై రాజస్థాన్‌లో శిక్షణ పూర్తి చేసుకుని, జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఎన్టీపీసీ సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. గోపీ బుధవారం రాత్రి 10 గంటలకు తమకు ఫోన్ చేసి మామూలుగానే మాట్లాడాడని, 9 గంటలకు డ్యూటీకి వచ్చినట్లు చెప్పాడని తల్లిదండ్రులు తెలిపారు. 10.45 గంటలకు రాంచీ నుంచి అధికారులు ఫోన్‌చేసి గోపీకి సుస్తీ చేయడంతో ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని, ఫోన్ చేశారని, 11.45 గంటలకు మళ్లీ ఫోన్‌చేసి గోపి గుండెపోటుతో చనిపోయాడని చెప్పారని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. తమ బిడ్డ ఎన్నడూ అనారోగ్యానికి గురికాలేదని, ఏం జరిగి ఉంటుందో తమకు తెలియడం లేదని తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్నారు. గోపికి 2019 మే నెలలో ప్రకాశం జిల్లా పేరాల గ్రామానికి చెందిన లక్ష్మీశ్రావణితో వివాహమైంది. గోపీ జనవరి నెలలో సంక్రాంతి పండుగకు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి జనవరి 27వ తేదీన భార్యతో సహా రాంచీకి వెళ్లాడు. గోపీ భార్య లక్ష్మీశ్రావణి ప్రస్తుతం రాంచీలోనే ఉంది. గోపీ మృతదేహాన్ని అధికారులు శుక్రవారం రాత్రికి చింతాయపాలెం తీసుకొస్తారని బంధువులు తెలిపారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
పాములపాడు: జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకుంటానని పెళ్లి సమయంలో చేసిన బాసలు మరిచిపోయాడు.. అగ్ని సాక్షిగా తన వెంట ఏడడుగులు నడిచిన భార్యను కనికరం లేకుండా కడతేర్చాడు. కన్న పిల్లలకు తల్లిని దూరం చేశాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో మంగళవారం భార్య విజయలక్ష్మి(24)ని ఇంట్లోనే గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఎర్రగూడూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నాయక్ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా కేరళలో విధులు నిర్వహిస్తున్నాడు. బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె గ్రామానికి చెందిన స్వామినాయక్, స్వామిలీబాయి దంపతుల కుమార్తె విజయలక్ష్మిని ఏడేళ్ల కిత్రం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇందు(6), ధరణి(4), గౌతమి(2) అనే ముగ్గురు కూతుళ్లున్నారు. ప్రస్తుతం విజయలక్ష్మి గర్భిణీగా ఉంది. అయితే పెళ్లికి ముందునుంచే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వెంకటేశ్వర్లు తర్వాత కూడా కొనసాగించాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరుచుగా గొడవలు జరిగేవి. మంగళవారం ఇద్దరి మధ్య మొదలైన గొడవ చివరకు విజయలక్ష్మి హత్యకు దారి తీసింది. మృతురాలి బంధువుల ఆందోళన.. విజయలక్ష్మి హత్యకు గురైనట్లు తెలుసుకున్న పుట్టినింటివారు, బంధువులు పెద్ద సంఖ్యలో ఎర్రగూడూరుకు చేరుకొని ఆందోళనకు దిగారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతోనే భార్యను చంపేశాడని ఆరోపించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఇంట్లోనే పూడ్చేం దుకు గొయ్యి తవ్వే ప్రయత్నం చేశారు. డీఎస్పీ మాధవరెడ్డి, ఆత్మకూరు, నందికొట్కూరు సీఐలు కృష్ణయ్య, వెంకరటరమణ, ఎస్ఐలు పవన్‌కుమార్, వెంకటసుబ్బయ్య, సుబ్బరామిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, అశోక్ సిబ్బం దితో గ్రామానికి చేరుకుని ఉద్రిక్తత తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. చివరకు బాధిత కుటుంబీకులకు సర్ధి చెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వెంకటేశ్వర్లు, తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని, గాలింపు చేపట్టి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. పసితనంలోనే తల్లి దూరం.. విజయలక్ష్మి మరణం కారణంగా ఆమె ముగ్గురు చిన్నారులు తల్లిలేనివారయ్యారు. ఏమి జరిగిందో తెలియక తల్లి మృతదేహం వద్ద కూర్చుని అమాయకంగా చూస్తున్న చిన్నారులను చూసి బంధువులు, గ్రామస్తుల కళ్లు చెమ్మగిళ్లాయి. -
పెళ్లి పేరుతో ఎగతాళి
⇒ యువతికి అక్రమ సంబంధం అంటగట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ⇒ గాజువాక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ⇒ 50 రోజుల తర్వాత తమ పరిధి కాదన్న పోలీసులు ⇒ మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందని బాధితురాలి ఆరోపణ ⇒ పెళ్లి కొడుకును అరెస్టు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ గాజువాక : ఒక యువతితో వివాహం కుదుర్చుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కట్నం ఎక్కువ వస్తుందనే దురాశతో మరో యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. పెళ్లి పేరుతో యువతిలో రేపిన ఆశలను అక్రమ సంబంధం అంటగట్టి తుంచేశాడు. అందుకోసం ఒక బినామీ ప్రేమికుడిని సృష్టించాడు. పెళ్లి పెద్దలను సైతం పక్కన పెట్టేశాడు. లగ్న పత్రిక రాసుకున్న తర్వాత ఇలా చేయడం అన్యాయం బాబూ అని వేడుకున్న యువతి తల్లిదండ్రులను దిక్కున్నచోట చెప్పుకోమన్నాడు. దిక్కులేక ఖాకీలను ఆశ్రయించిన బాధితురాలిని 50 రోజులపాటు తమ స్టేషన్ చుట్టూ తిప్పించుకున్న గాజువాక పోలీసులు ఇప్పుడా కేసు తమ పరిధిలోకి రాదంటూ చల్లగా సెలవిచ్చారు. ఈ తతంగం వెనుక మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందని బాధితులు బోరుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితురాలు మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మను ఆశ్రయించింది. ఈ మేరకు గాజువాకలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు వివరించింది. ఆమె కథనం ప్రకారం... శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం టెక్కలిపాడు గ్రామానికి చెందిన దుంగా అప్పలనాయుడు కుమారుడు పాపారావు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గాజువాక దరి శ్రీనగర్ అఫీషియల్ కాలనీకి చెందిన రెడ్డి పిన్నన్న కుమార్తె వసంత కుమారిని వివాహం చేసుకోవడానికి పెద్దల ద్వారా సంబంధం ఖాయం చేసుకున్నాడు. రూ.9.5లక్షల కట్నం, ఇతర లాంఛనాలు చెల్లించడానికి పిన్నన్న అంగీకరించడంతో వచ్చే నెల 7న వివాహం చేయాలని నిర్ణయించుకొని లఘ్నపత్రిక రాసుకున్నారు. ఇంతలో ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధం కుదరడంతో వసంత కుమారిని వదిలించుకునేందుకు పాపారావు ఓ స్కెచ్ వేశాడు. ఆమెకు ఫోన్ చేసి ‘నీకు ఎవరితోనే ప్రేమ వ్యవహారం ఉందని విన్నాను. ఆ వ్యక్తి నాకు మెసేజ్‌లు పంపుతున్నాడు. అందువల్ల నిన్ను పెళ్లి చేసుకోన’ని చెప్పాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాపారావు తల్లిదండ్రులను సంప్రదించారు. వారు కూడా తమ కుమారుడినే సమర్థించి ఈ వివాహం చేసుకోబోమని స్పష్టం చేశారు. పెళ్లి పెద్దలు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అనడమే కాక సెటిల్మెంట్ చేసుకుందామంటూ మాట్లాడారు. ఎక్కువ కట్నానికి ఆశపడి వేరే యువతితో వివాహం కుదర్చుకున్నారని, ఈ నెల 24న ఆమెతో వివాహం జరగనుందని వసంత కుమారి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తమను మోసం చేసిన పాపారావు, అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని బాధితులు ఫిబ్రవరి 12న గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో పాపారావు, అతడి తల్లిదండ్రులను గాజువాక పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. విచారణలో ప్రేమ వ్యవహారం అంతా కట్టుకథ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అప్పటికి 50 రోజులు అయినప్పటికీ బాధితుల ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదు. దీనిపై మహిళా చేతన ప్రతినిధులు పది రోజుల క్రితం పోలీసులను నిలదీయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ ఆరు రోజులు తిప్పించుకున్నారు. చివరకు ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు తేల్చి చెప్పారు. ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం కేసు నమోదు చేయడానికి అన్ని అవకాశాలున్నప్పటికీ మంత్రి అచ్చెన్నాయుడు కార్యాలయం నుంచి వస్తున్న ఫోన్ల వల్ల పోలీసులు కేసు నమోదు చేయలేదని కత్తి పద్మ ఆరోపించారు. పోలీసులు మంత్రి కనుసన్నల్లో నడిచి యువతికి అన్యాయం చేశారన్నారు. పాపారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. సీఐఎస్ఎఫ్ అధికారులు స్పందించి అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.