కరీంనగర్: ‘అమ్మ.. ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. ఇక నీతోనే ఉంటాను..’ అని చెప్పిన ఓ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ అనంతలోకాలకు వెళ్లాడు. రాజస్థాన్ డియోలి సీఐఎస్‌ఎఫ్ 16వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం జగ్గారావుపల్లికి చెందిన కానిస్టేబుల్ చాడ శివకుమార్(23) జైపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. గ్రామస్తులు, కుటంబసభ్యులు తెలిపిన వివరాలు. జగ్గారావుపల్లికి చెందిన చాడ భాగ్యమ్మ–గోపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు గంగారెడ్డి సిరిసిల్లలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండో కుమారుడు శివకుమార్ రెండేళ్ల క్రితం సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికై రాజస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గత డిసెంబర్ 16న కార్యాలయ పరిసరాల్లో శివకుమార్ ప్రమాదవశాత్తు కింద పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. తోటి ఉద్యోగులు జైపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. తలకు బలమైన గాయం కావడంతో రక్తం గడ్డ కట్టి శివకుమార్ కోమాలోకి వెళ్లాడు. చికిత్స పొందుతున్న శివకుమార్ సోమవారం మృతిచెందినట్లు జగ్గారావుపల్లి లోని కుటుంబ సభ్యులకు అక్కడి ఉద్యోగులు సమాచారం అందించారు.
కొత్త సంవత్సరం రోజు గ్రామంలో విషాదం..
నూతన సంవత్సరం తొలి రోజే గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శివకుమార్ మృతిచెందడంతో జగ్గారావుపల్లిలో విషాదం నెలకొంది. కానిస్టేబుల్‌గా ఎంపికై న శివకుమార్ పోస్టింగ్ వస్తే జిల్లాకు వచ్చేవాడు. కానీ కానిస్టేబుల్ ఫలితాలపై కోర్టులో కేసు ఉండడంతో పోస్టింగ్‌లు ఆగిన విషయం తెలిసిందే. శివకుమార్ మృతితో అతని స్నేహితులు, కుటుంబసభ్యులు విషన్నవదనంలో ఉన్నారు. మంగళవారం మృతదేహం స్వగ్రామానికి వస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment