అభిప్రాయం
హిమాచల్ ప్రదేశ్ మండీ లోక్ సభ స్థానం నుండి నూతనంగా ఎన్నికైన ప్రముఖ సినీ తార కంగనా రనౌత్‌ను చండీగఢ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ విధులను నిర్వహిస్తున్న కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ చెంప మీద కొట్టడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎందుకు కొట్టావు అని సదరు ఎంపీ అడిగినప్పుడు రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు ఈ చెంప దెబ్బ అని దురుసుగా సమాధానం చెప్పడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.
ఆ కానిస్టేబుల్ సోదరుడు కిసాన్ మజ్దూర్ సంఘ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడం, ఆమ్ ఆద్మీ సపోర్టుగా ఉండడం బట్టి చూస్తే– కంగనా రనౌత్‌పై దాడి యాదృచ్చికంగా జరిగింది కాదనీ, ఇది ఒక ప్రణాళికా బద్ధంగానే జరిగిందనే భావన కలుగక మానదు. నూతనంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సమగ్రమైన విచారణ జరిపి, దేశ ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమం పేరుతో రైతుల ముసుగులో ఖలిస్థాన్ వేర్పాటు వాదుల మద్దతుదారులు రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండాను ఎగరవేయడం, శాంతి భద్రతలను పరిరక్షించడానికి వచ్చిన అనేకమంది పోలీసుల తలలు పగలగొట్టడం వంటి దృశ్యాలు దేశ ప్రజల స్మృతి పథంలో ఇప్పటికీ స్థిరంగానే ఉన్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ప్రతిపక్షాలు తమ రాజకీయ స్వార్థం కోసం రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమకారులను రెచ్చగొడుతున్నాయనీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో అనేక చోట్ల హింస చెలరేగి శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందనీ నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు సందర్భోచితంగా సంయమనం పాటించారు. దీంతో దేశానికి పెద్ద ముప్పే తప్పింది.
ప్రభుత్వ విధానాలపైనా, దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలూ, ఉద్యమాలపైనా అనేకమంది వ్యతిరేకంగా, అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాగే ఒక పౌరురాలిగా కంగనా కూడా రైతు ఉద్యమంపై వ్యాఖ్య చేశారు. ఈ చెంప దెబ్బ ఆ వ్యాఖ్యలు చేసినందుకే కొట్టానని కౌర్ చెప్పిన సమాధానం నమ్మశక్యంగా లేదు.
సిక్కు తీవ్రవాద భావాలు కుల్విందర్ కౌర్ మనసులో ఎవరైనా నాటి ఉండవచ్చునేమో! ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు? 1984 అక్టోబర్ 31న భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని కాల్చి చంపిన ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లు సిక్కులు అనే విషయం మరవకూడదు. నాడు వారు ‘ఖలిస్థాన్’ వేర్పాటు వాద భావజాలాన్ని తలకెక్కించుకుని ఆ ఘాతుకానికి ఒడిగట్టారు.
సిక్కు వేర్పాటు వాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023 జూన్ 18న కెనడాలో హత్యకు గురైన తర్వాత, కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలలో ఖలిస్థాన్ వేర్పాటు వాదుల మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో... నిజర్ హత్య వెనుక భారత ప్రభుత్వ నిఘా వర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా అమెరికా దౌత్యవేత్తలు మాట్లాడడం, భారత ప్రభుత్వం ఇందుకు ఆధారాలు చూపించాలని కౌంటర్ వేయడం వంటి వాటి నేపథ్యంలో ఈ సంఘటనను పరిశీలించాలి.
ఉల్లి బాల రంగయ్య
వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment