మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చేందుకు గుంత తవ్వే ప్రయత్నం చేస్తున్న బంధువులు, (ఇన్‌సెట్) విజయలక్ష్మి మృతదేహం వద్ద బంధువులు
పాములపాడు: జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకుంటానని పెళ్లి సమయంలో చేసిన బాసలు మరిచిపోయాడు.. అగ్ని సాక్షిగా తన వెంట ఏడడుగులు నడిచిన భార్యను కనికరం లేకుండా కడతేర్చాడు. కన్న పిల్లలకు తల్లిని దూరం చేశాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో మంగళవారం భార్య విజయలక్ష్మి(24)ని ఇంట్లోనే గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఎర్రగూడూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నాయక్ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా కేరళలో విధులు నిర్వహిస్తున్నాడు. బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె గ్రామానికి చెందిన స్వామినాయక్, స్వామిలీబాయి దంపతుల కుమార్తె విజయలక్ష్మిని ఏడేళ్ల కిత్రం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇందు(6), ధరణి(4), గౌతమి(2) అనే ముగ్గురు కూతుళ్లున్నారు. ప్రస్తుతం విజయలక్ష్మి గర్భిణీగా ఉంది. అయితే పెళ్లికి ముందునుంచే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వెంకటేశ్వర్లు తర్వాత కూడా కొనసాగించాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరుచుగా గొడవలు జరిగేవి. మంగళవారం ఇద్దరి మధ్య మొదలైన గొడవ చివరకు విజయలక్ష్మి హత్యకు దారి తీసింది.
మృతురాలి బంధువుల ఆందోళన..
విజయలక్ష్మి హత్యకు గురైనట్లు తెలుసుకున్న పుట్టినింటివారు, బంధువులు పెద్ద సంఖ్యలో ఎర్రగూడూరుకు చేరుకొని ఆందోళనకు దిగారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతోనే భార్యను చంపేశాడని ఆరోపించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఇంట్లోనే పూడ్చేం దుకు గొయ్యి తవ్వే ప్రయత్నం చేశారు. డీఎస్పీ మాధవరెడ్డి, ఆత్మకూరు, నందికొట్కూరు సీఐలు కృష్ణయ్య, వెంకరటరమణ, ఎస్‌ఐలు పవన్‌కుమార్, వెంకటసుబ్బయ్య, సుబ్బరామిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, అశోక్ సిబ్బం దితో గ్రామానికి చేరుకుని ఉద్రిక్తత తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. చివరకు బాధిత కుటుంబీకులకు సర్ధి చెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వెంకటేశ్వర్లు, తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని, గాలింపు చేపట్టి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.
పసితనంలోనే తల్లి దూరం..
విజయలక్ష్మి మరణం కారణంగా ఆమె ముగ్గురు చిన్నారులు తల్లిలేనివారయ్యారు. ఏమి జరిగిందో తెలియక తల్లి మృతదేహం వద్ద కూర్చుని అమాయకంగా చూస్తున్న చిన్నారులను చూసి బంధువులు, గ్రామస్తుల కళ్లు చెమ్మగిళ్లాయి.
Comments
Please login to add a commentAdd a comment