సాక్షి, విశాఖపట్నం: పాకిస్తాన్ ఎప్పటిలానే తన కపట బుద్దిని ప్రదర్శిస్తోంది. భారత అంతర్గత వ్యవహారాలను తెలుసుకునేందుకు ఉద్యోగులపై హానీ ట్రాప్ వల విసురుతోంది. తాజాగా పాక్ హానీ ట్రాప్‌లో ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చిక్కుకున్నాడు. అనుమానం రావడంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ జగదీష్ భాయ్ మురారీ పని చేస్తున్నాడు.
అంతకు ముందు రక్షణ రంగంలో కీలకమైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహించేవాడు. దీంతో అతని నుంచి కీలక సమాచారం తెలుసుకునే క్రమంలో పాకిస్తాన్ అతనిపై హనీట్రాప్ ప్లాన్‌ని ప్రయోగించింది. ఓ ఉగ్రవాద సంస్థకి చెందిన పెద్ద నాయకుడి పీ.ఏకి తమిషా అనే పాకిస్తాన్ యువతితో పరిచయం ఉంది. ఆ యువతితో సోషల్ మీడియా ద్వారా కపిల్‌తో పరిచయం పెంచుకుంది. రెండేళ్ల పాటు ట్రాప్ చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టింది.
న్యూడ్ వీడియో కాల్స్‌తో మొదలై.. రహస్యంగా ఓ గదిలో కలిసేంత వరకు వీరి కథ నడిచింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కపిల్ కుమార్ కదలికలపై ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా కపిల్ కుమార్ ఏడాది క్రితం హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి విశాఖలో పని చేస్తున్నాడు. కీలక సమాచారం పాకిస్థాన్ గూఢచార సంస్థకు చేరినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
కపిల్ కుమార్ మొబైల్స్ స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ ఫోరెన్సిక్ విచారణకు పంపింది. తదుపరి విచారణ కోరుతూ స్టీల్ ప్లాంట్ పోలీసు స్టేషన్‌లో సీఐఎస్ఎఫ్ యూనిట్ ఇన్ఛార్జ్ ఫిర్యాదు చేశారు. అధికారిక రహస్యాల ఉల్లంఘన నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ అంశం అంతరంగిక భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో వివిధ ఏజెన్సీలు దర్యాప్తులోకి దిగాయి.
చదవండి వచ్చినవాడు గద్దర్.. ఆ హెడింగ్ చూసి ఆశ్చర్యపోయాం!
Comments
Please login to add a commentAdd a comment