సాక్షి, హైదరాబాద్: ‘కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితా’ సెప్టెంబర్ మూడోవారంలో విడుదల కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడిపై పోలీస్ నియామక మండలి కసరత్తు ముమ్మరం చేసింది. పోలీస్‌శాఖలోని వివిధ విభాగాలు, జైళ్లశాఖ, అగ్నిమాపకశాఖ, రవాణా, ఎక్సైజ్‌శాఖల్లో కలిపి మొత్తం 16,929 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఇప్పటికే తుదిరాత పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలు మే 30న పోలీస్ నియామకమండలి వెల్లడించడం తెలిసిందే. జూన్ 1వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. గత కొన్ని రిక్రూట్‌మెంట్‌ల మాదిరిగానే ఈసారి కూడా ముందుగానే ఎస్‌ఐ పోస్టుల తుది ఎంపిక జాబితాను బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారి నియామక ప్రక్రియ తుదిదశలో ఉంది. ప్రస్తుతం ఎస్‌బీ ఎంక్వైరీ, మెడికల్ టెస్ట్ నడుస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఎస్‌ఐల శిక్షణ ప్రారంభిస్తారు.
ఈ నేపథ్యంలో రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు కానిస్టేబుల్ ఫలితాలపై దృష్టి సారించారు. మొత్తం 1,01,600 మంది అభ్యర్థులు తుది అర్హత సాధించిన వారిలో ఉన్నారు. వీరికి సంబంధించిన అన్ని రికార్డులు, ఆయా జోన్లు, పోలీస్, రెవెన్యూ జిల్లాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. తుది పోటీలో ఉన్న వారిలో ప్రతి ఆరుగురు అభ్యర్థుల్లో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తం ప్రక్రియ ముగిసేందుకు మరో మూడు నుంచి నాలుగు వారాలు సమయం పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment