డేంజర్‌లో ఉన్నారు జాగ్రత్త : సీఎం కేసీఆర్‌ | 39 TRS MLAS Are in Danger Zone | Sakshi
Sakshi News home page

డేంజర్‌లో ఉన్నారు జాగ్రత్త : సీఎం కేసీఆర్‌

Published Thu, Jun 7 2018 12:50 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

39 TRS MLAS Are in Danger Zone - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు డేంజర్‌ జోన్‌లో ఉన్నారా? పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో వారంతా గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదా? ఈ జాబితాలో పలువురు చైర్మన్లు, ప్రభుత్వ విప్‌లతోపాటు ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారా? ఇందుకు అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు! నియోజకవర్గాల్లో విపత్కర పరిస్థితులున్నాయంటూ ఆ 39 మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించినట్టుగా తెలిసింది. వీరిలో కొందరితో కేసీఆరే నేరుగా మాట్లాడారు. మరికొందరు ఎమ్మెల్యేలకు వారికి దగ్గరగా ఉన్న మంత్రులతో చెప్పించారు. మంత్రులు కేటీఆర్, టి.హరీశ్‌రావు సన్నిహితులకు వారితోనే ఈ విషయాన్ని చెప్పించినట్టుగా సమాచారం. పార్టీకి, ఎమ్మెల్యేలకు ఆదరణ ఎక్కువగా ఉందని అంచనా వేసుకుంటున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ పలువురు సీనియర్ల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని కేసీఆర్‌కు నివేదికలు అందాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అయితే ఎక్కువ మంది పనితీరుపై వ్యతిరేకత ఉండగా.. కొందరి పరిస్థితి చాలా దారుణంగా ఉందని వివిధ సర్వేల నివేదికల ద్వారా తేలింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తేలిన 39 మందికి హెచ్చరికలు జారీ అయ్యాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటే ఎవరూ కాపాడలేరని సీఎం స్పష్టంగా చెప్పారు. 

100 సీట్లపై ధీమా : గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 63 మంది ఎమ్మెల్యేలను గెల్చుకుని అధికారం చేపట్టింది. తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేల అకాల మరణం (నారాయణఖేడ్, పాలేరు) కారణంగా వచ్చిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలనూ టీఆర్‌ఎస్‌ గెల్చుకుంది. టీడీపీ(12), కాంగ్రెస్‌(7), వైఎస్సార్‌ కాంగ్రెస్‌(3), బీఎస్పీ(2), సీపీఐ(1) నుంచి మొత్తం 25 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బలం 90 మందికి చేరింది. రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్న 90 మంది ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గకుండా గెల్చుకోవాలనే పట్టుదలతో కేసీఆర్‌ ఉన్నారు. ఇందుకు రాష్ట్రంలో అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేస్తున్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, రైతుబంధు, రైతు బీమా వంటి భారీ బడ్జెట్‌తో కూడిన పథకాలను అమలు చేస్తున్నారు. వీటితోపాటు పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్‌ కిట్లు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వీటితో టీఆర్‌ఎస్‌కు తిరుగులేని ఆధిక్యత వస్తుందన్న విశ్వాసంతో కేసీఆర్‌ ఉన్నారు. వీటి భరోసాతోనే కనీసం 100 స్థానాలు గెలుస్తామని బహిరంగ సమావేశాల్లో ముఖ్యమంత్రి చెబుతున్నారు. కనీసం ఇప్పుడున్న 90 సంఖ్యను తగ్గకుండా గెలుస్తామని అంతర్గత సమావేశాల్లో ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఏం తేలింది? 
రైతుబంధు పథకం అమలు తర్వాత జరిగిన సర్వేలు, వివిధ మార్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికల్లో వచ్చిన సమాచారంతో సీఎం కేసీఆర్‌ షాక్‌కు గురయినట్టు టీఆర్‌ఎస్‌ ముఖ్యులు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌కు ఉన్న 90 మందిలో 39 మంది డేంజర్‌ జోన్‌లో ఉన్నారంటూ నివేదికలు అందాయి. నియోజకవర్గంలో అంతా తమదే రాజ్యం అని, ప్రత్యర్థి పార్టీలకు కనీసం పోలింగ్‌ ఏజెంట్లు కూడా లేరని కేసీఆర్‌ చుట్టున్న నాయకులు చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లోనూ క్షేత్రస్థాయి పరిస్థితులు ఆశ్చర్యానికి గురి చేసినట్టుగా తెలిసింది. వీరిలో ఇద్దరు మంత్రులు కూడా ఉండటంతో కేసీఆర్‌ అప్రమత్తం అయ్యారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన పలు కార్పొరేషన్‌ చైర్మన్లు, విప్‌ల పరిస్థితి అయితే పార్టీకి ఉన్న ఆదరణలో సగం కూడా లేదని తేలింది. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై వివిధ కారణాలతో పార్టీ శ్రేణులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, తటస్థులు వ్యక్తిగతంగా ఆగ్రహంతో ఉన్నారని తేలింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదమని చెబుతూ 39 మంది ఎమ్మెల్యేలకు రాతపూర్వకంగా నివేదికల వివరాలను పంపించినట్టుగా తెలిసింది. నియోజకవర్గాల్లో ఏయే కారణాల వల్ల వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మండలాల వారీగా అందించారు. 

ఇలా ఉంటే కష్టమే.. 
ఎమ్మెల్యేల పనితీరుపై హెచ్చరికతో కూడిన నివేదికను పంపించడంతోపాటు పార్టీ ముఖ్యులను ఆయా ఎమ్మెల్యేలతో మాట్లాడాలని కేసీఆర్‌ ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ నేరుగా మాట్లాడి హెచ్చరించారు. ‘‘పార్టీ పనితీరుపై మీ నియోజకవర్గం సానుకూలంగా ఉంది. ఎమ్మెల్యేగా మాత్రం మీపై వ్యతిరేకత ఉంది. పార్టీ పనితీరుకు ఉన్న ఆదరణలో సగం కూడా మీకు లేదు. ఇది వ్యక్తిగతంగా మీకు మాత్రమే కాకుండా పార్టీకి చాలా నష్టం. ఎమ్మెల్యేలు గెలిస్తేనే టీఆర్‌ఎస్‌కు అధికారం వస్తుందని గుర్తుంచుకోవాలి. మీ పనితీరు ఎలా ఉన్నా అభ్యర్థిగా మీకే అధికారం ఇచ్చి, టీఆర్‌ఎస్‌కు అధికారం వచ్చే అవకాశాలను వదులుకోలేం. మీకు ఏయే కారణాలతో వ్యతిరేకత పెరిగిందో, ఏయే వర్గాలు మీకు దూరమయ్యాయో స్పష్టంగా, నిర్దిష్టంగా అందిస్తున్నాం. మీరేం చేస్తారో మీ ఇష్టం. మీ పనితీరు మారకుంటే, ఆదరణ పెంచుకోకుంటే కష్టం’’ అని స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా సమాచారం. వ్యక్తిగతంగా పనితీరును ఎలా మార్చుకుంటారో, బలమెలా పెంచుకుంటారో నివేదిక ఇవ్వాలంటూ ఆ 39 మంది ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ అయినట్టుగా తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement